ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.దీంతో అక్కడ హిందువులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... నిత్యం హిందువుల పక్షాన పోరాడుతున్నారు కాబట్టే కృష్ణదాస్ ను అరెస్ట్ చేసినట్లు, బెయిల్ కూడా రాకుండా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. మరోవైపు అక్కడి మత ఛాందస ప్రభుత్వం ఇస్కాన్ ను నిషేధించే యోచనలో కూడా అక్కడి ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. ఇస్కాన్‌ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయవాది మొనిరుజ్జమాన్ దాఖలు చేశారు. ఇస్కాన్‌పై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అదేవిధంగా రంగ్‌పూర్, చట్టోగ్రామ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమర్జెన్సీ విధించాలని కోరారు.
హైకోర్టు స్పందిస్తూ.. ఇస్కాన్ కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బంగ్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇస్కాన్‌పై నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతోందని, తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వం చర్చిస్తోందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా, అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.