ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా వచ్చే ఏడాది జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలో కుంభమేళాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు 200 అగ్నిమాపక కమాండోలను సైతం ఉంచనున్నట్లు తెలిపారు. ఈమేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగిస్తాం. ఇది ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువుంటుంది. ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు మంటలను సైతం అదుపు చేస్తాయి. దీంతోపాటు 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ తరహాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీని ప్రారంభించాం. ఈ యూనిట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది సిబ్బంది ఉన్నారు. వారు జాతర సమయంలో హై రిస్క్ జోన్‌లలో మోహరిస్తారు’ అని పేర్కొన్నారు. అగ్నిమాపక సేవల కోసం గత కుంభమేళాకు రూ.6 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.67 కోట్లకు పెంచినట్లు తెలిపారు.