నిరంతర వ్యక్తి నిర్మాణ సంకల్ప సిద్ది యంత్రం ఏబీవీపీ

VSK Telangana    08-Jul-2024
Total Views |
ABVP Students
 
-డా. మాసాడి బాపురావు 

సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల పాలనలో మగ్గి, అనేకమంది జాతీయ విప్లవ వీరుల త్యాగాలతో బానిససంకెళ్లు తెంచుకుని, భారతావని స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్న రోజులవి. దేశవిభజన గాయాలతో రక్తమోడుతున్న భారత దేశం,సాదించుకున్న స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటుందా? లేక మరోసారి పరాయి పాలనలోకి జారి పోతుందా? బ్రిటిష్ చదువులతో విదేశీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న మెకాలే మానస పుత్రులైన రాజకీయ నాయకత్వం, అభ్యుదయ భావజాలం పేరుతో అవినీతి ఉద్యోగగణం, దేశ ప్రజాస్వామ్య పరిణతిని సాధించ గలుగుతారా? అనే అనుమానాలు అనేకమంది మనసులను తొలుస్తున్న రోజులవి.స్వాభిమానాన్ని తాకట్టు పెట్టి, బానిసత్వాన్ని నిరంతరం గుర్తుచేసే విధంగా దేశం పేరును కూడా ‘ఇండియా’ గానే పిలుచుకునే దౌర్భాగ్యపు రోజులవి. స్వాతంత్ర్యం వచ్చిందనే సంబరం ఒకవైపు, ఇలాంటి విపత్కర పరిస్థితులు విసురుతున్న సవాళ్ళుఇంకొకవైపు.

