లోకమాత అహల్యబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్బంగా త్రివేణి సంగమ (గోదావరి, మంజీరా, హరిద్రా నదుల) క్షేత్రమైన కందకుర్తిలో ( ఇందూరు జిల్లా,తెలంగాణ ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పూజ్య ధర్మాచార్యుల సమ్మేళనం జరిగింది. 7 జిల్లాల నుండి సుమారు 60 కి పైగా ధర్మాచార్యులు, స్వామీజీలు వారి శిష్య బృందం కలుపుకొని 100 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలుత గోదావరి నది ఒడ్డున లోక మాత అహల్య బాయి హోల్కర్ పుష్కర ఘాట్ నందు గోదావరి నది హారతి సామూహికంగా నిర్వహించి, అహిల్యబాయి చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి,నదీమ తల్లికి పూలు సమర్పించారు. అహిల్యా బాయ్ హోల్కర్ జీవితం పై కొత్తగా ప్రచురించిన పుస్తకాన్ని అలాగే మలయాళ స్వామి జీవిత సూక్తుల పుస్తకం ఆవిష్కరించారు.
ఈ క్రమంలో హిందవా సోదరా సర్వే :.. అనే సమరసతా మంత్రం పఠించారు. ప్రారంభంలో సమరసతా వేదిక రాష్ట్ర సంయోజకులు సమ్మేళనం ఉద్దేశాన్ని ప్రస్తావన రూపంలో సభ ముందుంచారు. ఆ తర్వాత స్వామీజీలు ఒక్కరొక్కరుగా సమరసతా వ్యక్తిగత అనుభవాలను, సమరసత ఆవశ్యకతను తెలియజేసారు.
సాధువుల్లో కూడా పూర్వఆశ్రమాల్లో వివిధ కులాలకి చెందిన వారై ఉన్నప్పటికీ,కులం,ప్రాంతం,మొదలైన భేదాలకు అతీతంగా హిందూ ధర్మ రక్షణకి కంకణం కట్టుకున్న వారేనని వారు తెలిపారు. సన్యాస ఆశ్రమం స్వీకరించే సమయంలో కూడా తాము కూడా వివక్షత ఎదుర్కొన్న వారమేనని, హిందూ సమాజానికి మాయని మచ్చగా మిగిలిన ఈ దూరచార నిర్మూలనకి నడుం కట్టాలని,హిందువులను ఐక్యతా పథంలో నడపాలని వారు సూచించారు. కులం కన్న గుణం మిన్న యని,వేదంలో లేని ఈ ఘోర దురాచారం తొలగించడానికి ఆశ్రమాలు కార్యాచరణ ప్రకటించాలని వారు అభిప్రాయ పడ్డారు.
అన్ని కులాల వారైన సుమారు 1500 మంది శిష్య కోటికి వేదం నేర్పిస్తున్న బర్దిపూర్ ఆశ్రమ పీఠ అధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామీజీ, మతమార్పిడి జరుగకుండా గిరిజన గూడెంలలో ఆశ్రమం స్థాపించిన సంగ్రామ్ మహారాజ్, జగద్దాత్రి ఆశ్రమ యంచ మాతాజీ శ్రీ ఓం స్వర్ణ కమలాక్షిని , సాధు పరిషత్ అధ్యక్షులు అనంత నంద గిరి స్వామిజి, తడి పాకల ఆశ్రమం సచ్చిందానంద స్వామీజీ, చింత కుంట స్వామీజీ విశోక ఆనంద స్వామిజీ, గుడిమెట్ స్వామీజీ మహాదేవ్ స్వామీజీ,హరిదాస్ ఆర్య,కరీంనగర్ స్వామీజీ సచ్చిదానంద స్వామీజీ, ఉజ్జయిని ఆనంద సరస్వతి మొదలైన స్వామీజీలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.