గుజరాత్‌లో నకిలీ కోర్టు నడిపి ఐదేళ్లలో 100 ఎకరాలు దోచిన ఘనుడు

VSK Telangana    23-Oct-2024
Total Views |
 
fake judge
 
నకిలీ కోర్టు నడుపుతున్న మారిస్ శామ్యూల్ క్రిస్టియన్ గుజరాత్ లో అరెస్ట్ అయ్యారు. నకిలీ న్యాయవాదిగా నమ్మిస్తూ, బూటకపు తీర్పులు ఇస్తూ వేలకోట్ల రూపాయలు, వంద ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకున్నాడు. సుమారు ఐదు సంవత్సరాల పాటు నకిలీ కోర్టును నడిపాడు. మధ్యవర్తిగా చెప్పుకుంటూ భూవివాదాల్లో తలదూర్చాడు. గాంధీనగర్ లో అచ్చు కోర్టును తలపించేలా ఓ గదిని తయారు చేయించాడు. అలాగే న్యాయస్థాన సిబ్బంది లాగే నటించే వారు, న్యాయవాదులను కూడా తయారు చేసుకున్నాడు. నకిలీ న్యాయవిచారణలతో అందర్నీ బురిడీ కొట్టిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
 
 
సివిల్ కోర్టుల్లో పెండింగ్ లో వున్న భూవివాద కేసులు న్న వ్యక్తులే ఈ శామ్యూల్ టార్గెట్. ప్రభుత్వం నియమించిన మధ్యవర్తిగా తనని తాను చెప్పుకుంటూ, భారీగా డబ్బులు వసూలు చేశాడు. చట్టపరమైన సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని నమ్మబలికాడు. విచారణ చేయడం, వాదనలు వినడం,తీర్పులివ్వడం అంతా నకిలీయే. అయితే ఇవన్నీ చట్టబద్ధమే అని అందర్నీ భ్రమింపజేశాడు. పదకొండుకి పైగా కేసుల్లో విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, తనకు అనుకూలంగా ఉత్తర్వులు కూడా ఇచ్చుకున్నాడు.ఇలా దాదాపు వంద ఎకరాలను దోచుకున్నాడు.2019 నాటి ఓ కేసులో మారిస్ తన క్లయింట్ కి అనుకూలంగా తీర్పునిచ్చి, జిల్లా కలెక్టర్ పరిధిలోని భూమిని కూడా తప్పుడు భూమి అని పేర్కొన్నాడు.
 
 
ఈ నకిలీ జడ్జి క్లయింట్ తన పేరును ప్రభుత్వ అధికారిక పత్రాలలో జొప్పించడానికి కూడా ప్రయత్నించాడు. భూమి విషయంలో యాజమాన్యాన్ని బదిలీ చేయాలని నేరుగా జిల్లా కలెక్టర్ నే ఆదేశిస్తూ మారిస్ ఉత్తర్వులు జారీ చేశాడంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అహ్మదాబాద్ సివిల్ కోర్టు ముందు నకిలీ న్యాయమూర్తి తన నకిలీ కోర్టును నడుపుతున్నాడు. ఈ మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ కోట్ల విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులో పలు ఉత్తర్వులు జారీ చేశాడు. వీటిలో కొన్ని కొన్ని ఉత్తర్వులు కలెక్టర్ కార్యాలయానికి కూడా వెళ్లాయి.
 
అయితే... ఈ మోసం ఎక్కడ బయటపడిందంటే ఈయన ఇచ్చిన తీర్పు చట్టబద్ధం అనుకొని సివిల్ కోర్టులో సమర్పించారు. కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ కి అనుమానం వచ్చి, క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే మోరిస్ క్రిస్టియన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రార్ హర్దిక్ దేశాయ్ కరంజ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
 
మోరిస్ తనని తాను మధ్యవర్తిగా, న్యాయమూర్తిగా చెప్పుకుంటూ తప్పుడు వాగ్దానాలతో అనేక మందిని మోసం చేశాడని, నకిలీ న్యాయస్థానాన్ని నడిపాడని పోలీసులు తెలిపారు. న్యాయస్థానం లాంటి గదిని తయారు చేయడం, సిబ్బందిని తయారు చేసుకోవడం, విచారణలు జరపడం ఇవన్నీ అచ్చు కోర్టులాగే భ్రమింజేయడానికి చాలా కష్టపడ్డాడని, ఈ మోసం తమను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని పోలీసులు తెలిపారు.భూ వివాదాలకు సంబంధించిన వ్యక్తులను, ముఖ్యంగా విలువైన ప్రభుత్వ భూములు ఆపదలో ఉన్న కేసులను లక్ష్యంగా చేసుకుని మారిస్ 2019 నుంచి నకిలీ ట్రిబ్యునల్‌ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
మారిస్ సివిల్ కోర్టులో తన నకిలీ తీర్పును ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు మోసం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో క్రిస్టియన్ ఎలా మోసం చేశాడు? భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏం చేశాడో పోలీసులు వివరంగా పొందుపరిచారు.లాయర్లుగా, కోర్టు సిబ్బందిగా నటిస్తున్న మారిస్ సహచరులకు ఈ స్కామ్ గురించి తెలుసా మరియు నకిలీ కోర్టు ద్వారా ఎంతమందిని మోసం చేసి ఉండవచ్చనే దానిపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.