గాంధీ చేసిన ఆ మేళ్లు మరువలేం... ఆ తప్పును మన్నించలేం

VSK Telangana    01-Oct-2024
Total Views |
 
mg gandhi
 
- కస్తూరి రాకా సుధాకర్
 
మహాత్మా గాంధీకి సంబంధించిన మూల్యాంకనం నిజానికి నిష్పాక్షికంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రతి రోజూ పొద్దున్నే స్మరించుకునేటువంటి నాయకుల్లో ప్రాతఃస్మరణీయ వ్యక్తుల్లో మహాత్మాగాంధీ పేరుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంటి హిందుత్వ సంస్థ మహాత్మాగాంధీ పేరుని అనునిత్యము, ప్రతినిత్యము స్మరిస్తోందంటే ఆయన ఈ దేశానికి చాలా మేలు చేసిన వ్యక్తి అయితే మాత్రమే వారిని స్మరిస్తుంది. కాబట్టి గాంధీ గారికి సంబంధించినంత వరకు ఒక నిష్పాక్షిక మూల్యాంకనం జరగాలి. గాంధీ జీ విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయి. ఆయన ముస్లిములను చేరదీయడం అనేది ఒక వ్యూహంగా అనుసరించాలా? ఒక సిద్ధాంతంగా అనుసరించాలా? అన్నటువంటి విషయంలో ఆయన పొరపాటు చేశారు.
 
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అంతటివారు కూడా ముస్లింలతో 1916 లక్నో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత అయన Luck-now at lucknow (లక్నోలో మాకు అదృష్టం కలిసొచ్చింది) అని అన్నారు. ఒక వ్యూహంలో భాగంగా ముస్లింలని కలుపుకుపోయే పని తిలక్ గారు చేశారు. అయితే, గాంధీ జీ దానిని సిద్ధాంతంగా మార్చి, "ఇది జరగకపోతే అసలు స్వాతంత్రం వద్దు. హిందూ ముస్లిం సమైక్యత కోసం అవసరమైతే స్వాతంత్య్రాన్ని ఆలస్యం చేద్దాం. హిందువులు తమ ప్రయోజనాల్ని ముస్లింలతో మైత్రి కోసం త్యాగం చేయాలి" అంటూ ఈ సూత్రీకరణ ఏదైతే ఆయన చేశారో దురదృష్టవశాత్తు అది దేశ విభజనకు దారితీసింది. దేశ విభజనను ఆపగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ గాంధీ గారు ఆపలేదు. కాబట్టి ముస్లిం తుష్టీకరణ, దేశ విభజన ఈ రెండు విషయాల్లో గాంధీ గారు చేసినటువంటి తప్పిదాలను క్షమించే ప్రసక్తే లేదు. మరిచిపోయే ప్రసక్తే లేదు. ఈ విషయంలో నిర్మొహమాటంగా అనవలసిన అవసరం కూడా ఉంది.
 
కానీ, గాంధీ గారికి సంబంధించినంత వరకూ కొన్ని అంశాలను మనం దృష్టిలో తీసుకోవాలి. ఆయన ఈ దేశానికి చేసినటువంటి మూడు నాలుగు గొప్ప మేళ్లను మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఆయన ఏదో అప్పుడప్పుడూ వెలిగేటువంటి మిణుగురు పురుగులా ఉన్నటువంటి స్వాతంత్రోద్యమాన్ని ఆయన ఒక సతత ప్రక్రియగా మార్చారు. అంటే ఉద్యమం లేని సమయంలో ఏం చేయాలి? కార్యకర్తలు ఏ రకంగా శిక్షణ పొందాలి? దీని మీద ఆయన ఆలోచించడమే కాకుండా హరిజనోద్ధరణ, మహిళా విద్య, హిందీ ప్రచారం, కుష్టురోగుల సేవ, ఆదివాసీ - వనవాసీ ప్రాంతాలలోకి వెళ్లి పనిచెయ్యడం. ఈ రకంగా కార్యకర్తలను వివిధ పనులకు ఆయన పంపించేవారు. ఇది, అంటే సమాజంలో అన్ని రంగాలలోకీ కావలసిన కార్యకర్తలను తయారు చేసి ఖాదీ తర్వాత, స్వదేశీ, ఆ తర్వాత హరిజనోద్ధరణ ఇలా అన్ని రంగాలకూ కావలసిన కార్యకర్తలను తయారు చేశారు. గాంధీ గారి ప్రేరణతోటే ఠక్కర్ బప్పా, వెన్నెలకంటి రాఘవయ్య గారు "ఆదిమజాతి సేవక్ సంఘ్" ప్రారంభించారు. గాంధీ జీ ప్రేరణతోనే కుష్టు నివారక్ సంఘ్ ప్రారంభమైంది, హరిజనుల ఉద్ధరణ కోసం స్కూలు పెట్టడం, వయోజన విద్య, అంటరానివారికి మందిర ప్రవేశం ఇవన్నీ కూడా ప్రారంభమైయ్యాయి.
 
