ధర్మాన్ని ఆచరించడం ద్వారానే ధర్మం పరిరక్షింపబడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేవాడే ధర్మాన్ని, మతాన్ని అర్థం చేసుకోగలడని వివరించారు.ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ఇలా అర్థం చేసుకోవడం కష్టమని, ఎందుకంటే ప్రజలు ఈ కాలంలో అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. మిడిమిడి జ్ఞానంతో గర్వించే వ్యక్తికి బ్రహ్మ కూడా వివరించలేడన్నారు. అమరావతిలోని మహానుభావ ఆశ్రమం శతజయంతి మహోత్సవంలో సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధర్మాచరణం ద్వారానే ధర్మాన్ని అర్థం చేసుకోవాలని, దానిని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూనే వుండాలని, అలా ధర్మం ఏది కాంక్షిస్తుందో ఆ పనిని చేస్తూ వెళ్లాలని సూచించారు.
గతంలో ఈ ధర్మం ఆధారంగా జరిగిన అఘాయిత్యాలకు ప్రజల్లో నెలకొన్న అపోహలే కారణమని విశ్లేషించారు. జ్ఞానోదయమైన మార్గంలో ప్రయాణిస్తున్న వారే ఈ దేశానికి గర్వకారణమని ప్రకటించారు. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మహానుభావుల కృషి కొనసాగుతూనే వుంటుందన్నారు. ఐక్యతే శాశ్వంతంగా వుంటుందని, ఇది ప్రపంచం మొత్తానికీ వర్తిస్తుందన్నారు. హింసకు తావు లేకుండా ధర్మ రక్షణ చేయాలని తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించిన 1000 సంవత్సరాల కాలంలో హిందూ ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించే మహత్తర కార్యాన్ని భారతదేశ వ్యాప్తంగా మహానుభావులు కొనసాగిస్తూనే వున్నారన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా కృషి చేస్తోందని, నిజమైన సంకల్పంతో పనిచేస్తే అది కచ్చితంగా పూర్తవుతుందన్నారు.
ధర్మాన్ని సరిగ్గా ఆకళింపు చేసుకోవడం వల్లే సమాజంలో శాంతి, సామరస్యం లభిస్తుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మానవాళికి సేవ చేయడమే ధర్మం ముఖ్య ఉద్దేశమని, ధర్మం హింస, దురాగతాలను ఎన్నడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు.ధర్మం ఎల్లప్పుడూ ఉనికిలో వుంటుందని, ప్రపంచంలో ప్రతిదీ ధర్మం ప్రకారమే నడుస్తుందని తెలిపారు.