VSK తెలంగాణ వార్తాకథనాలను వెనువెంటనే చూసేందుకు మీ ఫోన్‌లో VSK Telangana App ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ క్రింది లింక్ నొక్కి Appను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విజయదశమి ఉత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్ నాగపూర్‌లో స్వయంసేవకులనుద్దేశించి ప్రసంగం చేశారు. నాగపూర్‌లో జరిగిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో మాజీ చైర్మన్ డా.కే. రాధాకృష్ణన్ హాజరయ్యారు. సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు అంశాల వారీగా...
కుటుంబ విలువల పునరుద్ధరణ
విద్య యొక్క పునాదులు, వాటి ఫలితంగా ఉత్పన్నమయ్యే వ్యక్తిత్వం ఇంట్లోనే 3 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సులో ఏర్పడతాయి. ఇంట్లో పెద్దల ప్రవర్తన, ఇంట్లో వాతావరణం, ఇంట్లో జరిగే ఆంతరంగిక సంభాషణల ద్వారా ఈ విద్య సిద్ధిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ, మన ఇంటి గురించి చింతిస్తూ, ఈ సంభాషణను ప్రారంభించవలసి ఉంటుంది. ఈ సంభాషణ ఎప్పటికప్పుడు కాకపోయినా, కనీసం వారానికోసారి నిర్వహించడం ద్వారా ఆత్మగౌరవం, దేశభక్తి, నైతికత, జవాబుదారీతనం వంటి అనేక లక్షణాలు పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. దీనిని మనం అర్థం చేసుకుని మన ఇంటి నుంచి ఏ పని మొదలుపెట్టాలి.
పౌర క్రమశిక్షణ
మనం కలిసి జీవిస్తున్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు కనబరిచే మన ప్రవర్తనలో కొన్ని విధులు మరియు క్రమశిక్షణలు ఉంటాయి. చట్టం, రాజ్యాంగం కూడా ఒక సామాజిక క్రమశిక్షణ అవుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా కలిసిమెలిసి పురోగమిస్తూ చెదిరిపోకుండా ఉండేలా ఒక ఏర్పాటు, నియమం అమలులో ఉంది. భారత ప్రజలమైన మనం ఈ నిబద్ధతను రాజ్యాంగం ద్వారా ఇచ్చాము. రాజ్యాంగ ప్రవేశికలోని ఈ వాక్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టం అందించిన విధులను సమర్థంగా నిర్వర్తించాలి. చిన్నా పెద్దా అన్ని విషయాల్లోనూ ఈ నియమాన్ని, వ్యవస్థను మనం పాటించాలి.
ఆత్మగౌరవం
వీటన్నింటిని నిరంతరం కొనసాగించడానికి, అవసరమైన ప్రేరణ 'ఆత్మగౌరవం'. మనం ఎవరు ? మన సంప్రదాయం, మన గమ్యం ఏమిటి? భారతీయులుగా, మనకు వైవిధ్యాలు ఉన్నప్పటికీ, పురాతన కాలం నుండి వారసత్వంగా వచ్చిన ఒక విస్తృతమైన, అన్నిటి సమ్మేళనం అయిన మానవ గుర్తింపు యొక్క స్పష్టమైన రూపం ఏమిటి? ఈ విషయాలన్నింటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. ఆ గుర్తింపు యొక్క ప్రకాశవంతమైన లక్షణాలను స్వీకరించడం ద్వారా, మనస్సులోను, బుద్ధిలో స్వాభిమానం స్థిరపడి దాని ఆధారంగా ఆత్మగౌరవం సాధించబడుతుంది. ఆత్మగౌరవం అనేది ప్రపంచంలో మన పురోగతి, స్వావలంబనకు కారణం అయ్యే ప్రవర్తనను సృష్టించే ప్రేరణ శక్తి.