గాంధీ జీ ప్రేరణతోనే హిందీ ప్రచార సభ ఏర్పాటు అయింది, హిందీ ప్రచారం జరిగింది. ఆయన గుజరాతీ అయినప్పటికీ హిందీ ప్రచారం చేశారు. మరాఠీ అయిన సావర్కర్ కూడా హిందీ ప్రచారం చేశారు. ఈ దేశాన్ని కలిపి ఉంచగలిగే సామర్థ్యం కల భాష హిందీ అని భావించారు. గాంధీగారి పనిలో భాగం హిందీ ప్రచారం. అందుకనే దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి ఎందరో హిందీ టీచర్లుగా పనిచేశారు. దక్షిణ భారతదేశంలో కొన్ని వేలమంది హిందీ టీచర్లను తయారు చేసినటువంటి ఘనత గాంధీ గారిది. కాబట్టి ఈ అన్ని రంగాల కోసం ఆయన సమాజంలో కార్యకర్తలను తయారుచేయడం, మూమెంట్‌ని బిల్డప్ చేయ్యడము, చరఖాతో నూలు వడకటం, ఈ రకంగా నూలు వడికితే స్వాతంత్య్రం వస్తుందా? రాదు. కానీ నూలు వడకటం అనేది నా స్వదేశీ తత్వానికి ప్రతీక. శాఖకు వెళితే ఈ దేశం బాగుపడుతుందా? బాగుపడదు. కానీ, శాఖకు వెళ్లడం ద్వారా బాగుపడేందుకు కావల్సిన మార్గాలను వెతికే కార్యకర్తలు తయారవుతారు. గాంధీగారు కూడా అదే పద్ధతిని అవలంబించారు. ఉద్యమాన్ని నిరంతరాయంగా నిలిపి ఉంచడంతో పాటు, బహుముఖమైనటువంటి కోణాలలో ఆయన పనిని విస్తృతీకరించారు.

gandhiiii 
 
ఇక రెండవది, వార్ధాలోను, సబర్మతిలోను ఇంకా దేశంలో ఒక పది, పన్నెండు ఆశ్రమాలను స్థాపించి, వాటిలో నిత్య కార్యకర్తల నిర్మాణ కార్యపద్ధతిని ఆయన వికసింపచేశాడు. దీని వల్ల గాంధీ గారికి కార్యకర్తలు తయారయ్యేవారు. గాంధీ గారి ప్రేరణతో వచ్చి స్వదేశీలోను, కుష్టు నివారణలోను, గో సేవలోను పని చేసినటువంటి వాళ్లు. రెండవది గాంధీ గారు ఏ దశలోనూ కూడా గోహత్యను సమర్ధించలేదు. ఎంత ముస్లిం బుజ్జగింపు చేసినా గో హత్యను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. అంతే గట్టిగా హిందీ ప్రచారాన్ని కూడా సమర్ధించారు. గాంధీ గారు చివరి వరకు కూడా "తాను హిందువును" అన్న విషయంలో ఎటువంటి రాజీ పడలేదు. ఎందుకంటే తన ప్రార్థనా సమావేశాల్లో ఆయన పాడించే "రఘుపతి రాఘవ రాజారాం" భజన్ తప్పితే మిగతావన్నీ రామ భజనలే. వైష్ణవ జన కో తేనే కహియే వంటివి పాడించేవారు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి, గాంధీ గారు స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి నిరంతరాయంగా కొనసాగేలా ఉద్యమాన్ని నిర్మించడంతో పాటుగా కొద్దిపాటి హింసకు తావు ఉన్నా ఉద్యమాన్ని ఆపేవారు. హింసకు తావు ఇస్తే పోలీసుల అత్యాచారాలు ప్రజల మీద ఏ రకంగా ఉంటాయనేది ఆయనకు తెలుసు కాబట్టి, ఉద్యమాలను హింస వైపు పోనివ్వలేదు. ఇది కూడా గాంధీగారి గొప్పతనంగా మనం భావించాలి.
 
మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్నికల్లో ముస్లింలకు వేరుగా సీటు ఇవ్వడానికి ఆయన అంగీకరించినా దళితులకు వేరే సీట్లు ఇవ్వాలన్న అంశాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించారు. బ్రిటిష్ వాళ్ళు, అంబేద్కర్ కలసి దళితులకు గ్రామాలలోని ఎలక్షన్స్‌లో వేరుగా సీట్లు ఇవ్వాలని, వాళ్ళ ఓట్లను తమ వాళ్లకు వాళ్లే వేసుకోవాలని చెప్పినప్పుడు గాంధీ గారు దాన్ని వ్యతిరేకించారు. ఆయన అన్న మాట ఏంటంటే.. "ప్రతి ఊరినీ రెండుగా విభజించే పనిని నేను అంగీకరించను" అని నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్షకు బాబా సాహెబ్ అంబేద్కర్ లొంగివచ్చి పూనాలో ఒప్పందం చేసుకున్నారు. సుప్రసిద్ధమైన పూనా ఒప్పందం అదే. ఒకవేళ గాంధీ జీ ఆ రోజున ఉద్యమం చేసి ఉండకపోతే ఈ రోజు ముస్లిముల సమస్య ఏ రకంగా అయితే జాతీయ స్థాయిలో సమస్యగా ఉందో, అదే విధంగా హరిజన వర్గాలు కూడా వేరువేరయ్యి, ముక్కలైపోయి, ప్రతి గ్రామంలోనూ రెండు దేశాలు తయారయ్యేవి. గాంధీ జీ అలా కానివ్వలేదు. బహుశా గాంధీ గారిని విమర్శించే చాలామందికి ఆయన చేసినటువంటి ఈ సాహసోపేతమయిన ఉద్యమం గురించి తెలియదు. ఆ రోజున గాంధీ జీ అలా నిలబడి ఉండకపోతే ప్రతి గ్రామంలోనూ దళితులు వేరే అభ్యర్థిని నిలబెట్టుకునేవారు. అప్పుడు దళితుల ఓట్లు దళితులకే పడేవి. దళితేతరుల ఓట్లు దళితేతరులకు పడేవి. ప్రతి గ్రామంలోనూ రెండు రెండు వర్గాలు ఉండేవి. ఒక పాకిస్తాన్, ఒక హిందుస్థాన్ కాకుండా గ్రామ గ్రామంలోను ఒక దళితస్థాన్ ఏర్పడి ఉండేది, దాన్ని గాంధీ గారు నిరోధించారు, నివారించారు, ప్రాణాలు అడ్డుపెట్టి ఆపారు. బహుశా ఇది గాంధీ గారు చేసిన అతి గొప్ప మేలుగా చెప్పుకోవాలి.
 
నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే, మహాత్మాగాంధీ ఈ దేశంలో కమ్యూనిజాన్ని పెరగనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 1925 తరువాత కమ్యూనిస్టులు చొరబడేందుకు చాలా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అని పెట్టారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూనే లోపలి నుంచి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే పని చేశారు. ఇవన్నీ గాంధీగారు గమనించారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఉండేవారు. అయితే సుభాష్ చంద్రబోస్ అదృష్టవశాత్తు చిత్తరంజన్ దాస్ శిష్యుడు కాబట్టి ఆయన స్వరాజ్య పార్టీ అని వేరే పార్టీ పెట్టుకున్నారు. అది వేరే కథ. కానీతరువాత కాలంలో కమ్యూనిస్టులు ఒక పెద్ద పథకం వేశారు. అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హరిపుర సదస్సు జరిగింది. సుభాష్ చంద్రబోస్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలా ఎన్నుకున్నందుకు మహాత్మాగాంధీ అడుగుపెట్టలేదు, అభ్యంతర పెట్టలేదు, పైగా సమర్థించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, ఆయన ప్రేరణతో సుభాష్ చంద్రబోస్ ఏడాదో రెండేళ్లో (పదవీ కాలం చెక్ చెయ్యాలి) పనిచేశారు. తరువాత రెండవ సారి మళ్ళీ సుభాష్‌నే అధ్యక్షులుగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రయత్నం చేసి యూత్‌ని మొబలైజ్ చేశారు. ఇది గాంధీ గారు గమనించిన తరువాత, వీళ్లందరూ ప్రయత్నం చేసి త్రిపురలో కాంగ్రెస్ సదస్సు పెట్టించారు. ఎందుకంటే త్రిపుర మొత్తం కూడా సుభాష్ చంద్రబోస్‌కి అనుకూలంగా వేస్తుంది. కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున సభ్యత్వం కోసం ప్రయత్నం చేసి, మొత్తానికి సుభాష్‌ని ముందు పెట్టి తమ పని చేయాలని కమ్యూనిస్టులు అనుకున్నారు.
 

