దారుణమారణ కాండకు తావిచ్చిన 1947 నాటి భారతదేశ విభజన తరువాత, 1971లో సంభవించిన బంగ్లాదేశ్ ఏర్పాటు లెక్కలేనన్ని జీవితాలను తారుమారు చేసింది. అదే సమయాన ఇస్లామిక్ మతోన్మాద హింసాకాండకు గురై తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి తరలి వచ్చిన హిందూ శరణార్థుల వ్యథాభరిత కథలు శతాబ్దాలు దాటినా నేటికీ మారుమోగుతూనే ఉన్నాయి. తమ పూర్వీకులందించిన సాంస్కృతిక వారసత్వాన్ని, జీవనాధారమైన ఇల్లు వాకిలి, భూమి, వ్యాపారాలను, బంధుమిత్రులను, బంధాలను వదులుకుని కట్టుబట్టలతో కుటుంబాలతో సహా పారిపోయి రావలసి వచ్చింది. నాటి క్రూరాతిక్రూర పరిణామాలతో కోటానుకోట్ల మంది నిరాశ్రయులై తిండి, నిద్ర కరవై, కుటుంబాలకు కుటుంబాలే చెల్లాచెదురై అమ్మనాన్నలు, తోబుట్టువులు ఎవరూ ఎవరికీ కాకుండా పోయారు.
వారిలో ఎందరో ముసలివారై ఈ నాటికీ తమ వారి కోసం వెదుక్కుంటూ నాటి చేదు గతాన్ని మరచిపోలేక మానసికంగా కుంగిపోయి వేదనాభరితులై ఉన్నారు. 1971 నాటి బంగ్లాదేశ్ పరిణామాల క్రౌర్యం బారిన పడి భారత్‌కి తరలివచ్చిన 400కు పైగా హిందూ శరణార్థుల కుటుంబాలు తెలంగాణలోని కొంరంభీమ్ అసిఫాబాద్ జిల్లా కౌతాల మండలం రవీంద్ర నగర్ 1, 2 గ్రామాలలో నివసిస్తున్నాయి. తమ చేదు గతాన్ని, ఒకనాటి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశంలో కొత్త జీవితాన్ని పునర్నిర్మించుకునే దిశగా వీరు అడుగులేస్తున్నారు.
మీడియా బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి శరణార్థులను పలుకరించింది. వీరిలో ఒకరైన 65 ఏళ్ల ప్రభారి మండల్ స్పందిస్తూ ఖుల్నా జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటి నుంచి తమ కుటుంబం కట్టుబట్టలతో వచ్చినప్పుడు తన వయస్సు పదేళ్లని చెప్పారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్ వాసులుగా ఉన్నామని, 1971లో బంగ్లాదేశ్ పౌరులుగాను, ఆ తర్వాత 25 ఏళ్ల కాలంలో భారతీయులుగా మారామని చెప్పారు. ఈ చారిత్రక పరిణామాలు కేవలం రాజకీయ సంబంధంగానే కాక, ఇస్లామిక్ భావజాలపు ఛాందసవాదం కూడా తోడై హిందువులుగా తమకున్న గుర్తింపును చెరిపేసే ప్రమాదంలోకి నెట్టాయన్నారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో 1970 నుంచి 1974 మధ్య కాలంలో చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు అక్కడి హిందువులను దారుణమైన పరిస్థితులకు గురి చేశాయి. హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలపై దాదాపు ప్రతి రోజూ దాడులు, అరాచకం, మహిళల అపహరణ, దోపిడీల వల్ల అక్కడి నుంచి పారిపోవలసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 75 ఏళ్ల కాల్‌చంద్ సర్కార్ ఆనాటి పరిస్థితులను వివరిస్తూ... "బంగ్లాదేశ్‌లోని మా గ్రామంలో అందరూ హిందువులే... కానీ, రాత్రి వేళల్లో చుట్టుపక్కల ఉన్న ముస్లిం మూకలు దాడులు చేసి మా పంటలు, ఆహారం, వస్త్రాలు, నగలు దోచుకుపోయేవారు. మమ్మల్ని అసభ్యంగా తిడుతూ బంగ్లాదేశ్ ముస్లింల భూమి అని, ఇక్కడ హిందువులకు చోటు లేదని నినాదాలు చేసేవారు. ప్రతి రోజూ మా మహిళలు ఇళ్లలో భయం భయంగా ఉండేవారు. బజారుకి వెళ్లినవారు క్షేమంగా వస్తారో లేదో తెలీదు. మా నివాసాలను కొల్లగొట్టి నిప్పు పెట్టేవారు. ఈ నిరంతర వేదన మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రతి గంటా.. ప్రతి రోజూ వెంటాడేది." అని వివరించారు.
