సాధువులతో సంప్రదించిన తర్వాత, అన్ని హిందూ పండుగలను తిథి, పంచాంగం ప్రకారం జరుపుకోవాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనిలో సమావేశమై ప్రభుశ్రీ రాంలాలా సర్కార్ ప్రతిష్టాపనా ఉత్సవాన్ని కూడా ప్రతి ఏడాది హిందువులు జరుపుకోవాలని పిలుపిచ్చింది.
పంచాంగం ప్రకారం, ప్రాణఃప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం పుష్య మాసం శుక్లపక్షంలో ద్వాదశి అనగా కూర్మ ద్వాదశి నాడు జరుపుకోవాలని సూచించింది. ఈ తేదీని “ప్రతిష్ట ద్వాదశి” అంటారు. 2025 సంవత్సరంలో ఈ తేదీ జనవరి 11న ఉంటుందని తెలిపింది.
మందిరం ప్రాంగణలోని భక్తుల సేవా కేంద్రం సమీపంలో 3000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్యశాల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మహాంత్ నృత్యగోపాల్ దాస్ జీ మహారాజ్ 500 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథి గృహం, ట్రస్ట్ కార్యాలయం నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆలయ కాంప్లెక్స్‌లో ప్రయాణికులను ఎండ, వానల నుండి రక్షించడానికి తాత్కాలిక జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో 9 మీటర్ల వెడల్పు, దాదాపు 600 మీటర్ల పొడవుతో శాశ్వత షెడ్డును నిర్మించనున్నారు. ఆలయ సముదాయ నిర్మాణంలో భాగంగా సప్త మండలం ఆలయం మార్చి నాటికి, శేషావతార ఆలయం ఆగస్టు నాటికి, ఆలయ బయటి ప్రాకారం అక్టోబరు నాటికి పూర్తవుతుందని తెలిపారు.