సైద్ధాంతిక విలువలతో, దేశ హితం విషయంలో ఎటువంటి రాజీలేని వైఖరి అవలంభిస్తూ, రాజకీయాలకు అతీతంగా దేశ చరిత్రనే మలుపు తిప్పిన ఓ ద్రష్ట దత్తోపంత్ ఠేంగ్డే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్ గా దేశంలో దాదాపు అన్ని రంగాలపై విశేషమైన ప్రభావం చూపడమే కాకుండా దేశానికీ సరికొత్త దిశా నిర్ధేశం చేసిన ధీశాలి.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు అంటే కమ్యూనిస్టుల ఆధిపత్యమే కనిపిస్తుంది. కానీ భారత దేశంలో ఆ రంగంలో వారి ఆధిపత్యాన్ని త్రుంచివేసి అతిపెద్ద కార్మిక సంఘం, సంపూర్ణమైన దేశీయ ఆలోచనలతో, భారతీయ విలువలతో భారతీయ మంజూరు సంఘ్ (బిఏంఎస్)ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందరికి విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా కిసాన్ రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ ఆర్ధిక విధానాలకు మద్దతుగా స్వదేశీ జాగరణ్ మంచ్ ను ఏర్పాటు చేశారు.
అతను స్థాపించిన అన్ని సంస్థలు జాతీయ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అక్టోబరు 14, 2004న పూణేలోని దీనదయాళ్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస వచ్చినప్పుడు అది ఆర్ఎస్ఎస్ కు మాత్రమే కాకుండా, మాతృభూమికి కూడా తీరని లోటు. 12 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ తో పాటు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ లు అందరితో కలిసి పనిచేశారు.
దేశ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలపై ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవారు కాదు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూ ఉండేవారు. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని కూడా విడిచిపెట్టలేదు. రైతు, కార్మిక రంగాలపై ఎన్డీయే విధానాలపై ఆయన చేసిన ఘాటైన విమర్శలు చేశారు. బిజెపి ఆవిర్భావం సమయంలో `గాంధేయ సోషలిజం’ తమ మౌలిక విధానంగా ప్రకటించినప్పుడు తీవ్రంగా విమర్శించారు.
ఆయన అధికారం, పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. అందుకే ఆయనకు ఎన్‌డిఎ ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ గౌరవాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత యుపిఎ ప్రభుత్వాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ ప్రభుత్వపు సాధారణ కనీస కార్యక్రమం (సిఎంపి) డబ్ల్యుటిఓ పాలనపై ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు.
ఆయన అభిప్రాయాలు, వాదనలు ఎప్పుడూ గురుజీగా పేరొందిన ఎం ఎస్ గోల్వాల్కర్, జనసంఘ్ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ అభిప్రాయాలను గుర్తు చేస్తుండేవి. దేశంలో ‘రైట్’, ‘లెఫ్ట్’ అనే సైద్ధాంతిక విభజనను అధిగమించిన వ్యక్తి. కార్మిక సంఘాల విషయంలో వామపక్షాలతో కలిసి పనిచేశారు. రాజకీయ పరిమితులను అధిగమించి ఎప్పుడూ దేశ ప్రయోజనాల గురించే ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు.
ఎమర్జెన్సీ సమయంలో లోక్ సంఘర్షణ సమితి కార్యదర్శిగా దేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి సారధ్యం వహించారు. ఎమర్జెన్సీ అనంతరం ప్రతిపక్షాలు ఉమ్మడిగా జనతా పార్టీ నీడలో పోటీచేసి, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఆ ప్రభుత్వంలో ఆయన ఎటువంటి పదవులు ఒప్పుకోలేదు. చివరకు రాజ్యసభ సభ్యత్వం కూడా కోరుకోలేదు.
పెట్టుబడి ప్రాధాన్యత గల పరిశ్రమలపై కాకుండా కార్మిక ప్రాధాన్యత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తుండేవారు. ఆయన అపారమైన మేధస్సుకు ప్రఖ్యాతి వహించారు. ఓ ధాత్వవేత్త, దూరదృష్టి గల నేత, సులభంగా కఠినమైన తాత్విక అంశాలను వివరించగల వక్త. అనేక సైద్ధాంతిక గ్రంధాలు వ్రాసిన రచయిత.
1969లో, పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యునిగా సోవియట్ రష్యా, హంగేరీలను సందర్శించారు. ఐఎల్ఓ కాన్ఫరెన్స్‌కు ప్రతినిధిగా స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. 1977లో జెనీవాలో జరిగిన రెండవ అంతర్జాతీయ వర్ణ వివక్ష వ్యతిరేక సమావేశానికి కూడా హాజరయ్యాడు. 1979లో, ఆ దేశ కార్మిక ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి యుగోస్లేవియాకు అక్కడి ట్రేడ్ యూనియన్ ద్వారా, అమెరికాలో కార్మిక ఉద్యమం అధ్యయనంకోసం ఆయనను ఆహ్వానించారు.
అదే సంవత్సరం, అతను కెనడా మరియు బ్రిటన్‌లను కూడా సందర్శించారు. 1985లో, ఆల్-చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆహ్వానం మేరకు చైనా పర్యటించిన బిఎంఎస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. జకార్తా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, కెన్యా, ఉగాండా, టాంజానియాలలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఐదవ యూరోపియన్ హిందూ కాన్ఫరెన్స్‌లో, అమెరికాలోని వరల్డ్ విజన్ 2000లో పాల్గొన్నారు.
ఆయనది విస్మయం కలిగించే, మహోన్నతమైన వ్యక్తిత. అయినప్పటికీ నిరాడంబరమైన జీవితం గడిపారు. భారతీయ తాత్విక ఆలోచనలను లోతుగా అవగాహన చేసుకున్నప్పటికీ ఆధునిక కాలానికి పూర్తిగా అనుగుణంగా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించేవారు. కర్మయోగి, మార్గదర్శకుడు, తత్వవేత్త, గురువు. సమాజ శ్రేయస్సుకు, ప్రత్యేకించి కార్మిక, కర్షకుల ధ్యేయానికి ఆయన చేసిన గొప్ప కృషికి దత్తోపంత్ జీ గుర్తుండిపోతారు.
దత్తాత్రేయ బాపురావు ఠేంగ్డే 10 నవంబర్ 1920న మహారాష్ట్రలోని వార్ధాలోని ఆర్వీలో జన్మించారు. ఆయన నాగ్‌పూర్‌లోని లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. మోరిస్ కాలేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 15 సంవత్సరాల వయస్సులో “వానర్ సేన” అధ్యక్షుడిగా, అలాగే ఆర్వీలోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.
1936-38 నుండి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. 1942లో ఆర్ఎస్ఎస్ పూర్తికాల ప్రచారక్ అయ్యారు. 1950–51 వరకు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్ టియుసి) మధ్యప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. పోస్టల్ & రైల్వే వర్కర్స్ యూనియన్ (కమ్యూనిస్టు పార్టీ)తో అనుబంధం కలిగి ఉన్నారు. భారతీయ జనసంఘ్ మధ్యప్రదేశ్ (1952-53), దక్షిణ భారతదేశం (1956-57) ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యదర్శిగా పనిచేశారు.
డా. దాసరి శ్రీనివాసులు
(నేడు దత్తోపంత్ ఠేంగ్డేజీ పుణ్యతిథి)