శ్రీమాన్ రామ... దూరదర్శన్‌లో శ్రీరాముడి యానిమేషన్ సిరీస్

VSK Telangana    06-Jul-2024
Total Views |

Chinna Jeeyar Sriman Srirama
శ్రీరాముడి జీవితచరిత్ర, రామాయణ విశేషాలపై రూపొందించిన యానిమేషన్ సిరీస్‌ను దూరదర్శన్ ప్రసారం చేయనుంది. 52 ఎపీసోడ్‌ల ఈ సిరీస్‌ను "శ్రీమాన్ రామ" పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. జాతీయ అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ రచన, దర్శకత్వంలో హైదరాబాద్‌కు చెందిన "మరా" క్రియేషన్స్ రూపొందించిన శ్రీమాన్ రామ ధారావాహికను జూలై 7, 2024 ఆదివారం నుండి ప్రతివారం మధ్యాహ్నం 12:00 నుండి 12:30 గంటల వరకు.. దూరదర్శన్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకున్నారు. భారతీయులను మరోసారి భక్తిభావనలో ముంచెత్తేందుకు.. ఆ కావ్యంలోని పాత్రలను మళ్లీ గుర్తు చేసి.. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడానికి ఇది మరో ప్రయత్నంగా చెబుతున్నారు. రామాయణం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో, అనేకానేక రూపాల్లో చెప్పబడింది. ఇప్పుడు అదే స్ఫూర్తి, భక్తితో మరా క్రియేషన్స్ “శ్రీమన్ రామ” యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్‌ను అభివృద్ధి చేసింది.
 
ఈ నేపథ్యంలో శ్రీమాన్ రామ... యానిమేషన్ సిరీస్ ప్రీలాంచ్ ఈవెంట్ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. హైదరాబాదు సమీపాన ముచ్చింతల్‌లో ఉన్న జీయర్ స్వామివారి ఆశ్రమంలో శనివారం ఉదయం ప్రీలాంచ్ జరిగింది.
Chinna Jeeyar Sriman Srirama 
 
"శ్రీమాన్ రామ యానిమేషన్ సిరీస్ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వం గురించి.. వీక్షకులను అలరించడమే కాకుండా.. వారికి అవగాహన కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. సిరీస్ యొక్క సారాంశం అంతా వాస్తవం అని వాగ్దానం చేస్తున్నాం" అని ఈ సిరీస్ ప్రచారకర్త రామచంద్ర విష్ణుభట్ట తెలిపారు. వినోద పరిశ్రమలో, పిల్లల యానిమేషన్‌కు మంచి క్రేజ్ ఉందిని, 140 కోట్ల మంది జనాభాలో 40 కోట్ల మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు ఉన్నారని ఆయన తెలిపారు. వీరంతా ప్రస్తుతం సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉన్నవారే కనుక వీరిని లక్ష్యంగా చేసుకుని మన సాంస్కృతిక చరిత్రను అందించడమే బాధ్యతగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
 
"శ్రీమన్ రామ సిరీస్.. యానిమేషన్ ఫార్మాట్‌లో పిల్లలు, కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ ధారావాహిక గొప్ప సాంస్కృతిక నేపథ్యాలు మరియు జీవిత విలువలను అందిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో శ్రీరాముని సద్గుణాలు అంతర్లీనంగా వర్ణించబడతాయి. విద్య మరియు వినోదం రెండింటినీ అందిస్తుంది. గొప్ప కథాకథనం, ఆకట్టుకునే పాత్రలు మరియు విజువల్ వండర్‌తో.. "శ్రీమన్ రామ" భారతీయ టెలివిజన్‌లో ఒక మైలురాయిగా మారడానికి సిద్ధంగా ఉంది." అని ఈ సిరీస్ నిర్మాతలు తెలిపారు.


Sriman Srirama