అయోధ్య రామమందిరంలో వాననీరు ఆగదు.. నిర్మాణ లోపం లేదు – నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

VSK Telangana    25-Jun-2024
Total Views |

npidendra mishra
 
అయోధ్యా నగరంలోని రామమందిర ప్రాంగణంలో వాన నీరు నిలిచిపోయిందని, నిర్మాణంలో లోపాలున్నాయని మీడియాలో చక్కర్లు కడుతున్న వార్తలపై రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పష్టతనిచ్చి వాటికి తెరవేశారు.
 
రామమందిరం మొదటి అంతస్తు నుంచి వాన నీరు వస్తుండటం కనిపించిందని, అయితే మందిరంలో ప్రస్తుతం కొనసాగుతున్న పలు నిర్మాణ, అభివృద్ధి కార్యకలాపాల వల్ల అవి పూర్తయ్యే వరకూ ఇలా జరిగే అవకాశముందని ముందుగానే ఊహించామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ డిజైన్ లేదా నిర్మాణానికి సంబంధించిన సమస్యేమీ లేదని స్పష్టం చేస్తూ ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన ప్రకటనలో అందించారు. రామమందిరంలోని గురు మంటప్‌కి పైకప్పు వంటిది ఏమీ లేకుండా పూర్తిగా తెరవబడి బహిరంగమై ఉండటం వల్ల వాన నీరు చేరుతోందని… అయితే మరోపక్క ఈ మంటపానికి ఆచ్ఛాదనను ఏర్పరిచే దిశగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న రెండవ అంతస్తు, శిఖర నిర్మాణ పనులు పూర్తయితే అది మూసివేయబడుతుందని తెలియజేశారు. ఇక మొదటి అంతస్తులో పనులు జరుగుతున్నందున కాలువమార్గంలో నీరు నిలిచి ఉండటాన్ని తాను గమనించానని, ఈ పనులు పూర్తవగానే కాలువమార్గాన్ని మూసివేస్తారని వివరించారు. మంటపాలన్నిటిలోనూ నీరు నిల్వ కాకుండా అవి తగినంత వాలును కలిగి ఉండేలా నిర్మించినందువల్ల ఈ కాలువ మార్గాన్ని మూసివేసినా ఇబ్బంది ఉండదని విపులంగా తెలిపారు. ఈ విధమైన నిర్మాణశైలితో పాటుగా భక్తులెవరూ విగ్రహానికి అభిషేకాలు కూడా చెయ్యరన్నారు. అందువల్ల గర్భాలయంలో కూడా నీరు నిలబడదని, ఆ కారణంగా గర్భాలయానికి ప్రత్యేక డ్రెయినేజీ లేదన్నారు. ఆలయ పరిశుభ్రత, శుద్ధి కార్యకలాపాల్లో భాగంగా గర్భాలయంలో కొద్దోగొప్పో నీరు కనిపిస్తే దానిని మానవశ్రమతో తొలగిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం బాహాటంగా తెరిచి ఉన్న ఆలయ మండపాలలోకి వాననీరు వచ్చే అవకాశంపై గతంలోనే చర్చ జరిగిందన్న నృపేంద్ర మిశ్రా… నగర వాస్తు ప్రమాణాల మేరకు వాటిని తెరిచి ఉంచాలనే నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అయోధ్యలోనే ఉన్న రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా… నేరుగా అక్కడి పరిస్థితిని సమీక్షించి, వాస్తవ స్థితిగతులను తెలియజేస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు.