బంగ్లాదేశ్ లో హిందువులపై, ధర్మంపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి దేవాలయాలు, హిందువులు, హిందూ సంస్థలపై దాడులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని మండిపడింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, మైనారిటీల భద్రతపై భారత విదేశాంగ శాఖ రాజ్యసభలో రాతపూర్వకంగా స్పందించింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు నిజమేనని ధ్రువీకరించింది. అలాగే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
అక్కడి హిందువులు, దేవాలయాల భద్రతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. అలాగే నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని కూడా కోరింది. ఇప్పటికే తాము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరామని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలు శాఖ సభ దృష్టికి తెచ్చింది. ఢాకాలోని తాంతిబజార్ లోని పూజా మండపంపై దాడులు, దుర్గాపూజ మండపాలపై దాడులు, కాళీ ఆలయంలో దొంగతనం వంటి సంఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.