అయోధ్య రామ మందిరంలోని మొదటి అంతస్తులోకి చేరుకునేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులను ట్రస్ట్ పరిగణనలోకి తీసుకుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా లిఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. మొదటి అంతస్తుకి చేరుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం మూడు లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.రామ దర్బారును చూసేందుకు మొదటి అంతస్తుకు వెళ్లాలనుకునే భక్తులు ప్రస్తుతం మెట్ల సాయంతో వెళ్తున్నారన్నారు.
ఇలా వెళ్లలేని వారు ఆలయం వెనుక వైపు కారిడార్లలను అనుసంధానిస్తూ నిర్మించిన పార్ కోట మీదుగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇక్కడే లిఫ్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇందులోని ఓ పెద్ద లిఫ్టును వీల్ ఛైర్ వాడే భక్తులు మాత్రమే వినియోగించుకోవచ్చని తెలిపారు. వృద్ధులు, వికలాంగులైన భక్తులకు లిఫ్టుల ఏర్పాటు ఉపయోగకరంగా వుంటుందని తెలిపారు. మూడు అంతస్తుల ఆలయంలోని కింది అంతస్తులో కొలువైన రామలల్లాను లక్షలాది భక్తులు దర్శించుకుంటున్నారని, మొదటి అంతస్తులో భగవంతుని దర్బారు వుంటుందని, దీనిపైన మరో అంతస్తులో గర్భగుడి వుంటుందని, ఇందులోని ఏర్పాట్లపై మాత్రం నిర్ణయం కాలేదని మిశ్రా అన్నారు.