బంగ్లాదేశ్ లో హిందువులు, దేవాలయాలు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై విశ్వహిందూ పరిషత్ మండిపడింది. వాటికి నిరసనగా శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఈ నిరసనల్లో బజరంగ్ దళ్ కూడా పాలుపంచుకోనుంది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నిరసనలు భారత్ అంతా జరుగుతాయని వీహెచ్ పీ ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం వీహెచ్ పీ నిరసన కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నిరసన కార్యక్రమాలు శనివారం కూడా కొనసాగుతాయని పేర్కొంది.
బంగ్లాదేశ్ లో హిందువులపై వేధింపులు పెరిగాయని, దేవాలయాలపై దాడులు, వాటిని అపవిత్రం చేయడం కూడా పెచ్చురిల్లాయని మండిపడింది. వీటితో పాటు పవిత్రమైన సాధువులను అరెస్ట్ చేయడం కూడా గర్హనీయమని పేర్కొంది. వీటన్నింటిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టినట్లు ప్రకటించింది. అక్కడి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, దోషులను బంగ్లాదేశ్ ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నిరసన కార్యక్రమాల్లో దేశంలోని హిందువులందరూ పాల్గొనాలని వీహెచ్ పీ పిలుపునిచ్చింది.