ఆనంద దీపావళి.. ఐదు రోజులు వెలుగులే మరి!

VSK Telangana    30-Oct-2024
Total Views |

Diwali
 

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి పర్వదినాన్ని చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుని శరణువేడుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని కూడా మరో కథనం. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకూ ఐదురోజుల పాటూ జరుపుకుంటారు

మొదటి రోజు ధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈ రోజు కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు.

రెండో రోజు నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట. అయితే ఈ ఏడాది నరక చతుర్ధశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. సూర్యోదయానికి చతుర్థశి, సాయంత్రానికి అమావాస్య ఉండడంతో ఇలా జరిగింది. ఈ రోజు నువ్వుల నూనె వంటికి పట్టించుకుని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు.

మూడో రోజు దీపావళి అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగులతో ఇంటిని నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీపూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు.

నాలుగో రోజు బలి పాడ్యమి
దీపావళి మర్నాడు అంటే కార్తీకమాసం మొదటి రోజుని బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు అని చెబుతారు.

ఐదో రోజు యమ విదియ
దీపావళి నుంచి రెండోరోజు అంటే..కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే విదియను యమవిదియ అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురాణాల్లో రాఖీపండుగ అన్నమాట. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు. ఈ రోజున సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు సోదరీమణులు. భోజనం పెట్టిన తర్వాత సోదరుడికి తన శక్తికొలది నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదిస్తారు. దీనివెనుక పురాణ కథనం ఉంది. సూర్యభగవానుడి కుమారుడు యముడు, ఆయన సోదరి యమున. ఆమెకు సోదరుడంటే అంతో అభిమానం. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా యముడు మాత్రం క్షణం తీరికలేకుండా ఉండేవాడు. అయితే కార్తీక విదియ రోజు తప్పకుండా రావాలని చెప్పి వాగ్ధానం తీసుకుంటుంది యమున. యముడు కూడా తనను ఎవ్వరూ ఇంటికి పిలవరు పైగా స్వయాన తోబుట్టువుకి వాగ్ధానం చేసి వెళ్లకుండా ఉండడం భావ్యం కాదని భావించిన ఇంటికెళతాడు. యముడిని చూసి సంతోషించిన యమున అభ్యంగన స్నానం చేయించి , తిలకం దిద్ది, స్వయంగా వంట చేసి ప్రేమగా వడ్డిస్తుంది. సంతోషించిన యముడు సోదరిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఏటా ఇదే రోజున తన ఇంట విందుకి రావాలని కోరుతుంది. సరే అని చెప్పిన యముడు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందంటాడు. ఆ రోజు నుంచి ఏటా కార్తీకమాసంలో రెండో రోజు విదియ రోజు సోదరులు సోదరిల ఇంటికెళ్లి భోజనం చేయడం విధిగా వస్తోంది. దీనిని భగినీహస్త భోజనం అని కూడా పిలుస్తారు.

ఇలా మొత్తం ఐదు రోజుల పాటూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు.