''శివాజీ స్ఫూర్తి కేంద్రం దేశానికే ఆదర్శం''

VSK Telangana    26-Dec-2024
Total Views |
 
shivaji
 
శివాజీ స్ఫూర్తి కేంద్రం దేశానికే ఆదర్శమని ఆరెస్సెస్ జ్యేష్ఠ ప్రచారక్ వడ్డి విజయ సారథి అన్నారు. విదేశీ పాలన నుంచి దేశాన్ని రక్షించి, స్వాభిమానంతో పరిపాలన చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరిట శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఎందరికో స్ఫూర్తి నింపుతోందన్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం కమిటీ ఏర్పాటై 50 సంవత్సరాలు కావడంతో ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారకార్థం విశాఖపట్నంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ శివాజీ మెమోరియల్ స్మారక కమిటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

shivaji1 
 
ఈ సందర్భంగా జ్యేష్ఠ ప్రచారకులు వడ్డి విజయసారథి మాట్లాడుతూ... 1970 లో శివాజీ మహారాజ్ 300 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఈ ఆలోచనను అప్పటి ప్రచారకులు వడ్లమూడి రామ్మోహన్ రావుదేనని తెలిపారు. శివాజీ శ్రీశైలం సందర్శించి, కొద్ది రోజులు ధ్యానం చేసిన ప్రాంతంలోనే స్ఫూర్తి కేంద్రం నిర్మించాలనే ఆలోచన వారిదేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు అయ్యిందంటే అందుకు కారణం వడ్లమూడి రామ్మోహన్ రావు అని చెప్పారు.
 
shivaji123
రామ్మోహన్ రావు ఇప్పుడు భౌతికంగా లేకపోయినా, వారి సోదరుడు వడ్లమూడి బ్రహ్మానంద రావు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలన్న ఉద్దేశంతోనే విశాఖలో నిర్వహించామని నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ విశాఖ పట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లమూడి రామ్మోహన రావు ఎందరికో స్ఫూర్తినిచ్చారన్నారు. ఆయనతో తనది విడదీయరాని అనుబంధమన్నారు. సంఘ్ ప్రచారకుల వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని, వారి ఆలోచనా సరళి అనేక మందిని ప్రభావితం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వడ్లమూడి బ్రహ్మానంద రావును నిర్వాహకులు సత్కరించారు.