న కార్తిక సమో మాస:... కోటి కాంతుల కార్తిక పౌర్ణమి

VSK Telangana    14-Nov-2024
Total Views |

KP 
 
''న కార్తీక సమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్తమమ్”
 
అని స్కాంద పురాణంలో ఉంది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు” అని అర్ధం. ఈ కార్తీక మాసంలో అన్నీ రోజులు పవిత్రమైనవే అయినప్పటికీ కార్తీక పూర్ణమి చాలా ప్రత్యేకం. ఈరోజున దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతుంటాయి. ఆరోజు సాయంత్రం దీపకాంతుల శోభ వర్ణించలేం కూడా. దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, కుమార దర్శనమనే పేర్లతో కూడా ఈ కార్తీక పూర్ణమిని పిలుస్తారు. ఈ కార్తీక పూర్ణమి హరిహరులిద్దరికీ ప్రత్యేకం. ఈరోజున శివకేశవులిరువురినీ పూజించాలి. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించింది ఈ రోజునే.
 
ఇక శివుడు త్రిపురాసురులను సంహారించింది కూడా ఈరోజునే. తారకాసురుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు అసురులు తారకాసురుడి కుమారులు. వీరు బ్రహ్మచేత ఒక విచిత్రమైన వరాన్ని పొందుతారు. అవేమిటంటే ముగ్గురూ మూడు పురాలను అవి కూడా బంగారం, వెండి, ఇనుములతో నిర్మించాలని కోరుకుంటారు. ఇక వారు చనిపోవాలంటే రథంకాని రథంలో వచ్చి, విల్లు కాని విల్లుతో, వాలు కాని వాలుతో ఈ మూడు పురాలను ఒక్కసారిగా కూల్చివేయాలని, అలా తప్ప తాము మరణించకూడదనే వరాన్ని పొందుతారు. వారి ఆగడాలు మితిమీరిపోవడంతో శివుడి వద్దకు దేవతలు వెళ్లి మొరపెట్టుకుంటారు. దాంతో శివుడు భూమి రథంగానూ, సూర్యచంద్రులు రథ చక్రాలుగా, వేదాలను గుర్రాలుగా, బ్రహ్మను రథసారధిగా చేసుకుని, దేవతా శక్తులన్నింటినీ విచిత్రమైన విల్లులుగా చేసుకుని, ఆ అసురులను సంహరిస్తారు. ఇదే త్రిపురాసుర సంహారం. అది కార్తీక పూర్ణమి రోజుననే జరిగింది.
 
ఈ కార్తీక పూర్ణమిని ఉత్తర భారతంలో దేవదీపావళి అనే పేరుతో విశేషంగా జరుపుకుంటారు. వారికి కార్తీక పూర్ణమితో కార్తీకమాసం ముగుస్తుంది. మఖ్యంగా శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణంలో చాలా బాగా జరుపుకుంటారు. సాధారణంగా మనకు ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు రకాల అయనాలున్నాయి. దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి. ఈ అయనంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఈ సమయంలో దేవతా శక్తులన్నీ సన్నగిల్లుతాయి. అందుకే వారికి శక్తిని కలిగించడం కోసం దేవ దీపావళి అనే పేరుతో ఆకాశ దీపాలను, ఇతర దీపాలను వెలిగిస్తారు. మామూలుగా ఆశ్వయుజ అమావాస్య నాడు వచ్చే దీపావళి పితృదేవతల కోసం చేస్తారు. ఈ రోజున ఉత్తరం వైపుగా దీపాన్ని ఉంచి పెద్దల కోసం పూజిస్తారు. అయితే కార్తీక పూర్ణమి రోజున వచ్చే ఈ దీపావళిని మాత్రం దేవతల ప్రీతి కొరకు చేస్తారు. దీన్ని కాశీలో విశేషించి చేస్తారు.
 
ఎందుకంటే కాశీనగరం సాక్షాత్తూ పరమశివుడు కొలువైన ప్రాంతం, త్రిపురాసురులను సంహరించినది పరమశివుడే కాబట్టి అక్కడ అంత విశేషంగా నిర్వహిస్తారు. అంతేకాదు దేవదీపావళిని కాశీ అంతటా జరుపుకున్నా విశేషించి పంచగంగా ఘాట్ లో ఎక్కువగా చేస్తారు. దూద్ పాప, కిరణా, గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమే పంచగంగా ఘాట్. బిందుమాధవ మందిరం దగ్గర ఉంటుంది. కాశీలో ఒక్కో మాసంలో ఒక్కోఘాట్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకే ఆయా మాసాలలో ఆయా ఘాట్ లలో విశేషించి స్నానాదులు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో కాశీలో ఉన్న ఈ పంచగంగా ఘాట్ లో స్నానాదులు ఆచరించాలని కాశీఖండంలో రాసి ఉంది. కాబట్టి విశేషించి ఈ ఘాట్ లోనే దేవదీపావళిని నిర్వహిస్తారు.
 
 
ఇక మరికొన్ని ప్రాంతాలలో కార్తీక పూర్ణమి రోజున కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు.
తెలంగాణలో జన్నెకు విడవడం అని దీన్ని అంటారు. అందుకే తెలంగాణలో కార్తీక పూర్ణమిని జీడికంటి పున్నమ అనే పేరుతో పిలుస్తారు. వృషోత్సర్జనం అంటే ఆవుకు, ఆంబోతుకు వివాహాన్ని జరిపించి, వాటి దగ్గర పెద్దల ప్రీత్యర్థం పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ ఆంబోతుకు అచ్చు వేయించి స్వేచ్ఛగా గ్రామంలో వదులుతారు. దీని వల్ల గయలో వారి ఆత్మశాంతికోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పద్ధతి గురించి శాస్త్రాలలో కూడా రాసి ఉంది. కానీ ఆనవాయితీ ఉన్న అతికొద్ది మంది మాత్రమే ఈ పద్థతిని చేస్తారు. ఇక తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి ఈరోజున వేలాదిమంది అక్కడికి తరలివెళతారు. ఇలా భారతదేశమంతటా వివిధ రకాల పేర్లతో కార్తీక పూర్ణమిని ఘనంగా జరుపుకుంటారు.