రైలు పట్టాలపై ఇబ్బందులు సృష్టించి, రైలు ప్రమాదాలు చేయడానికి దేశంలో కొందరు ప్రయత్నిస్తున్నారు. రైలు పట్టాలపై సిలిండర్లు, రాడ్లు.. ఇతరత్రా వుంచి, ప్రమాదం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నమే చేస్తుండగా... అబ్దుల్ కదీర్‌ను ముంబై రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
అబ్దుల్ కదీర్ వయస్సు 20 సంవత్సరాలు. రైల్వే ట్రాక్ పై పొడవైన ఇనుప రాడ్లను విసిరాడు. గోరేగావ్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వెడుతున్న లోకల్ ట్రైన్ శాంటాక్రజ్-ఖర్ రోడ్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఆ సంఘటన జరిగింది.
అబ్దుల్ 15 అడుగుల పొడవైన ఇనప రాడ్‌ను దొంగతనం చేసాడు. డ్రగ్స్ కోసం దాన్ని అమ్మివేయాలని ముందు అనుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆ ఇనుప రాడ్‌ను రైల్వేట్రాక్ మీదకు విసిరేసాడు. అదృష్టవశాత్తు రైలుకు భారీ ప్రమాదం తప్పడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు.
అబ్దుల్ ముంబైలోని ఖర్ వెస్ట్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. రైల్వే పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి, పట్టాల మీద ఇనుప రాడ్ విసిరేసింది అతనేనని నిర్ధారించుకున్నాక అరెస్ట్ చేసారు. అబ్దుల్ షేక్ మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు.