మిరాకిల్ హీలింగ్‌తో కాపాడినట్లు తప్పుడు ప్రచారం.. కల్వరీ మినిస్ట్రీస్‌పై ఫిర్యాదు

VSK Telangana    06-Jul-2024
Total Views |

Calvary Ministries1
కేవలం ప్రార్థనలతోనే.. నయం కాని జబ్బులకు సైతం చికిత్స చేసి.. ప్రాణాలు పోతున్న వారిని కాపాడుతున్నట్లు ప్రచారం చేస్తున్న తెలంగాణలోని బెల్లంపల్లి కల్వరీ మినిస్ట్రీస్ పై కంప్లైంట్ నమోదైంది. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని విధంగా.. "మిరాకిల్ హీలింగ్" పేరుతో ఓ చిన్నారిని కాపాడామని చెప్పుకుంటున్న క్రైస్తవ సంస్థపై "లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్" (LRPF) ఫిర్యాదు చేసింది. కల్వరీ మినిస్ట్రీస్‌కి చెందిన పాస్టర్ ఆర్.ప్రవీణ్ కుమార్, ఆయన భార్య షారోన్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తో పాటు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేసింది.
 
కల్వరీ మినిస్ట్రీస్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పేరుతో ఉన్న అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో.. మే 16, 2024 న ఒక వీడియో అప్ లోడ్ చేశారు. అందులో.. కిడ్నీ చెడిపోయిన బాలిక హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని.. ఐసీయూలో ఉందని.. ఆ చిన్నారి తల్లిగా చెప్పబడుతున్న ఓ మహిళ రోదిస్తూ చెబుతోంది. తన కుమార్తె ఆరోగ్యం విషమించిందని.. ఆమె బతికేందుకు అవకాశం లేదని వైద్యులు కూడా చెప్పారని తెలియజేసింది. అయితే తన కుమార్తెను కల్వరీ మినిస్ట్రీస్ నిర్వహించిన మిరాకిల్ హీలింగ్ షోకు తీసుకెళ్లానని.. అక్కడ జరిగిన ప్రార్థనలతోనే తన బిడ్డ బతికిందంటూ చెప్పుకొచ్చింది.
 
ఈ వీడియోను సాక్ష్యంగా చేసుకున్న LRPF.. తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. సదరు చిన్నారికి తీవ్ర అనారోగ్యం ఉన్నా.. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నా.. వైద్యుల అనుమతి లేకుండా తనను బయటకు తీసుకెళ్లారని తన కంప్లైంట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని.. మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో నడిపించారు. చిన్నారి పట్ల ఇది క్రూరమైన స్వభావం అని LRPF ప్రస్తావించింది.
 
Calvary Ministries Praveen
 
2003లో బెల్లంపల్లి కేంద్రంగా కల్వరి మినిస్ట్రీస్.. ఓ ట్రస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేశారు. క్లిష్టమైన వైద్య సమస్యలను కూడా ప్రార్థనల ద్వారా నయం చేస్తామని పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహించిన చరిత్ర దీనికి ఉంది. ఈ కల్వరీ మినిస్ట్రీపై గతంలో 34 IPC సెక్షన్‌లు 304-II మరియు 420 కింద మే 25, 2019 నాటి FIR (నం: 46/2019) నమోదయ్యాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేశ్ అనే 21 ఏళ్ల యువకుడిని ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి.. వైద్యం అందించకుండా చేశారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీని మీదా కల్వరీ మినిస్ట్రీపై కేసు కొనసాగుతోంది.
 
పాస్టర్ ఆర్.ప్రవీణ్ కుమార్ మరియు అతని భార్య షారోన్ నేతృత్వంలోని ట్రస్ట్.. అద్భుత నివారణల ద్వారా రకరకాల జబ్బులను నయం చేస్తామంటూ ప్రచారం చేయడం ద్వారా.. పేద, చదువులేని అమాయకుల విశ్వాసాలే కేంద్రంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఇక్కడి ప్రార్థనల ద్వారా తమకు వ్యాధులు నయం అయ్యాయంటూ పెయిడ్ ఆర్టికల్స్ ను ఈ ఛానెల్ లో ప్రచారం చేయడం ద్వారా నిర్వాహకులపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నారని తెలిపారు. కల్వరి మినిస్ట్రీల కార్యకలాపాలు 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టాన్ని ఉల్లంఘించగలవని LRPF ఆరోపించింది. వైద్యుల సలహాలకు విరుద్ధంగా.. బాలికను ఐసీయూ కేర్ నుంచి మిరాకిల్ హీలింగ్ షోకి తరలించడంపై విచారణ జరిపి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని.. తెలంగాణ డీజీపీ మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్‌ను ఆదేశించాలని కోరింది. బాలికను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య చికిత్స అందేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని కోరింది.