ఆ తరువాత నాలుగైదేళ్ల పాటు రాయ్‌పూర్ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్)లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్దదైన "మనా శరణార్థి శిబిరం"లో గడిపిన తరువాత 1974లో ఈ కుటుంబాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. వాటిలో సుమారు 350 కుటుంబాలు సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద ఉన్న ఈ రెండు గ్రామాలలో స్థిరపడేలా ఏర్పాటు చేశారు. నేడు మొత్తం ఈ ప్రాంతంలో 17 గ్రామాలుండగా వీటిలో బెంగాలీ ప్రధాన భాషగా దాదాపు 20 వేలమంది జనాభా ఉంటున్నారు. వీటిలో రెండు గ్రామాలు కౌతాల మండలంలో ఉండగా, మిగిలినవి కాగజ్‌నగర్ పట్టణం సమీపాన ఉన్నాయి.
వీరంతా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి దిక్కుతోచక భారత్ వచ్చిన తరువాత, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి శరణార్థుల కొత్త జీవన ప్రయాణం మొదలైంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రదేశంలో లక్షలాదిమంది శరణార్థులు ఉండగా, త్రిపుర, మేఘాలయ, అస్సాంలో మరికొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషాదకర తరలింపుల్లో చాలామంది తమ బంధువులు, నవజాత శిశువులను పోగొట్టుకున్నారు.
డెబ్భయ్ ఏళ్ల మరొక వృద్ధురాలు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ... నాడు 12 ఏళ్లున్న తన సోదరిని ముస్లిం అల్లరి మూకలు తుపాకీ గురిపెట్టి ఎత్తుకుపోగా తమ కుటుంబం నిస్సహాయంగా చూస్తుండాల్సి వచ్చిందని తెలిపింది. నాడు ఎదురు తిరిగితే ఇలా బతికుండేవారం కాదని, నరికి చంపేవారని భయాందోళన వ్యక్తం చేసింది. నాడు 5 ఏళ్ల వయస్సు గల మరోక వృద్ధుడు స్పందిస్తూ ముస్లిం ఛాందసవాదులు ఇళ్లపా దాడులు చేస్తూ ఎదురు తిరిగిన తమ పొరుగువారిని చంపేసిన ఘటనలను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి రాత్రీ కాళరాత్రిగానే ఉండేదని, మర్నాటి ఉదయం వరకూ బతికి ఉంటామో లేదో తెలియదని అన్నారు.
ఎనభై ఏళ్ల మరో వృద్ధుడు మాట్లాడుతూ తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తమ గ్రామంపై దాడి జరిగిందని, ఎదురు తిరిగిన తమ పొరుగువారిని చంపేశారని, తమ ఇంటికి నిప్పు పెట్టడంతో తామంతా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని, భయానక రాత్రులను గడుపుతూ తెల్లవారే వరకూ బతికుంటామో లేదో తెలియని పరిస్థితులను ఎదుర్కున్నామని చెప్పారు. నాటి పెద్దలు ఈ చేదు జ్ఞాపకాలకు ప్రతినిధులుగా మిగిలిపోగా తరువాతి తరం యువత పరిస్థితులను అందిపుచ్చుకుని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
శరణార్థులకు జీవనాధారంగా వ్యవసాయ భూమిని కేటాయించే క్రమంలో కొత్త దంపతులు, వారి పిల్లలకు సింగిల్ కార్డు మార్కింగ్ చేయగా కొందరు పెద్దలకు వేర్వేరు కార్డులు ఇచ్చారు. అయితే, హడావిడిగా జరిగిన ఈ ప్రక్రియ వల్ల తప్పుల తడకలు చోటు చేసుకుని సంబంధం లేని వారిని ఒకే పెద్ద కుటుంబంగా కలిపేశారు. దీంతో వ్యవసాయ భూమి కేటాయింపు సంక్లిష్టంగా మారింది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ శరణార్థులు మౌనాన్నే ఆశ్రయించి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ప్రతి కుటుంబానికీ 4 నుంచి 5 ఎకరాల మేర సాగుకు వినియోగించని అటవీ భూమిని కేటాయించారు. ఈ భూమిలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ శరణార్థులంతా అవిశ్రాంతంగా శ్రమించి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. ఒకనాడు చెల్లాచెదురై, నిరాశ్రయులై, నిర్వాసితులైన వ్యక్తులు నేడు కష్టజీవులుగా ప్రగతిశీల వ్యవసాయదారులుగా మారి తమ జీవితాలను ఏమీ లేని స్థాయి నుంచి పునర్నిర్మించుకున్నారు. ఈనాడు వీరంతా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా స్ఫూర్తిదాతలై నిలిచారు.
