అనుమతి వున్నా... ఆరెస్సెస్ సాంఘీక్‌ను అడ్డుకున్న పోలీసులు

VSK Telangana    01-Oct-2024
Total Views |
rss keral
 
 కమ్యూనిస్టుల నియంత్రణలో వున్న కేరళలో అక్కడి ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సాంఘిక్ కోసం కల్లిక్కట్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆరెస్సెస్ కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కల్లిక్కట్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే.. సరిగ్గా కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని, అనుమతి లేదని అడ్డంగా వాదించడం ప్రారంభించారు. దీంతో స్వయంసేవకులు గ్రామపంచాయతీ ఇచ్చిన అనుమతి పత్రాలను పోలీసులకు చూపించారు. అయినా పోలీసులు వినలేదు. స్వయంసేవకులు ఎన్ని ఆధారాలు చూపించినా... పోలీసులు అనుమతి లేదని వాదించారు. చివరికి పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో పంచాయతీ ఆరెస్సెస్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి... రద్దు చేశారు.
 
దీంతో స్వయంసేవకులు స్టేడియం నుంచి కల్లిక్కట్ జంక్షన్ వరకూ పథ సంచలన్ నిర్వహించారు. అయినా సరే పోలీసులు స్వయంసేవకుల వెంబడే వచ్చారు. ఊరేగింపును అనుసరించారు. పథ సంచలన్ ప్రారంభం కాగానే.. బోరున వర్షం పడింది. స్వయంసేవకులు ఎవరికి వారు వెళ్లిపోతారని అందరూ భావించారు. కానీ స్వయంసేవకులు అత్యంత క్రమశిక్షణతో పథ సంచలన్ నిర్వహించారు.
 
పోలీసుల వ్యవహారంపై స్వయంసేవకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యల వెనుక కమ్యూనిస్టు ప్రభుత్వం, డీవైఎఫ్ఐ హస్తం వుందని పేర్కొన్నారు. అయితే... పంచాయతీ ఆరెస్సెస్ కార్యక్రమానికి అనుమతిని రద్దు చేసిందని పోలీసులు పేర్కొన్నా... ఆరెస్సెస్ సభ్యులకు మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. దీనిని బట్టే పోలీసుల వెనుక రాజకీయ నేతలున్నారని స్పష్టంగా ద్యోతకమవుతోంది.
చాలా సంవత్సరాలుగా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఆరెస్సెస్ ను ఎక్కడికక్కడ నిలువరిస్తూనే వస్తోంది. అలాగే వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూనే వస్తోంది. అయినా సరే స్వయంసేవకులు భారత మాత వైభవం కోసం ప్రాణాలకు ఎదురొడ్డి కూడా పనిచేస్తూనే వున్నారు. కావాలని, ఓ పద్ధతి ప్రకారం ఆరెస్సెస్ ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.