mahatmaaaa 
 
సుభాష్ చంద్రబోస్‌కి ఇది తెలుసా? లేదా? అనేది మనకు తెలియదు. అనంతర కాలంలో సుభాష్ చంద్రబోస్ కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే వేరే విషయం కానీ ఆ సమయంలో కమ్యూనిస్టులు సుభాష్‌ని ఉపయోగించుకునే పనిచేసినప్పుడు గాంధీ జీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని తన అభ్యర్థిగా నిలబెట్టడమే కాకండా, పట్టాభి గారి ఓటమి నా ఓటమి అన్నారు. అంటే గాంధీ గారి సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం "ఆయన (పట్టాభి) ఓటమి నా ఓటమి" అని అనడం అదే మొట్టమొదటి సారి. అయితే పట్టాభి ఓడిపోయారు, సుభాష్ గెలిచారు. సుభాష్ గెలిచిన తర్వాత మహాత్మా గాంధీ ఆయన్ని సరిగ్గా పని చెయ్యనివ్వలేదు. కారణమేంటంటే, కమ్యూనిస్టులు మొత్తము కాంగ్రెస్ కమిటీలోకి వచ్చేస్తారన్న భయంతో గాంధీ నిలబడి ఫైట్ చేసిన కారణంగా సుభాష్ రాజీనామా చేశారు. తర్వాత సుభాష్ కమ్యూనిస్టుల సాయంతో రష్యా వెళ్లారు, జపాన్ వెళ్లారు. ఆ తరువాత కమ్యూనిస్టులు ఆయన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో దిగిందో ఆ తర్వాత కమ్యూనిస్టుల ధోరణి మారింది, సుభాష్ పట్ల అభిప్రాయం మారింది, ఆ తర్వాత కమ్యూనిస్టుల వెన్నుపోట్లు అదంతా వేరే చరిత్ర. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీని తమ గుప్పెట్లోకి తీసుకోకుండా నివారించడంలో గాంధీజీ కీలక పాత్ర వహించారు. అయితే సుభాష్ చంద్రబోస్‌ని పని చెయ్యనివ్వలేదన్న అప్రతిష్ట మూటకట్టుకోవడానికి కూడా గాంధీ సాహసించారు. ఈ నాలుగూ కూడా మహాత్మాగాంధీ గారి అతి గొప్ప సహాయాలు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా విశుద్ధమైన జీవితము, సిద్ధాంతానికి అనుగుణమైన జీవితము, సమయాన్ని అనుసరించి ప్రకారం బ్రతకటం, తాను ఎవరితో పోరాడుతున్ననో తెలిసీ, ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత గాని లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి.
 
గాంధీజీ లండన్‌కి రౌండ్ టేబుల్‌కి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజభవనాలలో ఉండకుండా మాంచెస్టర్‌లో ఉన్న కార్మికులు, అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఇళ్లలో ఉన్నారు. అంతే కాకుండా పేద బ్రిటిష్ ప్రజలతో I want your support in this fight against the might అన్నారు. "బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మా పోరాటం నిజమైనది, సత్యమైనది. మా మార్గానికి మీరు అండగా ఉండండి" అని అడిగారు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి గాంధీ జీని ఆటోగ్రాఫ్ అడిగితే 5 రూపాయలు వసూలు చేసేవారు. ఆ రోజుల్లో కొందరు గాంధీజీని "భారతీయులకు ఉచితంగా ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు, మా దగ్గర ఐదు రూపాయలు తీసుకుంటారేమిటి?" అని అడిగారు. దానికి గాంధీజీ "మీ నుంచి డబ్బులు తీసుకుని, మీ మీద పోరాడి, మిమ్మల్ని ఈ దేశం నుంచి పారద్రోలడం కోసం తీసుకున్నాను" అని జవాబిచ్చారు.
 
