కార్గిల్ కోసం కొదమ సింహంలా విరుచుకుపడ్డ పద్మపాణి

VSK Telangana    25-Jul-2024
Total Views |
 
acharya
 
‘‘ప్రియమైన పప్పా! మీరు ప్రాణనష్టం గురించి బాధపడండి.. ఇది మా విధి నిర్వహణలో నియంత్రణ లేని అంశం. మేము ఉన్నత ఆశయం కోసం చనిపోతున్నాం. పోరాటం మాకు జీవితకాలపు గౌరవం. నేను ఏ విషయం గురించి ఆలోచించలేనని అమ్మతో చెప్పండి. భారతభూమికి సేవ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది! మీరు చారు (భార్య చారులత)కు మహాభారతం నుంచి రోజుకు ఒక కథ చెప్పండి. దీంతో మీ మనవడు లేదా మనవరాలు మంచి విలువలను అలవర్చుకుంటారు’’
 
అమరుడు కావడానికి 10 రోజుల ముందు మేజర్‌ పద్మపాణి ఆచార్య తండ్రికి ఉత్తరం రాసిన ఉత్తరమిది. అందరినీ కంటతడి పెట్టించింది. మేజర్‌ పద్మపాణి ఆచార్య నివాసం హైదరాబాద్‌ (నాగార్జునసాగర్‌ రోడ్డు)లోని హస్తినాపురం. పద్మపాణి జూన్‌ 21న తన 30వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. అదే చివరి కాల్‌ అవుతుందని అని వారికి తెలియదు. పద్మపాణి భార్య చారులత 6 నెలల గర్భిణి. ఏడురోజుల తర్వాత పద్మపాణి ఇక లేరనే వార్త ఆ కుటుంబానికి ఫోన్‌ ద్వారా అందింది.
 
పద్మపాణి జూన్‌ 21, 1969న జన్మించారు. 1993లో సైన్యంలో చేరారు. రాజ్‌పుతానా రైఫిల్స్‌ (2 రాజ్‌ రిఫ్‌)లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తండ్రి జగన్నాథ్‌ ఆచార్య భారత వాయుసేనలో వింగ్‌ కమాండర్‌‌గా సేవలు అందించి రిటైర్‌ అయ్యారు. పద్మపాణి సోదరుడు పద్మసంభవ్‌ కూడా సైన్యంలో పని చేస్తున్నారు.
 
కార్గిల్‌ యుద్ధంలో రాజ్‌పుతానా రైఫిల్స్‌కు ఆయన నేతృత్వం వహించారు. పద్మపాణి ఆచార్య టోలోలింగ్‌పై పాక్‌ సైనికుల బంకర్‌ వద్దకు చేరుకొని వారిపై గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో పద్మపాణి శరీరంలోకి చాలా తూటాలు దిగాయి. అయినా వెనుతిరగకుండా కొదమ సింహంలా శత్రువులపైకి దూకాడు. ఒక పూర్తి రాత్రంతా కొనసాగిన ఈ కాల్పుల్లో చివరకు రాజపుతాన రైఫిల్స్‌ టోలోలింగ్‌ పర్వతాన్ని అధీనంలోకి తెచ్చుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆచార్యను చికిత్స కోసం వెనక్కి తీసుకెళ్తామని రెజిమెంట్‌లోని సైనికులు కోరినప్పటికీ ఆయన దానిని తిరస్కరించారు. ఆ గాయాలతోనే యుద్ధాన్ని కొనసాగించారు. టోలోలింగ్‌ స్వాధీనమైంది. కానీ మేజర్‌ పద్మపాణి అమరుడయ్యారు. ఆరోజు జూన్‌ 28.
 
మేజర్‌ పద్మపాణి అమరుడైన వార్త తెలిసిన ఆ కుటుంబంలో ఒక్కరు కూడా కంటతడి పెట్టలేదు. తండ్రి జగన్నాథ్‌ ఆచార్య, తల్లి విమలా ఆచార్య తమ కుమారుడి వీర మరణానికి గర్వపడుతున్నట్లు ప్రకటించారు. ఈ మహావీరుడిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం పద్మపాణి ఆచార్యను మరణానంతరం ఆగస్టు 15, 1999న మహా వీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది.
 
‘ఒక తల్లిగా నేను కచ్చితంగా బాధపడ్డాను. వీరమాతగా కొడుకు గురించి గర్వపడుతున్నాను. నేను ఉండకపోవచ్చు. కానీ అతను అమరుడు. నా కొడుకు యుద్దానికి బయలుదేరినప్పుడు నేను ఏడవనని వాగ్దానం చేశాను’ అని విమలా ఆచార్య తెలిపారు. హైదరాబాద్‌లో ఆశేష జనవాహిని ఊరేగింపు మధ్య పద్మపాణి అంతిమయాత్ర సాగింది. భారత్‌ మాతాకీ జై, పద్మపాణి అమర్‌హై నినాదాలు, సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. హస్తినాపురం ప్రధాన వీధికి మహా వీర్ చక్ర మేజర్‌ పద్మపాణి ఆచార్య మార్గ్‌ అని పేరు పెట్టారు. రహదారిపై ఆయన విగ్రహం ఏర్పాటైంది.