నాటి హిందూ శరణార్థుల జీవన ప్రయాణమంతా వెతలు, బాధలమయంగా సాగింది. అన్నవస్త్రాలు, నిత్యావసరాలు, నిలువ నీడ లేక, తమ పశువులను, భూమిని కోల్పోయి, కట్టుబట్టలతో కుటుంబ సభ్యులతో నడిరోడ్డుపై పడాల్సిన పరిస్థితులను ఎదుర్కున్నారు. తెలంగాణను గడగడలాడించిన రజాకార్లు సైతం బంగ్లాదేశ్ ముస్లింల భూమి అని ప్రకటించి మైనార్టీ హిందువులను హింసకు, మారణకాండకు గురి చేశారు. నాడు ఖుల్నా డివిజన్ నుంచి, మరీ ముఖ్యంగా ఖుల్నా నుంచి ఎందరో శరణార్థులు ముస్లిం మూకల నుంచి తప్పించుకునేందుకు అడవుల గుండా మైళ్ల కొద్దీ దూరం నిద్రాహారాలు లేకుండా ప్రయాణం చేశారు. ముఖ్యంగా గట్టి భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద సరిహద్దులు దాటే క్రమంలో తమకు సాయం చేసేందుకు బ్రోకర్లకు పెద్ద మొత్తంలో లంచాలిచ్చి భారత్‌లోకి అడుగుపెట్టారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడితే తిరిగివెళతారా?... అన్న ప్రశ్నకు ఒక మహిళ బదులిస్తూ కచ్చితంగా వెళ్లేది లేదన్నారు. ముస్లింలు తమను కాఫిర్లు అంటూ మళ్లీ తమను పూర్తిగా నిర్మూలించే కుట్రలు పన్నుతారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నేటికీ ఉన్న విభజనకర పరిస్థితులను ఆమె మాటలు ప్రతిబింబించాయి. తమను స్థానిక హిందువులు, ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల వారు ఎంతో ప్రేమగా చూసుకుని చెప్పలేనంత సాయం చేశారని, తామంతా గౌరవంగా జీవించేలా, కలిసిపోయేలా తోడై నిలిచారని ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులు లక్ష్యంగా కొనసాగుతున్న దాడుల గురించి వీరు స్పందిస్తూ నేడు అక్కడ నివసిస్తున్న తమ బంధువులకు ఎదురవుతున్న పరిస్థితులను కథలు కథలుగా వివరించారు. వారందరినీ నిరంతరం భయాందోళనలు వెంటాడుతున్నాయన్నారు. 50 ఏళ్ల కిందట జరిగిన ఘోరాల గుర్తులు వెంటాడుతుండగా నేడు బంగ్లాదేశ్‌లో ఉన్న తమ బంధువులతో కొందరు ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో వీరంతా అక్కడి పరిణామాలను గమనిస్తు తమ కుటుంబీకుల భద్రత కోసం ఆందోళన చెందుతున్నారు.
ఇక తమ తర్వాతి తరం యువతీ యువకులు చదువులో రాణించి, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో పైకి వచ్చారని, భారత సైన్యంలో సేవలందించడంతో పాటు స్థానిక వ్యాపారాలలోనూ నిలదొక్కుకుని వృద్ధి చెందారని ప్రభారి మండల్ తెలిపారు. ఒకప్పుడు తమ పెద్దలు, తాము భారతదేశంలో కొత్త జీవితం కోసం ఎంతో కష్టపడ్డామని, దైవం తమను అనుగ్రహించి నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ పరిణామాలతో చెల్లా చెదురై భారత్ చేరిన ఈ హిందూ శరణార్థులు తమ బెంగాలీ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ధార్మిక సంప్రదాయాలు, భాష సంపదను గత 50 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వీరు ఇక్కడ కాళీ మాతకు రెండు ఆలయాలను నిర్మించి, సాయంకాల వేళల్లో తులసి పూజ చేస్తుంటారు. ఇంకా ప్రతి గ్రామంలోనూ నెలకొకసారి భజనలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాలలో రామాయణ భారతాల నుంచి ప్రవచనాలు, సంకీర్తనలతో పాటు హిందూ ధర్మ బోధనలు ఉంటాయి. ఉమ్మడిగా పండుగలు చేసుకుంటారు. తాము పడిన కష్టసుఖాల జీవిత విలువలను భావితరాలకు తెలియజేస్తూ పరస్పర సహకారంతో తమ అనుబంధం మరింత బలపడి ఐక్యతతో కొనసాగేలా కృషి చేస్తున్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఈ బంగ్లాదేశీ హిందూ సామాజిక వర్గం పురోగతికి, ఆనూకుల్యతకు ప్రతీకగా నిలిచింది. బంగ్లాదేశ్‌లో మారణకాండతో మొదలైన వీరి ప్రయాణం భారతదేశంలో తమ జీవన పునర్నిర్మాణంతో కృతకృత్యులైన తీరు మానవ చైతన్య స్ఫూర్తిని, భారతీయ సమాజంలోని కలసిపోయే తత్వాన్ని ఎలుగెత్తి చాటుతోంది.
బంగ్లాదేశ్‌లో గత ఆగస్టు నెల నుంచీ హిందువులపై జాతి నిర్మూలన లక్ష్యంగా పథకం ప్రకారం మతోన్మోదంతో కూడి సాగుతున్న ఊచకోతను ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. హిందువుల అరెస్టులు, హత్యలు, అపహరణలు, మహిళలపై లైంగిక హింసాకాండ గురించి నిరంతరం వస్తున్న వార్తలు ఆనాటి మతోన్మాద క్రౌర్యాన్ని పునరావిష్కరిస్తున్నాయి.