సరిగ్గా అదేసమయంలోనే వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించాలనే సంకల్పం తో, దేశభక్తులైన దేశంకోసం పరితపించే విద్యార్థులను తయారుచేయడం కోసం, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన భారతీయ విజ్ఞానం గతం మాత్రమే కాకూడదు, వర్తమానంలోనూ కొనసాగాలి, మనల్ని ప్రతిసారి బానిసత్వంలోకి నెట్టిన అనైక్వత అవినీతులను జయించాలంటే ‘జ్ఞానం, శీలం, ఏకత’ లను ఊపిరిలగా కలిగిన మెరికలైన విద్యార్థులను తీర్చిద్దిద్దడమనే ఆశయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1948 జులై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో కేవలం ఐదుగురు విద్యార్థులతో స్థాపించబడింది. ఇంతింతైవటుడింతైఅన్నట్లు నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది ఎబివిపి. కుల, వర్గ, వర్ణ భేదం లేకుండా విద్యార్థులందరి నడుమ విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది. వివిద రకాల విద్యార్థుల నడుమ పని చేయడం కోసం ఎబివిపి అనేక వేదికలను ప్రారంభించింది. వైద్య విద్యార్థుల కోసం మెడివిజన్, ఆయుర్వేద విద్యార్థులకోసం జిజ్ఞాస, లా విద్యార్థుల కోసం లాసెల్, మేనేజ్మెంట్ విద్యార్థులకోసం చేతన, ఇంజనీరింగ్ విద్యార్థులకోసం సృజన, సృష్టి లాంటివి, ఫార్మా విద్యార్థుల కోసం ఫార్మావిజన్, ఎన్ ఐ టి, ఐఐటిలలో చదివేవిద్యార్థుల కోసం ‘థింక్ ఇండియా’, ఇక్కడ చదివే విదేశీ విద్యార్థులలో వసుదైకకుటుంబ భావనను కలిగించడం , ఇక్కడి సాంస్కృతిక అంశాల పట్ల వారిలో అవగాహన పెంచడం కోసం WorldOrganisation of Students and Youth (WOSY), ఈశాన్య రాష్ట్రాలవిద్యార్థులలో ఈదేశమంతా ఒక్కటే అనే భావనను కలిగించడం కోసం, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడం కోసం Student’s Experience in Inter state Living, (SEIL), విద్యార్థులలో సేవా భావాన్ని పెంపొందించడం కోసం Students For Seva (SFS), సుస్థిర అభివృద్ధి భావనను పెంపొందించండం కోసం Students For Development (SFD), లాంటి అనేక సంస్థలు ఎబివిపిని విస్తరింపజేయడం కోసం పనిచేస్తున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశానికి ఇండియా అనే పేరుండడం బానిస బ్రతుకులను గుర్తు చేస్తున్నదని ఇండియా పేరును భారత దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తూ నాటి రాజ్యాంగ సభకు ఎబివిపి చేసిన విజ్ఞాపన మేరకు ‘ ఇండియా దట్ ఈజ్ భారత్‘గా దేశం పేరును రాజ్యాంగంలో చొప్పించడం జరిగింది. విద్యార్థి సంఘం అనగానే బంద్ లు, విధ్వంసాలు, హక్కుల కోసం పోరాటాలు మాత్రమే చాలా మందికి గుర్తుకొస్తాయి. కాలమాన పరిష్థితులకనుగుణంగా వచ్చే విద్యారంగ, విద్యార్థి సమస్యల పరిష్కారాలకోసం నిరంతరంగా ఉద్యమాలను నిర్మించింది. విద్యార్థి ఉద్యమాలను కూడా విద్వంసాలకతీతంగా నిర్మాణాత్మకంగా రూపొందించింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళదుస్థితిని మార్చడం కోసం ఎబివిపి సర్వే చేపట్టి చేసిన బ్లాక్ పేపర్ కారణంగానే మన రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల వ్యవస్థ రూపకల్పన జరిగిందనేదిఅందరకు తెలిసిన విషయమే . అనేక విద్యాలయాల ప్రాంగణాలలో గతంలో తీవ్రంగా ఉన్న 3D (Drink, Drugs & Dance)కల్చర్ పేరుతో జరుగుతున్న విదేశీ సంస్కృతిని అనేక క్యాంపస్ల నుండి తరిమింది ఎబివిపి. విద్యాలయాలలో విద్యావాతావరణాన్ని కాపాడడం కోసం, హాజరు శాతాన్ని పెంచడం, కాపీకొట్టె సంస్కృతిని నిర్ములించడానికి కూడా ఎబివిపి కృషిచేసింది. క్యాంపస్లలో విద్యార్థి సంఘాల ట్రేడ్ యూనియన్ కల్చర్‌ని రూపుమాపి విద్యారంగం అంతా ఒక కుటుంబం అని అందులో మేనేజ్మెంట్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లితండ్రులు భాగస్వాములనే భావనను పెంపొందించింది. స్వామి వివేకానంద, నేతాజీ, భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకుల జన్మదినాలను, వర్ధంతులను నిర్వహించడం. ద్వారా నేటి విద్యార్థులలో వారి స్ఫూర్తిని రగిలిస్తున్నది. అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమరసతాదినంగా పాటిస్తూ, వివిధ కులాల నడుమ సమరసతను సాధించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నది.

