స్వామి రామానంద తీర్థ గుల్బర్గా జిల్లా (బాంబే ప్రెసిడెన్సీ) జావర్గీ తాలూకా సిందీ గ్రామంలో 1903, అక్టోబరు 3న జన్మించారు. వారి పూర్వాశ్రమ నామం వెంకటేష్ భావు రావు ఖెడ్గికర్. వారి తండ్రి సన్యాసం స్వీకరించడంతో వారు బంధువుల సహాయంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు. పాఠశాల వయసునుంచే తిలక్, గాంధీల వల్ల ప్రభావితం అయి వారి మార్గంలో నడుస్తూ స్వరాజ్య సాధన కోసం శ్రమించారు. జనవరి 14, 1930లో వారు సన్యాస దీక్షను స్వీకరించారు. లాతూరులో 1938 జూన్లో జరిగిన మహారాష్ట్ర రెండో మహాసభలో స్వామీజీ పాల్గొన్నారు. ఆ తరవాత వారు హైదాబాద్ రావడంతో వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది.
ఆ సమయంలోనే అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు వందలాది మంది యువ కార్యకర్తలను సమీకరించారు. వారి సహకారంతో అప్పటి ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాణానికి పునాది వేశారు. అప్పుడే శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్టేట్ కాంగ్రెస్ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించాలని స్వామీజీ పిలుపునిచ్చారు ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించినందుకు స్వామీజీతోపాటు రావి నారాయణరెడ్డి, తదితరులను అరెస్టు చేసి, చంచల్గూడ జైలులో నిర్భంధించారు. న్యాయస్థానం 18 నెలల శిక్ష విధించింది. ఆ సమయంలోనే నాటి విద్యార్థి యువత దేశభక్తితో వందేమాతర గీతం ఆలపించినందుకు బహిష్కరణకు గురయ్యారు.
ఉస్మానియాలో మూడు వందలమందికిపైగా విద్యార్థులను బహిష్కరించారు. ఆనాటి బహిష్కృతుల్లో మాజీ ప్రధాని పీవీ ఒకరు. మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రామానంద స్వామీజీ గురువు. హైద్రాబాద్ రాష్త్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి బందిపోట్ల ద్వారా విధ్వంసాన్ని ప్రోత్సహించింది. ఇలాంటి పరిస్థితులలో వివరాలు విశదపరుస్తూ స్వామి రామానంద తీర్థ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిఘటిస్తూ వచ్చారు, ఘాటుగా నైజాం ప్రభుత్వానికి లేఖ రాశారు. వారి లక్ష్యాలు రెండే - హైద్రాబాద్ సంస్థానం, ఇండియన్ యూనియన్లో విలీనం కావడము, రెండవది, సంస్థానంలో ప్రజలు బాధ్యత వహించే పరిపాలన ఏర్పాటు. ఇలా నిక్కచ్చిగా, సూటిగా రాయగలిగిన అఖండ ధైర్య సాహసాలూ, అచంచల దేశభక్తి తీర్థ గారివి. భారత సైన్యం రంగ ప్రవేశంతో, నైజాం లాంఛనప్రాయంగా సెప్టెంబరు 17, 1948న ఓడిపోయినట్లు ఒప్పుకుని భారత ప్రభుత్వానికి శరణు అన్నాడు. రామానంద తీర్థ ప్రతిజ్ఞ నెరవరింది. భారతదేశం యావత్తూ విజయానందంలో పొంగింది.
స్వామీజీ 1952 సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత.. రాజకీయాల నుంచి నిష్క్రమించి సంఘ సంస్కరణ వైపు అడుగులు వేశారు. ఈ విశ్వమంతా నా కుటుంబమే అని చెబుతూ... పేద ప్రజల సుఖ సంతోషాలు, దారిద్య్ర నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేశారు. 1972 జనవరి 22న అనారోగ్యంతో వారు కన్నుమూశారు. . ఆ సమయంలో పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. తన గురువు స్మారకార్థం 1973లో ‘స్వామి రామానంద తీర్థ మెమోరియల్’ స్థాపించి స్వామీజీ భావాలను, ఆదర్శాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. నేటికీ ఈ సంస్థ ఎంతోమందికి స్పూర్తినిస్తోంది.