హిందువుగా కశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టడమే ఆమె తప్పా?

VSK Telangana    25-Jun-2024
Total Views |

kashmiri pandits
 
జూన్‌ 25…. గిరిజా టిక్కూ.. వర్ధంతి. ఈమె జమ్మూ కశ్మీరీ హిందూ మహిళ. 1990 సంవత్సరంలో ఇదే రోజున ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కశ్మీరీ పండితుల కుటుంబం నుంచి వచ్చిన గిరిజా టిక్కూ స్వస్థలం బందిపోరా. కశ్మీర్‌లోని ఓ పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. 1990వ దశకంలో లోయలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం పెట్రేగిపోయింది. అక్కడి హిందువులను అతి క్రూరంగా హత్య చేశారు. ఈ క్రూరత్వాన్ని చూసి భయపడి చాలామంది కశ్మీరీ పండిట్లు ఇళ్లను వదిలి రాత్రికి రాత్రే వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన వారిలో గిరిజా టిక్కూ, ఆమె కుటుంబీకులు కూడా వున్నారు. ఒక రోజున లోయలో పరిస్థితి అంతా చక్కబడిందని ఆమె భావించింది. నెలవారీ వేతనం తీసుకోవడానికి పాఠశాలకి రావాలంటూ టిక్కూకి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీనిని గుడ్డిగా నమ్మేసిన టిక్కు… పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో తనను అజ్ఞాత వ్యక్తులు వెంబడిస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోయింది.
 
ఈ సమయంలోనే ఐదుగురు దుండగులు గిరిజను కిడ్నాప్‌ చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్‌ ఉదంతాన్ని ఆమె సహోద్యోగి, స్థానికులు చూస్తున్నా… ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. చూస్తూ.. మౌనంగా వుండిపోయారు. అపహరణ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహం రోడ్డు పక్కన అతి భయంకరమైన స్థితిలో కనిపించింది. ఆమెను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, చిత్ర హింసలకు గురి చేశారని శవపరీక్షలో తేలింది. ఆమె ప్రాణాలతో బతికి వున్న సమయంలోనే ఓ రంపంతో ఆమెను రెండు ముక్కలుగా కోశారు. ఇంత ఘోరం ఎందుకంటే… ఆమె హిందువుగా పుట్టడం.. కశ్మీరీ పండితుల వంశం కావడం.
గిరిజా టిక్కూను అతి క్రూరంగా చంపి… ఇన్ని సంవత్సరాలు గడిచినా… వారి కుటుంబం మాత్రం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. టిక్కూ కుటుంబంతో పాటు ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇతర హిందూ కుటుంబాలు కూడా ఇప్పటికీ న్యాయం కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నాయి.