విజయ్ దివస్: 1971 యుద్ధంలో భారత్ సాధించిన వీరోచిత విజయం

VSK Telangana    16-Dec-2024
Total Views |
 
war
 
పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్ రూపంలో ఓ కొత్త దేశం ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. 1971 నాటి యుద్ధం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ. ఇందులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ యుద్ధం 1971 డిసెంబరు 3న భారత వైమానికదళ స్టేషన్లపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులతో ప్రారంభమైంది. తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీ జాతీయవాద సమూహాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలనే భారత నిర్ణయానికి దారి తీసింది. అనూహ్య ఓటమి ఫలితంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులను భారతీయ సైన్యం బందీలుగా పట్టుకుంది. పాకిస్తాన్ నియంత్రణ నుండి విముక్తి పొంది తూర్పు పాకిస్తాన్ తదనంతరం బంగ్లాదేశ్‌గా మారింది.
 
1947 విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా విభజించబడింది. భారతదేశానికి పశ్చిమం నుండి ఒకటి, తూర్పు నుండి మరొకటి. ఆ కాలంలో బెంగాల్‌కు సమీపంలో ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు పాకిస్తాన్‌గా పిలిచేవారు. తూర్పు పాకిస్తాన్‌లో హిందువులు మరియు ముస్లింలు దాదాపు 75 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు. పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య దాదాపు 16 వందల కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండటమే కాకుండా, రెండు ప్రాంతాల వారి ఆలోచనలు, వంటకాలు మరియు భాష కూడా విభిన్నంగా ఉండేవి.
 
పశ్చిమ పాకిస్తాన్ అధికారులు మొదటి నుంచి తూర్పు పాకిస్తాన్ వారి బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతిని నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చారు. 1951లో పాకిస్తాన్ ఉర్దూను దేశ జాతీయ భాషగా ప్రకటించినప్పుడు, బెంగాలీని రెండో భాషగా ప్రకటించాలని తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పశ్చిమ పాకిస్తాన్ పెడ చెవిన పెట్టింది. 1970 ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రెహమాన్‌కు చెందిన అవామీ లీగ్ విజయం సాధించగా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అతడిని పశ్చిమ పాకిస్తాన్ అనుమతించకుండా తూర్పు పాకిస్తాన్ ప్రధాని యాహ్యాఖాన్ తూర్పు పాకిస్తాన్‌లో మార్షల్ లా విధించాడు. దీంతో 1971 యుద్ధానికి కొన్ని నెలల ముందు, తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. రక్తం ఏరులై పారింది.
 
యూదులపై ఏ విధంగా అయితే హిట్లర్ మారణహోమానికి పాల్పడ్డాడో అదే విధంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో బెంగాలీ జాతీయవాదుల అణచివేతకు దిగింది. ఆ సమయంలో బెంగాలీ జనాభాలో 80 శాతం మంది ముస్లింలు అయినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ మత పెద్దలు బెంగాలీ స్వాతంత్ర్య సమరయోధులను ‘‘హిందువులు’’ అని బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపరిచేందుకు బెంగాలీ మహిళలను ‘‘యుద్ధ వస్తువులు’’‌గా ప్రకటించి అత్యాచారం వంటి నేరాలకు మద్దతు ఇచ్చారు.

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం యొక్క తొమ్మిది నెలల కాలంలో పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ గ్రూపుల సహాయంతో 2 నుంచి 3 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది. 2 లక్షల నుంచి 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడింది. 1971 డిసెంబరు 14న పాకిస్తాన్ సైన్యం 100 మంది వైద్యులు, ప్రొఫెసర్లు, రచయితలు, ఇంజనీర్లను అపహరించి హత్య చేసి వారి మృతదేహాలను సామూహిక ఖననం చేసింది.
 
బంగ్లాదేశ్‌లోని ముక్తి బాహినీ తనదైన రీతిలో స్వాతంత్ర్య పోరాటం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం భారతీయ వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో భారతీయ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ ప్రజలను రక్షించేందుకు పాకిస్తాన్ పై యుద్ధానికి దిగింది. 13 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో 1400 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించగా 1971 డిసెంబరు 16న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఏఏ.ఖాన్ నియాజీ సుమారు 93 వేల మంది సైనికులతో భారత్‌కు లొంగిపోయాడు. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం డిసెంబరు 16ను విజయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు యావత్ భారతదేశం నివాళులు అర్పిస్తూ వస్తుంది. మొత్తంగా భారత వీర జవాన్ల ధైర్య సాహసాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా 1971 డిసెంబరు 16న తూర్పు పాకిస్తాన్ స్వతంత్రమై బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా జన్మించింది. భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన డిసెంబరు 16వ తేదీన సంఘ్ ప్రతి సంవత్సరం ప్రహార్ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుంది. ఆ విధంగా, మహారాణా ప్రతాప్, రాణి దుర్గావతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా వారి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని జాతిని జాగృతం చేస్తోంది.
ఇక తాజా పరిస్థితిని గమనిస్తే, బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఇంతగా పోరాడి త్యాగాలు చేసిన భారతీయులకు, హిందువులకు నేడు ఆ దేశంలో ఏమాత్రం గౌరవం, విలువ లేవు. ముస్లిం ఛాందసవాదుల చేతిలో బంగ్లాదేశ్ హిందువులు నిత్యం బలవుతూనే ఉన్నారు. హిందూ బాలికలు, యువతులు, మహిళల అపహరణ, అత్యాచారాలు, బలవంతపు మతమార్పుడులు యథేచ్ఛగా జరిగిపోతున్నా పట్టించుకునే దిక్కు లేదు. బంగ్లాదేశ్  హిందువులకు ఈ పరిస్థితి కొత్తగా వచ్చింది కాదు. పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పాడినప్పటి నుంచీ తరచుగా హిందువులపై మారణకాండ జరుగుతూ కోట్లాదిమందిని బలిగొన్నారు. అవేవీ నేటి తరంవారికి పెద్దగా తెలియవు. అక్కడ అధికారంలో ఎవరున్నా భారత్ నుంచి సాయం మాత్రం క్రమం తప్పకుండా అందుకుంటూ హిందువులను మాత్రం హింసించడంలో ముందుంటారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత జరిగిన ఘోరాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తామర తంపరగా వచ్చిపడ్డాయి. ఒకప్పుడు ఏ పాకిస్తాన్ అయితే బంగ్లాదేశ్ ప్రజలను పీడించిందో ఇప్పుడు అదే పాక్‌తో బంగ్లాదేశ్ జట్టుకట్టు భారత్‌ను కవ్విస్తోంది.