ఆధ్యాత్మిక మానవతావాది శ్రీమంత్ శంకర్ దేవ్

VSK Telangana    13-Oct-2024
Total Views |
 
SWAMY
 
సంగీత సాహిత్యాలను మేళవించి సూక్తి రత్నాలను అందించిన వాగ్గేయకారులలో అన్నమయ్య అగ్రగణ్యులు. ఆయన కేవలం భక్తి కవి కాదు. భక్తి ద్వారా సంఘ సంస్కరణకు, సామాజిక చైతన్యానికి పాటుపడిన ప్రజాకవి. అన్నమయ్య తరహాలోనే జనులలో భక్తి భావాన్ని పెంపు చేస్తూనే సామాజిక చైతన్యం తీసుకురావాలని ఆరాటపడ్డారు ఓ వైష్ణవ మత యోగి. ఆయనే అస్సామీ ధర్మోద్దారకులు శ్రీమంత్ శంకర్ దేవ్ మహారాజ్. అస్సామీ రామాయణాన్ని రచించిన ఈ ప్రసిద్ధ కవి జయంతిని ఈ విజయదశమి నాడు జరుపుకుంటున్నాము. ఈయన అసోంలోని అలీపుఖురి గ్రామంలో 1449లో జన్మించారు. తల్లి పేరు సత్యసంధ, తండ్రి పేరు కుసుంబర్ శిరోమణి. ఆయన జన్మించేనాటికి అసోంలో సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. కులాల అంతరాలు, మూఢ విశ్వాసాలు హెచ్చు స్థాయిలో ఉన్నాయి.
శంకర్ దేవ్ తన 12వ ఏట మాధవ కందలి పాఠశాలలో చేరి అయిదు సంవత్సరాల పాటు అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు. వివాహం జరిగిన కొంత కాలానికే భార్య మరణించడంతో ఆయన యుక్త వయసులోనే సంసార జీవితాన్ని వదిలి తీర్థయాత్రలు చేపట్టారు. అలా ఆయన పూరి, మధుర, ద్వారక, బృందావనం, గయా, రామేశ్వరం, అయోధ్య, సీతాకుండ్ తదితర ప్రముఖ వైష్ణవ క్షేత్రాలను సందర్శించి 12 ఏళ్ల అనంతరం తిరిగి అస్సాంకు చేరి వైష్ణవ ధర్మ ప్రచారం ప్రారంభించారు. కృష్ణ భక్తిపై అనేక నాటకాలు, కీర్తనలు, భజనలు రాసి వాటిని మధురంగా పాడుతూ ఉపాసన మార్గాన్ని ప్రజలకు తెలియజేశారు. ఆయన రాసిన కీర్తనల్లో ‘‘కీర్తన ఘోష’’ మకుటాయమానం కాగా భాగవత పురాణ సారాన్ని శంకర్ దేవ్ ‘‘గుణమేల’’ పేరుతో సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా చిన్న కావ్యంగా అందించారు.
ఏకసరణ ధర్మం పేరిట సర్వసమాన మతం ప్రవేశపెట్టి తద్వారా శంకర్ దేవ్ అస్సాం ప్రాంతంలోని పలు వనవాసీ సంఘాలను హిందూ సమాజ ప్రధాన స్రవంతిలో మమేకం చేశారు. పలు పవిత్ర గ్రంథాలను సరళీకృతం చేస్తూ సమాజంలోని ప్రతి సభ్యునికి అందుబాటులో ఉండేలా చేశారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆయన నామ్‌ఘర్‌లు స్థాపించారు. కుల, వర్గాలకు అతీతంగా అందరినీ అక్కడికి ఆహ్వానించేవారు. సత్రాలు స్థాపించి వాటి ద్వారా కళలు, చేతి వృత్తులను ప్రోత్సాహించారు. కేవలం వ్యవసాయానికే పరిమితమైన నాటి అస్సామీ ప్రజలకు వివిధ ఉపాధి మార్గాలను పరిచయం చేసి వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించారు.
శంకర్ దేవ్ కేవలం ఆధ్యాత్మిక మానవతావాది మాత్రమే కాదు, ఆయన సాంస్కృతిక పునరుజ్జీవకులు కూడా. అస్సామీ సమాజంలోని ప్రతి శ్రేణిలో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల ఎదుగుదలకు బాటలు పరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మహాపురుషులు శ్రీమంత శంకర్ దేవ్ ప్రస్తావన లేకుండా అస్సామీ సంస్కృతి గురించి చెప్పడం వీలుకాదు. శంకర్ దేవ్ మార్గంలో పయనించి సామాజిక సమరసతకు కృషి చేయడమే మనం ఆయనకు అందించే నివాళి కాగలదు.
( సెప్టెంబర్ 12 – శంకర్ దేవ్ జయంతి )