ఇక హిందూ-ముస్లిం విషయంలో గాంధీజీ చేసిన తప్పిదాన్ని క్షమించేది లేదు. కానీ, అదే సమయంలో ఈ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. మరోవైపు గాంధీ గారు ముస్లిం అని, ఆయన తల్లి ముస్లిం అని రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. గాంధీ గారి మీద ద్వేషాన్ని ఆయన తల్లిగారైన స్త్రీ పట్ల చూపించడం, ఆమె శీలం గురించి మాట్లాడటం అత్యంత పాశవికమైనటువంటి "అహిందూ" భావన. హిందువు ఏనాడు కూడా మహిళను ఈ రకంగా అవమానపరిచేవాడు కాదు. అలా అవమానపరిచిన రావణాసురుడికి, దుర్యోధనుడికి ఏ గతి పట్టిందో మనందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితంలో కూడా గాంధీ జీ భగవద్గీత నేర్చుకోవాలని అనుకున్నారు. అందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలంటే ఆయనకు కుదరదు కాబట్టి, ఆయన ముందు రోజు రాత్రే శ్లోకాన్ని రాసుకుని, పండ్లు తోముకునే చోట పెట్టి, పళ్లు తోముకుంటున్నంత సేపు ఆయన ఆ శ్లోకాన్ని మననం చేసి ఇలా రెండేళ్లు కష్టపడి మొత్తం భగవద్గీతను కంఠస్థం చేశారు. కాబట్టి వ్యక్తిగతంగా గాంధీజీది చాలా విశుద్ధ జీవనం. పైన చెప్పినవన్నీ గాంధీ గారు జాతికి చేసినటువంటి గొప్ప సహాయాలు. దళితులు ఈ సమాజం నుంచి వేరు రాకుండా కాపాడటం, కమ్యూనిస్టులు ఈ దేశంలో రాజకీయంగా పై చేయి సాధించకుండా ఆపడం, స్వాతంత్య్రోద్యమానికి నిరంతరాయంగా ఆధారాన్ని, ప్రక్రియను ఇవ్వడము. దానితోపాటు స్వాతంత్రం వచ్చాక చేయవలసిన అన్ని పనుల గురించి స్పష్టత కలిగి ఉండటం. అవి స్వదేశీ విషయంలో గాని, దేశంలో ఎటువంటి పరిశ్రమలు ఉండాలన్న విషయంలో గానీ.. ఇది గాంధీ గారి వల్ల జరిగిన అతి గొప్ప మేలు అని మనం గుర్తుంచుకోవలసిన అవసరముంది. మహాత్మా గాంధీని మనం ప్రాతఃస్మరణీయుడుగా భావిస్తున్న సమయంలో ఆయన చేసినటువంటి ఈ మూడు గొప్ప మేళ్లను మనము అర్థం చేసుకోవలసిన అవసరముంది.
 
గాంధీ గారికి సంబంధించినంత వరకూ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, గాంధీ గారు రావడానికి ముందు వరకూ స్వాతంత్య్ర పోరాటం కొన్ని కొన్ని ప్రాంతాలలో స్థానికంగా పోరాటాలు జరిగేవి. ప్రజల్లో స్వాతంత్రేచ్ఛ ఉండేది, స్వాతంత్య్ర పిపాస ఉండేది, పోరాడాలన్న భావన ఉండేది, విప్లవకారులు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ నిర్మించారు. కానీ, విప్లవకారుల నెట్‌వర్క్ సర్వసాధారణ ప్రజానీకానికి వెళ్లలేదు. అదే విధంగా స్థానికంగా మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్, పంజాబ్ ప్రాంతంలో లాలా లజపతిరాయ్, బెంగాల్ ప్రాంతంలో అరబిందో వంటి స్వాతంత్య్ర వీరులు, విప్లవవీరులు, తమిళనాడు ప్రాంతంలోను, ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన స్వాతంత్య్రోద్యమాన్ని దేశంలోని గ్రామగ్రామానికీ తీసుకెళ్లడంలో గాంధీగారి పాత్ర ఉంది. బహుశా గాంధీ గారు రైలుపెట్టెనే తన ఇల్లుగా మార్చుకుని పర్యటన చేశారు. గాంధీగారు సందర్శించిన ప్రతి స్టేషన్‌లోనూ ఒక స్థూపాన్ని పెడితే గాంధీ గారు దిగిన రైల్వే స్టేషన్లు ఈ దేశంలో కొన్ని వందలున్నాయి. ఏలూరు, రాజమండ్రి ఇలా చిన్న చిన్న ఊళ్లకి కూడా వెళ్లారు. ఏలూరుకి మహాత్మా గాంధీ గారు 3 సార్లు వచ్చారు. గుంటూరులోని ఒక ఆశ్రమానికి కూడా వచ్చారు. హైదరాబాద్, వరంగల్ కూడా సందర్శించారు.
 
