భద్రాచలంలోని సారపాక బీపీఎల్ సాకేత పురిలో వర్తక సంఘం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాకర్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దట్టమైన పొగ మంచు, చలి తీవ్రత అధికంగా వున్నా... లారీయార్డ్ మొత్తాన్ని అత్యంత ఓపికతో వాకర్స్ అందరూ స్వచ్ఛ భారత్ నిర్వహించి, పరిసరాలను శుభ్రం చేశారు. లారీయాడ్ ఖాళీగా వుండటంతో కొన్ని రోజులుగా మద్యం సేవించడం, వ్యర్థాలు పారబోయడం, చెత్తా చెదారంతో ఆ పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా తయారయ్యాయి.
దీంతో ప్రతి రోజూ వాకింగ్ చేసే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాకర్స్ అందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని సంకల్పించారు. చెత్తా చెదారం, పిచ్చి మొక్కలంటన్నింటినీ ఒక చోట చేర్చి, కాల్చేశారు. స్వచ్ఛభారత్ నిర్వహించిన వారందరికీ సాకేతపురి వర్తక సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. ఇకపై అందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా వుంచుకోవాలని సంకల్పం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొన్నారు.