చక్కని అనుభూతుల మధ్య ముగిసిన సేవా ప్రదర్శిని

VSK Telangana    11-Nov-2024
Total Views |
 
hssf
 
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక వీరుల సేవలు చిరస్మరణీయం అని పాట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. అటువంటి సైనిక వీరులకు వందనం చేస్తూ రూపొందించిన పరమవీర్ వందనం కార్యక్రమం చక్కటి చొరవ అని ఆయన ప్రశంసించారు. హిందూ ఆధ్యాత్మిక మరియు సేవ ఫౌండేషన్ (HSSF) మరియు IMCTF సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా ప్రదర్శిని కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ముగిసింది. మూడు రోజుల కార్యక్రమంలో చివరి రోజున సైనిక వీరుల సేవలను గుర్తించుకుంటూ పరమవీర్ వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. సామాజిక సమర‌సత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ వక్తగా విచ్చేశారు. పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమానికి శోభ కల్పించారు.
 
ఈ తరం యువత, విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు,, విలువల పట్ల అవగాహన కల్పించేందుకు వివిధ అంశాల పట్ల వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశ సంప్రదాయంలో కుటుంబ విలువలు, సామాజిక చింతన ముఖ్యం అని చాటి చెప్పేందుకు వీటిని ఉద్దేశించారు. ఇటువంటి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువతకు ఆయా అంశాల పట్ల చక్కటి అవగాహన కల్పించేందుకు వీలవుతున్నది.
mela 3 
ఆదివారం ఉదయం తల్లితండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా మాత పితృ వందనం నిర్వహించారు. తల్లిదండ్రులను పూజించడం ద్వారా కుటుంబ విలువలను తెలుసుకునేందుకు వీలవుతుంది. మాతా అమృతానందమయి ట్రస్ట్ తెలంగాణ ఇన్ ఛార్జ్ స్వామిని సువిద్యామిత్ర ముఖ్యఅతిథిగా విచ్చేశారు. స్పిరిచువల్ సైంటిస్ట్ వి ఎస్ ఆర్ మూర్తి వక్త గా హాజరై చక్కటి విలువలు తెలిపేలా ప్రసంగించారు.

mela 2 
 
సేవా ప్రదర్శిని కార్యక్రమంలో 180కు పైగా సేవా సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. వివిధ రంగాలలో సమాజం కోసం అద్భుత సేవలు అందిస్తున్న సేవా సంస్థలు ఇక్కడ కొలువు తీరాయి. ఆయా సంస్థల సేవలు పట్ల అవగాహన కల్పించేలా ప్రదర్శనలు, కరపత్రాలు, సమాచారం అందించారు. తద్వారా కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, యువత మరియు సందర్శకులకు సేవా కార్యక్రమాల పట్ల చక్కటి అవగాహన కలుగుతున్నది.
 
ఆదివారం మధ్యాహ్నం సామాజిక సేవ చేస్తున్న వారికి మానవీయం పేరుతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయా సంస్థలు, వ్యక్తులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఈ తరం యువతకు పరిచయం చేశారు. రాష్ట్రీయ సేవా భారతి ట్రస్టీ ఎక్కా చంద్రశేఖర్ ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాల పట్ల యువతలో అభిరుచి ఏర్పడాలని అభిలషించారు.

hssf2 
మూడు రోజులు పాటు జరిగిన సేవా ప్రదర్శిని కార్యక్రమానికి వేల సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు. అనేక వందన కార్యక్రమాలు, సేవ స్టాల్స్ ని సందర్శించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన HSSF మరియు IMCTF నిర్వాహకుల్ని అభినందించారు.