వరంగల్‌లోని ఆత్మకూరు గ్రామస్థులు పురాతన దేవాలయాన్ని తిరిగి బాగుచేసుకున్నారు. గ్రామానికి చెందిన 1,000 మంది 11 వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని తిరిగి బాగు చేసుకున్నారు. అక్కడ 11 వ శతాబ్దం నాటి ‘‘పంచకూట శివాలయం’’ వుంది. దీనిని తిరిగి బాగు చేసుకొని, దర్శనార్థం తగిన విధంగా తయారు చేసుకున్నారు. గత నెలలోనే దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొక్కితే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి రోజూ దాదాపు 100 మంది భక్తులు ఇక్కడి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారని, అయితే.. పూజలు చేసేందుకు అణుగుణంగా దేవాలయం లేదని, అందుకే తామందరూ కలిసి కట్టుగా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకున్నామని చైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదొక్కటే పంచకూట దేవాలయమని తెలిపారు.
ఈ ఆలయం పునరుద్ధరణ కోసం ఎవ్వర్నీ విరాళాలు అడగలేదు. గ్రామస్థులందరూ కలిసి, తమకు తోచినంత విరాళాలు ఇచ్చి, దేవాలయాన్ని బాగు చేసుకున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి నిపుణులను కూడా పిలిపించుకున్నారు. ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాలైన గూడెపద, తిరుమలగిరి, పెద్దాపురం గ్రామస్థులు కూడా కలిసి వచ్చారు. అంతేకాకుండా స్థానికంగా వుండే క్రైస్తవులు, ముస్లింలు కూడా ఆర్థికంగా సాయపడ్డారని కూడా ప్రకటించారు. ఇదే గ్రామస్థుడు, ఇతర ప్రాంతంలో వుంటారని, వారు 30 లక్షల విరాళం ఇచ్చారని తెలిపారు.
ఆత్మకూరు గ్రామంలో ఇంటి నుంచి 2 వేల రూపాయల నుంచి 15 లక్షల వరకు కూడా విరాళంగా ఇచ్చారని తెలిపారు. తాము చాలా సార్లు పురావస్తు, దేవాదాయ శాఖలకు విన్నవించామని, లాభం లేకపోవడంతో తామే ముందుకు వచ్చి, బ్రహ్మాండంగా దేవాలయం పునరుద్ధరణ చేసుకున్నామన్నారు. తమ వద్ద నిధుల కొరత వుందని, ఇతరత్రా ఇతరత్రా చెబుతూ.. పట్టించుకోలేదని, అవసరమైన అనుమతులను తామే తీసుకొని, పునరుద్ధరించుకున్నామని తెలిపారు.
ఆలయ పునరుద్ధరణ కోసం 20 మంది కళాకారుల బృందం పనిచేసింది. 18 నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది. ఈ దేవాయల పునరుద్ధరణ బాధ్యతను ఆర్కిటెక్ట్ రెతినవేలు స్వీకరించారు. వీరు గతంలో యాదాద్రి ఆలయంలో కూడా పనిచేశారు.గ్రామస్థులందరూ ఆలయ పునరుద్ధరణకు స్వతంత్రంగా ముందుకు రావడాన్ని అందరూ అభినందిస్తున్నారు. అధికారులు కూడా మెచ్చుకున్నారు.