దేశమంతటా తెలిసిన స్వాతంత్య్ర సమరయోధుడు ఎవరంటే గాంధీ గారే. సుభాష్ వంటివారు జాజ్జ్వల్యమానమైనటువంటి దేశభక్తి గల నేతలే అయినప్పటికీ వీళ్లకి ఆలిండియా రీచ్ లేదు. అందువలన అఖిల భారతస్థాయిలో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది గాంధీ గారే. కాబట్టి స్వాతంత్య్రోద్యమానికి నాయకుడు ఎవరంటే గాంధీ గారే. ఎందుకంటే ఆయన లెగ్ వర్క్ (ఉద్యమం కోసం క్షేత్ర స్థాయిలో పని) చేశారు. ముఖ్యంగా మనలాంటి కార్యకర్తలు గమనించాల్సింది ఏమిటంటే గాంధీ గారి లెగ్ వర్క్. ఆయన దేశమంతటా పర్యటించి ఆడపిల్లలు, మహిళలు ఇచ్చిన బంగారాన్ని స్వీకరించారు, ధనవంతుల విరాళాలను తీసుకున్నారు. గాంధీ గారు గ్రామ గ్రామాలలో ఎక్కడికి వెళితే అక్కడ ప్రార్థనలు నిర్వహించేవారు. వెళ్లిన చోటల్లా కొంత సేవా కార్యక్రమాలు చేసేవారు. ఇలా గాంధీ గారిని చూస్తే ఆయన ముఖ్యంగా లెగ్ వర్క్ చేశారు. మిగతా స్వాతంత్య్ర సమరయోధులు ఎవ్వరూ కూడా అంటే, నెహ్రూ గాని, పటేల్ గాని ఇంత లెగ్ వర్క్ చెయ్యలేదు. వారంతా ఆలిండియా నేతలు, పెద్ద నేతలు, కొందరు గొప్ప నేతలు ఉన్నారు. కానీ ఎవ్వరూ మహాత్మా గాంధీలా పని చెయ్యలేదు.
 
గాంధీజీ కొన్ని వేలమందికి తరచుగా లేఖలు రాసేవారు, సంబంధాలుండేవి. చిన్న చిన్న ఊళ్లల్లో ఉండే కార్యకర్తలు కూడా గాంధీ జీకి ప్రత్యక్షంగా తెలిసినటువంటి వారే. అంటే, లోకసంగ్రహం చెయ్యడంతో పాటు తన పనిని సర్వవ్యాపి, సర్వస్పర్శిగా మార్చడం మహాత్మా గాంధీ చేసినటు వంటి 4వ అతి గొప్ప మేలు. స్వాతంత్య్ర సమరం అంతకు ముందూ జరిగింది, విప్లవకారులు వచ్చారు, ఫడ్కే వచ్చారు, సావర్కర్ వచ్చారు, అందరూ వచ్చారు గానీ, వీళ్లలో చాలామంది గాంధీ గారు చేసిన తప్పులు చెయ్యలేదు. అయినప్పటికీ ఉద్యమాన్ని సర్వవ్యాపి, సర్వ స్పర్శిగా మార్చడంలో గాంధీజీ పాత్ర తిరుగులేనిది, విస్మరించలేనిది. మీరు ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా స్వాతంత్య్రోద్యమంలో ఉన్న నేతల పేర్లు చెప్పమంటే ఈ రోజుకి కూడా మొట్టమొదటి పేరు గాంధీదే వస్తుంది. గాంధీ గారు వెళ్లిపోయి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అందరికన్నా ముందు ఆయన పేరే ఈ దేశం చెబుతుంది. కాబట్టి ఇది కూడా గాంధీజీ వల్ల జరిగిన గొప్ప మేళ్లలో ఒకటిగా చెప్పుకోవాలి.