యూట్యూబ్ ఇండియాలో భారీ స్కామ్.. ఆ వీడియోలపై షాడో బ్యాన్!

VSK Telangana    06-Jul-2024
Total Views |

Youtube BJP Modiప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్, హిందుత్వానికి సంబంధించి తటస్థమైన లేదా అనుకూల వీడియోలు ప్రమోట్ కాకుండా అడ్డుకుని షాడో బ్యాన్ చేస్తూ భారీ ఎత్తున కుట్ర జరుగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టుల వీడియో కంటెంట్‌కి అనుకూలంగా యూట్యూబ్ అల్గారిథమ్‌‌ని మార్చి, వీటికి ఎక్కువ రీచ్ లభించేలా ఆ సంస్థ ఉద్యోగులు కొందరు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో అతి పెద్ద డిజిటల్‌ కుంభకోణంగా మారిన ఈ అంశం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. కమ్యూనిస్టులకు అనుకూలంగా వుండే యూట్యూబర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు యూట్యూబ్ ఇండియా సంస్థలోని 24 మంది ఉద్యోగులు ప్లాట్‌ఫారమ్‌ అల్గారిథమ్స్‌ని మార్చినట్లు ఆరోపణలున్నాయి. అయితే... ఈ ఆరోపణలు భారత్‌లోని యూట్యూబ్‌ బాధ్యుల దృష్టిలో కూడా వున్నట్లు సమాచారం. ఈ యూట్యూబ్‌ కుంభకోణం జర్నలిస్ట్‌ రోహన్ దువా ద్వారా మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌ ఉద్యోగులు, కమ్యూనిస్ట్ అనుకూల యూట్యూబ్‌ ఛానల్స్ కంటెంట్‌ సృష్టికర్తలు, ఫోన్ కాల్ సంభాషణలు, ఐమెసేజి, వాట్సాప్‌ సంభాషణలు కూడా జరిగినట్లు వెల్లడయ్యింది.
 
జర్నలిస్ట్‌ రోహన్ దువా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఇలా స్పందించారు "యూట్యూబ్, యూట్యూబ్‌ ఇండియా ప్లాట్‌ఫాంలలో అతి పెద్ద కుంభకోణం చోటు చేసుకుంటోంది. సంస్థకు చెందిన 24 మంది ఉద్యోగులు యూట్యూబర్లతో కాల్స్‌, ఐమెసేజ్‌లు, వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా సంబంధాలు పెట్టుకున్నారు. అల్గారిథమ్స్‌‌ని మార్చిన విషయంలో వీరందరూ నిఘాలో ఉన్నారు. దీన్ని బట్టి కమ్యూనిస్ట్ భావజాల వ్యవస్థపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇక్కడి అక్రమ కార్యకలాపాల ద్వారా ఉదారవాద సోషల్‌ మీడియా ప్రభావశీలురు ఎక్కువ ప్రచారం పొందుతున్నారు’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా వెల్లడించారు. గతంలో కూడా దువా దీనికి సంబంధించిన విషయాలను డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల మీద ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకి కూడా వెళ్లానని తెలిపారు దువా.
 
 
 
అల్గారిథమ్ మార్పు ద్వారా తటస్థంగా లేదా బీజేపీ అనుకూల వీడియో కంటెంట్‌ని అడ్డుకుని, మరో నిర్దిష్ట రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే వీడియో కంటెంట్‌ని ప్రమోట్ చేసి, వీటికి ర్యాంకులు, వ్యూస్ పెంచేందుకు సదరు యూట్యూబ్ ఇండియా ఉద్యోగులు, యూట్యూబర్ల మధ్య జరిగిన సంభాషణలు ఉన్నట్లుగా వచ్చిన బలమైన ఆరోపణలపై విచారణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అల్గారిథమ్ మార్పు వల్ల లబ్ధిపొందుతున్నట్లుగా జర్నలిస్ట్ దువా వెలుగులోకి తీసుకువచ్చిన యూట్యూబ్ చానెళ్ల వివరాలను ఈ చిత్రంలో చూడవచ్చు.

Left Youtubers
 
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తటస్థమైన లేదా అనుకూల వీడియో కంటెంట్‌ని షాడో బ్యాన్‌ చేసి, వ్యతిరేక కంటెంట్‌ని ప్రమోట్ చేసేలా యూట్యూబ్ ఇండియాకి చెందిన 17 మంది ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణలు ఇంటెలిజెన్స్‌కి దొరికిన విషయాన్ని కూడా జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఉద్యోగుల్లో ముంబై, కేరళ, బెంగాల్‌కి చెందిన ఐదుగురు మహిళా ఉద్యోగులు, పన్నెండు మంది పురుషులు ఉన్నారని, వీరు యూట్యూబ్‌ అల్గారిథమ్స్‌ని మార్చారని, అలాగే 93 మంది జర్నలిస్టులు మరియు 42 ఛానల్స్‌పై ఏకపక్ష నిషేధాన్ని విధించారని ఆరోపించారు. ఈ ఛానెల్స్‌ ఎన్నికల సమయంలో బీజేపీ విషయంలో తటస్థంగా వుంటూ కవరేజీని అందించడంతో సస్పెన్షన్‌కి గురైనట్లు తెలిపారు. చివరికి తన ఛానెల్‌ కూడా ఇలాంటి షాడో బ్యాన్‌ను ఎదుర్కొందని దువా తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించడానికి ఆయన న్యాయవాదులతో కూడా సంప్రదిస్తున్నారు. ఐపీసీ సెక్షన్‌ 120బీ, (నేరపూరిత కుట్ర), ఐటీ 2021 కింద కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఐపీసీ సెక్షన్లు 127ఏ, 120 బీ, 171బీ/ఆర్‌ (లంచం ఆరోపణలు) కింద కేసులు నమోదు అవుతాయని దువా తెలిపారు.