అయోధ్య భవ్య రామ మందిరంలో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ తెలిపార. ఈ యంత్రాన్ని తిరుపతిలోని కంచిపీఠం నుంచి ప్రత్యేక రథంలో అయోధ్యకు తరలిస్తున్నారు. ఈ యంత్ర రథాన్ని జయేంద్ర సరస్వతీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం 45 రోజుల పాటు 5 రాష్ట్రాల మీదుగా 2,000 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకోనుంది. తిరుపతిలో ఎంతో విశిష్ట కలిగిన శ్రీరామ మందిరం వుందని, ఇటువంటి పుణ్యక్షేత్రం నుంచి అయోధ్య రథయాత్రను ప్రారంభించామని ప్రకటించారు. ఈ రథం అయోధ్య చేరుకున్న తర్వాత మహా చండీయాగం నిర్వహిస్తామని తెలిపారు. సంక్రాంతి అనంతరం అయోధ్యలోని రామ మందిరంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు.
అత్యంత పురాతనమైన కంచి మఠంలో శ్రీరాముడి మూల యంత్రం వుందని వెల్లడించారు. పురాతన మహా యంత్రం లాగానే నూతనంగా యంత్రాన్ని తయారు చేయించామన్నారు. ఇప్పటికే బాల రాముడి మూల విరాట్ కింద విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బంగారు రామ యంత్రాన్ని వుంచుతారు. 45 రోజుల మండల దీక్ష అనంతరం అయోధ్యలో జనవరి 1 న లక్ష చండీ యాగం జరుగుతుందని విజయేంద్ర సరస్వతీ మహా స్వామి ప్రకటించారు.
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి మార్గదర్శనంలోనే ఈ యంత్రం తయారైంది. ఈ యంత్రంపై 150 కిలోల బంగారు తొడుగు వుంది. కంచిలో ఈ యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతి పంపారు. తిరుపతి నుంచి ‘‘శ్రీరామ యంత్ర రథయాత్ర’’ ప్రారంభమైంది.