లోకానికి జ్ఞానపు వెలుగులను అందిస్తూ విశ్వగురువుగా భారతదేశ కీర్తిపతాక రెపరెపలాడుతున్న వేళ, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గౌండ్స్‌లో కొనసాగుతున్న హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (HSSF) బృహత్ మేళా - సేవా ప్రదర్శిని ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తమ ప్రియతములైన ఉపాధ్యాయులను శిష్యులు పూజించి ఆశీస్సులు అందుకున్న ఆచార్యవందన కార్యక్రమం, పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం, విద్యాలయాల కరస్పాండెంట్లు, కార్యదర్శుల సంగోష్ఠి, ఉపాధ్యాయ సమ్మేళనాలతో 3వ రోజు కార్యక్రమం HSSF ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది.
ఉదయం మొదటి వేడుకగా నిర్వహించిన ఆచార్యవందన కార్యక్రమం విద్యార్థులు-ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయానుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది. పసుపు కుంకుమలు, పువ్వులతో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పాద పూజ చేశారు. తాము ప్రేమించే విద్యార్థులు అత్యంత ప్రేమ, పూజ్యభావంతో చేసిన వందన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు భావోద్వేగాల మధ్య స్వీకరించారు.
ఆచార్యవందన కార్యక్రమానికి విద్యావేత్త, కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం సభాధ్యక్షులుగా వ్యవహరించగా సుప్రసిద్ధ అవధాని, అవధాన సరస్వతీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ, Impact Foundation వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు వక్తలుగా విచ్చేసి తమ ప్రసంగాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉత్తేజితం చేశారు. ఆచార్యులను దైవంగా భావించడం, వారి నుంచి విద్యా విజ్ఞాన సంస్కారాలను పొందడమనేది హిందూ జీవన శైలి అని, అందుకే HSSF - IMCTF సంస్థ ఆచార్య వందన కార్యక్రమాన్ని విద్యాలయాలలో ప్రవేశపెట్టి విద్యార్థులకు సంస్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నదని అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. మనుషులను ఉత్తములుగా, గొప్పవారిగా, యోగ్యులుగా తీర్చిదిద్దే లక్షణం గురువులో మాత్రమే ఉందని గురువుల శక్తిసామర్థ్యాలను పలు ఉదాహరణలతో వివరించారు. నేటి కాలంలో డ్రగ్స్, సినిమాలు, సెల్ ఫోన్, పాశ్చాత్య సంస్కృతి బారిన విద్యార్థులు పడుతున్నారని, వీరిని సంస్కరించి కాపాడవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, అదే సమయంలో విద్యార్థులు సైతం ఆ దుష్ప్రభావాలకు గురికాకుండా యోగ్యులుగా తయారు కావలసిన బాధ్యత విద్యార్థులదేనని స్పష్టం చేశారు.
డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ ప్రసంగిస్తూ విద్యార్థులకు జ్ఞానార్జనలో కుండలినీ శక్తి ప్రాధాన్యతను వివరించి వారితో ఓం గం గణాధిపతయే నమః అని గణేశుని స్మరింపజేశారు. కలమంజుల వాగనుమిత, గళపంజర గత శుకగ్రహ... అనే మంత్రాన్ని కూడా చెప్పించి, ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్, టీవీలను జయించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మమ్మీ-డాడీ అనే సంస్కృతి నుంచి నేటి బాలలు బయటపడాలన్నారు. భారతీయ సంస్కృతిని, సంస్కృతాంధ్ర భాషలను విద్యార్థులు నిరంతరం ప్రేమించి ఆచరించాలంటూ పలు పద్యాలను ఆలపించి అలరించారు. పద్యాలు చదివితే ముఖ వికాసం కలుగుతుందంటూ సుమతీ శతకం, దాశరథి శతకం వంటి శతక పద్యాలు చదవాలని తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం కూడ కలుగుతుందన్నారు. పిల్లలు అల్లన శారదకల్లిన జడలై వెలుగుత అళికుల రవళిన్... తుమ్మెదలు తేనెకు ఆకర్షితులైనట్టుగా పిల్లలు తమ విద్యాజ్ఞానంతో ప్రపంచాన్ని ఆకట్టుకొని వెలుగొందాలని ఆశీర్వదించారు.
అనంతరం జరిగిన ఉపాధ్యాయ సమ్మేళన కార్యక్రమం నేటి సమాజంలో గురువుల పాత్రను నిర్వరించేలా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాణిని ప్రభాత కన్యా మహావిద్యాలయం ఆచార్య సవితా దేవి తమ శిష్యులైన బాలికలతో వేద పఠనం చేసి ప్రశంసలందారు. ఈ సమ్మేళనంలో ముఖ్యవక్తగా పాల్గొన్న హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్ష మహరాజ్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత సామాజిక పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వేద విద్యతో పాటుగా శాస్త్రీయ విద్యా విధానం కొనసాగే వ్యవస్థ ఉండాలన్న స్వామి వివేకానందుల ఆకాంక్షను గుర్తు చేశారు. వేద పఠనంలో ప్రాణాయామం, భక్తి, శ్రద్ధ వంటి ఎన్నో కీలకాంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. దేశంలో వేదవిద్య, ఆధ్యాత్మిక విద్యను తిరస్కరించడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే, దానిని రక్షించుకునే వారే లేరన్న నాటి వివేకానందుల ఆవేదనను సభముందుంచారు. నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగమిచ్చి తీర్చిదిత్తిన శాస్త్రవేత్త సీవీ రామన్ జీవిత ఘట్టాన్ని తెలియజేసి ఆ ఆదర్శాలను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలన్నారు. అంకితభావం గల నలంద విశ్వవిద్యాలయం గురుశిష్యుల విలువలను బోధమయానంద తెలియజేశారు.
విశిష్ట అతిథుల్లో ఒకరైన DPS, మెరిడియన్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ గురువు అంటే కేవలం మార్కులు వేసే వ్యక్తిగా భావించరాదంటూ తన జీవితంలోని సంఘటనలను పంచుకున్నారు. తనను తీర్చిదిద్దిన గురువుల కృషిని తెలిపారు. కనిపెంచిన తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదేన్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుదర్శన్ ఆచార్య మాట్లాడుతూ వచ్చే ఐదేళ్ల కాలంలో ఓటర్లు సమాజంలోకి అడుగుపెట్టనున్న భావి పౌరులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ కేశవరెడ్డి మాట్లాడుతూ తాను సరస్వతీ విద్యాపీఠంలో సేవలందించానని, ఈ సంస్థ తనకు ప్రేరణను శక్తిని ఇచ్చిందన్నారు. తన ఉపాధ్యాయులే తన శక్తి అంటూ వారి వల్లే అద్భుత విజయాలు సాధించానన్నారు. వారి నుంచి నేటికీ స్ఫూర్తిని పొందుతుంటానన్నారు. నాయకత్వ కొరత దేశాన్ని నేటికీ వేధిస్తోందన్న స్వామి బోధమయానంద ఒకనాటి విభజన ఫలితాలు నేడు బాధాకరంగా మారాయన్నారు.
హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (HSSF) బృహత్ మేళా - సేవా ప్రదర్శిని 3వ రోజున పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నాట్య ప్రదర్శనలతో వివిధ పాఠశాలల విద్యార్థులు అలరించారు.