కన్యావందనం.. ప్రకృతి వందనం... నారీ వందనాలతో శోభిల్లిన HSSF సేవాప్రదర్శిని

VSK Telangana    09-Nov-2024
Total Views |
 
mela2
 
విలువలతో కూడిన సమున్నత భావి భారత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటైన హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (HSSF) బృహత్ మేళా - సేవా ప్రదర్శిని 2వ రోజైన శుక్రవారం నాటి కార్యక్రమం ఆద్యంతం ఆదర్శవంతమైన వాతావరణంలో సాగింది. ఉదయం కన్యావందనం, మధ్యాహ్నం ప్రకృతి వందనం, సాయంత్రం నారీ వందన కార్యక్రమాలు బాలబాలికలకే కాక పెద్దలకు సైతం సామాజిక విలువలను నిలబెట్టుకోవలసిన ఆవశ్యకతను చాటి చెప్పాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విచ్చేసిన వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ సేవా ప్రదర్శినిలో కన్యావందనం, ప్రకృతి వందనం, నారీ వందన కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక - నైతిక విలువలు, సామాజిక బాధ్యతను తెలియజెప్పే నాట్య నాటకాది సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి తమ ప్రతిభా పాటవాలతో పిన్నలు, పెద్దలను ఆచ్చెరువొందించారు.
 
స్త్రీని దైవంగా భావించి గౌరవించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఉదయం జరిగిన కన్యావందన కార్యక్రమం చూడటానికి రెండు కళ్లూ చాలవన్నంత మనోహరంగా సాగింది. దేశంలో బాలికలు, స్త్రీల పట్ల జరుగుతున్న అవమానాలను నిరోధించి, వారి ప్రాధాన్యతను గుర్తించి గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేలా HSSF నిర్వాహకులు ఈ వేడుకను నడిపించారు. బాలికలందరినీ కుర్చీలలో కూర్చోబెట్టి, వేదమంత్రాలు, స్తుతుల మధ్య వారికి బాలురతో పసుపు కుంకుమలు, పూలతో పాదపూజ చేయించారు. పూజలందుకుంటున్న బాలికలను సోదరిగా, తల్లిగా, దైవంగా భావించాలని బాలురకు హితవు చెప్పారు. ఈ కార్యక్రమం నడుస్తున్నంతసేపూ లోకంలో సృష్టికి మూలమైన స్త్రీ ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు, ఇతర పెద్దలు ఆనందంతో తిలకిస్తుండగా పూజలందుకున్న బాలికలు తమకు లభిస్తున్న ఈ గౌరవానికి గాను ఆనందంతో భావోద్వేగాలకు లోనయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి తమ ప్రసంగంలో స్త్రీ ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను వివరించారు.
 

mela1 
పశుపక్ష్యాదులు, మానవులు సహా సహా జీవకోటి మనుగడకు అత్యంత కీలకమైన వృక్షసంపదను కాపాడుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఇదే వేదికపై మధ్యాహ్నం జరిగిన ప్రకృతి వందన కార్యక్రమం సమాజ బాధ్యతను తట్టిలేపింది. విద్యార్థులందరికీ మొక్కలను అందజేసి, పువ్వులు, పసుపు కుంకుమలతో ఓం వృక్షదేవతాయై నమః అంటూ అర్చన చేయించారు. ప్రాణవాయువునిచ్చి మనకి ఊపిరిపోస్తున్న వృక్షాలను కాపాడుకోవడం మన కర్తవ్యమని బోధించారు. పుట్టినవేడుకలకు గుర్తుగా మొక్కను పెంచాలనే సంకల్పం తీసుకోవాలని హితవు చెప్పారు. పూజానంతరం విద్యార్థులు ఆ మొక్కలను తమతో తీసుకువెళ్లారు. ప్రకృతికి ప్రతిరూపమైన మొక్కలు, వృక్షాలు, గోమాత, నాగులు, జలం, భూమాతను కాపాడతామని, పూజిస్తామని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆరాధిస్తామని, స్త్రీలను, సైనికులను గౌరవిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
 
mela2 
 
అరబిందో అంతర్జాతీయ విద్యాలయం డైరెక్టర్ చలమాయి రెడ్డి మాట్లాడుతూ ఈ సేవా ప్రదర్శినిలో ప్రకృతి ఆరాధనకు స్థానం కల్పించి మహత్కార్యం చేశారని కొనియాడారు. మొక్కలలోని ఔషధ విలువలను, ఇతర అంశాలను తెలిపారు. విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ శోభ ప్రసంగిస్తూ విద్యార్థుల మధ్యలోకి వెళ్లి విద్యార్థుల అనుభవాలను చెప్పించారు. వృక్ష సంపద, జలంతో కూడిన ప్రకృతిని మనకిస్తున్న లాభాలను తెలిపారు. వృథా చేయకుండా వనరులను రక్షించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమానికి వనజీవి రామయ్య దంపతులు విచ్చేసి వృక్షో రక్షతి రక్షితః అంటూ తమ ప్రసంగం ద్వారా విద్యార్థులను ఉత్తేజపరిచారు. రామయ్యతో పాటుగా వృక్ష రక్షకుడు దూసర్ల సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని స్పష్టం చేశారు.
 
రెండవ రోజున చివరి కార్యక్రమంగా నారీ వందన్ (మహిళా సమ్మాన్) కార్యక్రమం జరిగింది. కుటుంబ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థకు మూలమైన స్త్రీని గౌరవించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని, స్త్రీని పరిహసించడం, అవహేళన చేయడం తగదని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేనేజ్ సంస్థ పూర్వ డైరక్టర్ జనరల్ ఉషారాణి పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవహక్కుల చైర్‌పర్సన్ ఎస్ విజయభారతి మాట్లాడుతూ సర్వే భవంతు సుఖినః అన్న ఆర్యోక్తిని అనుసరించి హ్యూమన్ రైట్స్ సంస్థ పని చేస్తోందన్నారు. ఈ వేదికపై చేపట్టిన కార్యక్రమాలే తమకు ఫిర్యాదులుగా వస్తాయంటూ సంస్థ పనితీరును వివరించారు. సమాజంలోని వివిధ రంగాల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.
 
mela3
 
ముఖ్యవక్త, భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గంగాధర శాస్త్రి మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలలో ఇమిడి ఉన్న సామాజిక బాధ్యతను వివరించారు. హిందూధర్మం ఎంతో శక్తిమంతమై ఉండగా హిందువులు మాత్రం బలహీనులై ఉన్నారని ఆవేదన చెందారు. భారతదేశంలో పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం, తెలుగువారిగా పుట్టినందుకు పోతన పద్యం ఒక్కటైనా రాకపోతే మన ఉనికికి అర్థమేంటని ప్రశ్నించారు. మాతృభూమి పట్ల శ్రీరాముని గల గౌరవాన్ని తెలియజేస్తూ దేశభక్తిని చాటిన రాముని బాటలో నడవాలని పిలుపునిచ్చారు. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు రిటైర్మెంట్ పుస్తకాలు కావని, అనునిత్యం ఆచరించాల్సినవని తెలిపారు.