ఆలయాల కూల్చివేతపై విజయవాడ కలెక్టర్‌కి హిందూ సంఘాల ఫిర్యాదు

VSK Telangana    30-Oct-2024
Total Views |
 
temples
 
విజయవాడ: నగరంలోని మధురానగర్ 29వ డివిజన్ కాలువ కరకట్ట ప్రాంతంలో వరుసగా రెండు దేవాలయాలను, ఒక గోశాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా జెసిబిని తీసుకొచ్చి కుప్పకూల్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే వర్తిస్తుందా లేక ఇతర మతాల వారి నిర్మాణాల విషయంలోనూ వర్తిస్తుందా... అని నిలదీసారు. విజయవాడలోని బందరు కాలువ, ఏలూరు కాలువ కరకట్టలను కూడా క్లియర్ చేసి నగరం అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు.
 
రాబోయే కార్తీకమాసం పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కృష్ణానది, కాలువల గట్లను పరిశుభ్రం చేయాలని కోరారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని నది గట్లు, కాలువ గట్లు అన్నీ బీరు సీసాలు, గాజు ముక్కలతో నిండి ఉన్నాయని వాటన్నిటినీ తొలగించాలని డిమాండ్ చేసారు. హిందూ ధర్మం ప్రకారం నదులు, కాలువలు పవిత్రమైన ప్రదేశాలని, వాటిని పరిశుభ్రంగా ఉంచాలనీ కోరారు.
 
కార్తీకమాసంలో దీపారాధనకు అమిత ప్రాధాన్యం ఉంది. భక్తుల అవసరాలను వాడుకుంటూ కొన్ని నకిలీ కంపెనీలు ఆవునెయ్యి పేరిట జంతు కొవ్వులు, ఇతర వ్యర్ధ పదార్థాలతో తయారుచేసి విక్రయించేస్తున్నాయి. తక్షణమే అలాంటి కంపెనీలను గుర్తించి సీజ్ చేయాలని కోరారు.
 
విజయవాడ నగరంలో మూగ జీవాలకు సరైన బందలదొడ్డి లేదని, గోవులను అక్రమ రవాణా చేసే సందర్భాల్లో వాటిని పట్టుకుని కేసులు పెట్టినప్పుడు ఆ ఆవులను ఉంచడానికి సరైన ప్రదేశమే లేదని హిందూ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసారు. మూగజీవాల కమిటీకి జిల్లా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ గారు వెంటనే స్పందించి పది ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి ప్రభుత్వ నిర్వహణలో గోశాలను ప్రారంభించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
 
ఈ కార్యక్రమంలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి తోట సురేష్ బాబు, దళిత సేన అధ్యక్షులు పోతురాజు భరత్, పాండురంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.