ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో వివాహాలు వద్దన్న పురావస్తుశాఖ

VSK Telangana    10-Nov-2024
Total Views |

vontimitta ramalayam
 

‘ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దు. వివాహాలు జరగనీయకుండా ఆపేయాలి’ అని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన యంత్రాంగానికి చరవాణిలో ఆదేశించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రుల ఆధార్‌ పత్రాలు, శుభలేఖ అందించాలి. వివాహ కట్టడి రుసుం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం గత పదేళ్లుగా అమలులో ఉంది. ఆలయంలో పనిచేస్తున్న భజంత్రీల సిబ్బంది, అర్చకుల ద్వారా వివాహ క్రతువును నిర్వహిస్తారు. వారికి కొంతమేర నగదు ఇస్తున్నారు. ఆలయంలో వేదిక, షామియనాలు, పందిళ్లు, విద్యుద్దీకరణ, వివాహ వేడుక నిర్వహణకు బల్లలు, అతిథులు కూర్చోవడానికి కుర్చీలు వేయరు. అల్పాహరం, తేనీరు, భోజనం వసతి ఉండదు. రామలింగేశ్వరస్వామి ముంగిట్లో, సీతారాముల ఎదుర్కోలు మండపాల చెంత చలువరాళ్లపై సాధారణంగా వివాహాలు చేసుకోవాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇన్నాళ్లు ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఆలయ వేళల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 8.45 గంటల వరకు లగ్నం చూసుకుని వివాహాలు చేసుకునేవారు. ఒక పెళ్లి క్రతువు 30 నుంచి 40 నిమిసాల్లో ముగుస్తుంది. ఎవరికీ ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. తాజాగా పురావస్తుశాఖ అధికారులు ఇకపై వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వరాదని తితిదే పాలనాధికారులకు చరవాణిలో మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇదే ఇప్పుడు భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. కార్తిక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక్కడ జగదభిరాముడి సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ముందస్తుగా వివాహ కట్టడి రుసుం చెల్లించాలని వస్తున్న వారికి తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా ఎలాంటి ఆంక్షలు పెట్టుకుండా పెళ్లిళ్లు చేసుకోవడానికి అభ్యంతరాలు పెట్టకుండా ఇప్పుడెందుకు ఆక్షేపిస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. భారతీయ సనాతన సంప్రదాయం అనుసరించి శ్రీరామచంద్రమూర్తిపై భక్తిభావం, ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ పెళ్లిలు చేసుకుకోకుండా ఆంక్షలు విధించడం విచిత్రంగా ఉందని భక్తులు ఆక్రోశిస్తున్నారు. ఈ విషయమై ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ వాస్తవమేనని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.