విద్యార్థిపరిషత్ రాజకీయాలకతీత సంస్థ అయినప్పటికీ అనేక రాజకీయ సామాజిక అంశాల పట్ల బాద్యతగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చింది. 70వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లక్షలాది మంది విద్యార్థుల వీపులపై లాఠీలు మ్రోగినా, వేలాది మంది జైళ్ళ పాలైన వెనుకడుగేయకుండా ఉద్యమించింది. అవినీతి ఊభిలో కూరుకు పోయిన చిమన్బాయ్ పటేల్ ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాటం ఆగలేదు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విసిరిన సవాల్ని స్వీకరించిన ఎబివిపి కార్యకర్తలు పదివేల మందికి పైగా స్వంత డబ్బులతో టికెట్లు కొనుక్కొని ప్రాణాలు పోతాయని తెలిసి కూడా జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ పై జాతీయ జెండా ఎగరవేసిన ఘటన చారిత్రాత్మకం. ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా అస్సాంను బంగ్లాదేశ్ చొరబాటుదారులు ముంచెత్తుతున్న 80వ దశకంలో Save AssamToday – Save India Tomorrow. నినాదంతో బంగ్లా చొరబాటుదారుల అంశం పట్ల దేశప్రజలందరినీ జాగృతం చేసింది. బంగ్లా చొరబాటుదారులు ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీయాలనే కుట్రతో చికెన్నెక్ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న సమయంలో చలో చికెన్ – నెక్ పేరుతో లక్షమంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. కళాశాల క్యాంపస్ల లో నక్సల్స్ హింసకు వ్యతిరేఖంగా తుపాకీ గొట్టానికి తమ గుండెలనడ్డుపెట్టి నక్సల్స్ ను కాలేజీ క్యాంపస్ల నుండి తరిమికొట్టిన ఘటన మనం మరువలేము. అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు పోయినా వెనుకడుగేయలేదు. దేశానికి హాని కలిగి౦చే శక్తులపట్ల, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, విదేశీ భావజాలం సృష్టించే మారణ హోమంపట్ల విద్యార్థులను, ప్రజలను జాగృతం చేయడంలో ఎబివిపి వాచ్ డాగ్ ప్రాత్రను పోషిస్తున్నది. ఇప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలలో సోకాల్డ్ లిబరల్స్, లెఫ్ట్ మేదావులు, విద్యార్థి సంఘాలు, యాకుబ్ మెమెన్, మక్బూల్ భట్ ఆశయ సాధన కోసం పని చేస్తుంటే ఎబివిపి వివేకానంద – అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నది.

నేటి విద్యార్థి నేటి పౌరుడు అని నమ్మే పరిషత్ కార్యకర్తలు సమాజంపట్ల సానుభూతితో, సంవేదనతో, బాద్యతగా మెలిగే పౌరులుగా తయారుకావడం కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రక్తదాన శిభిరాలనేర్పాటు చేసి రక్తాన్ని దానం చేయడాన్ని విద్యార్థులలో ఫ్యాషన్గా మార్చగలిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకే రోజు 18వేల మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి నిరసన ఉద్యమానికి సైతం ప్రపంచరికార్డ్ నెలకొల్పింది.విద్యారంగం లో అవినీతిని, అక్రమాలలను వెలికితీయడంలో ఎబివిపి అగ్రభాగాన నిలిచింది. నాలుగు సార్లు EAMCET పేపర్ లీకేజీ కుంభకోణాలను వెలికితీయడం, ఎమి / ఎమీ అడ్మిషన్ల కుంభకోణాన్ని, Inter papers leakage, వివిధ విశ్వవిద్యాలయాలలో పరీక్ష పేపర్ల లీకేజిలనువెలికితీసి, ప్రతిభకు పట్టం కట్టడంకోసం ఎబివిపి పోరాడింది. కార్పోరేట్ కాలేజీల అక్రమాల పట్ల, విద్యావ్యాపారం పట్ల, విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేక౦గా ఎప్పటికప్పుడు ఉద్యమాలను నిర్మిస్తూనే ఉన్నది. విద్యారంగంలో వస్తున్న, రావాలసిన మార్పుల పట్ల, సభలు , సదస్సులు, workshop లు నిర్వహిస్తూ విద్యారంగ పాలసీల తయారీలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కార్య కమాలను రూపొందిస్తున్నది. పైన పేర్కొన్న కార్యక్రమాలు, ఉద్యమాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలతోనే అతి సాధారణ విద్యార్థులను అసాధారణంగా ఆలోచింపగలిగే విధంగా ప్రేరణనిచ్చి అనేక మంది బాద్యతాయుత పౌరులను ఎబివిపి అందించగలిగింది. ఈ 73 సంవత్సరాలలో సమాజంలోని బిన్న వ్యవస్థలలో ఎబివిపి కార్యకర్తలు సమాజంలో మంచి మార్పుల కోసం, పాజిటివ్ దృక్పదంతో కృషిచేస్తున్నారు. విద్యార్థి పరిషత్ పని నిరంతరం కొనసాగే మ్యాన్ మేకింగ్ మిషన్.