భోజశాలలో ఎఎస్ఐ సర్వే : 1700కు పైగా కళాఖండాలు లభ్యం

VSK Telangana    08-Jul-2024
Total Views |

 


bbhoj shala
భోజశాల వద్ద ఎఎస్ఐ విస్తృతంగా జరిపిన సర్వేలో ఎన్నో కళాఖండాలు, ఇతరత్రా వస్తుసంచయం బైటపడ్డాయి. అవి ఆ ప్రాంతపు గొప్ప చారిత్రక వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయి. అవేంటంటే….

ఇటుక గోడ: భోజశాలలో లభ్యమైన నిర్మాణాల్లో ప్రధానమైనది ఆలయం గర్భగుడి వద్ద బైటపడిన 27 అడుగుల పొడవైన ఇటుక గోడ. దాని నిర్మాణశైలి పర్మార రాజవంశ కాలం నాటి నిర్మాణశైలికి భిన్నంగా ఉంది. అంతకంటె ముందు మొహెంజొదడో నాగరికత కాలం నాటిదని భావిస్తున్నారు. దాన్ని బట్టి ఆ ప్రాంతపు వయస్సు, విశిష్ఠతల గురించి గతంలోని అంచనాలు మారిపోయాయి.

సాంస్కృతిక, ధార్మిక వైవిధ్యం: భోజశాలలోని కమల్‌మౌలా దర్గా దగ్గర శాసనాలపై కురాన్ పంక్తులు, జైనధర్మానికి చెందిన శిల్పాలు, విగ్రహాలు లభించాయి. దాన్నిబట్టి ఆ ప్రాంతంలో వేర్వేరు మతాల ప్రభావం ఉండేదని తెలుస్తోంది. భోజశాలలో లభ్యమైన ‘యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుల కుడ్యచిత్రాల’ను బట్టి ఆ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని వెల్లడవుతోంది.

గర్భగుడి, దాని పరిసరాలు: భోజశాలలోని గర్భగుడి దగ్గర తవ్వకాల్లో ప్రాచీనమైన గోడలు, ఇతర నిర్మాణాలూ లభించాయి. వాటిని బట్టి పర్మారుల కాలానికి చెందిన నిర్మాణశైలి, వారు అనుసరించిన మతధర్మాల గురించి తెలుస్తోంది.

మెట్ల కింద గదిలో: వాగ్దేవి, సరస్వతి, హనుమంతుడు, గణపతి వంటి హిందూ దేవతల విగ్రహాలతో పాటు గణనీయమైన సంఖ్యలో కళాఖండాలు లభించాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగించే శంఖాలు, చక్రాలు వంటివి కూడా లభించాయి.

ఈశాన్య, పశ్చిమ భాగాల్లో: కృష్ణుడు, వాసుకి, శివుడు వంటి దేవతల విగ్రహాలు, పెద్దసంఖ్యలో స్తంభాలు, గోడలు, వాటిమీద చెక్కిన శిల్పాలూ లభించాయి. దాన్నిబట్టి, ప్రాచీన కాలంలో భోజశాల గొప్ప ప్రార్థనా కేంద్రంగా, మతధర్మాలకు ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా, సాంస్కృతిక వినిమయ ప్రదేశంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రదేశం అని అర్ధమవుతోంది.

యజ్ఞశాల ప్రాంతంలో: సనాతన ధర్మానికి చెందిన చిహ్నాలు చెక్కిన రాళ్ళు లభ్యమయ్యాయి. దాన్నిబట్టి పర్మార రాజవంశం నాటి కాలంలో ఆ ప్రాంతంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవని స్పష్టమవుతోంది.

దర్గా ప్రాంతంలో: అక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక భూగర్భ బావి లభించింది.

స్తంభాలు, శిలాశాసనాలు: అక్కడి స్తంభాలపై రసాయన చర్యలు జరిపి చూసినప్పుడు సీతారాముల చెక్కడం వంటి హిందూ పురాణ గాధల్లోని దృశ్యాలూ, ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రమూ వాటిపై చెక్కి ఉన్నాయి.

భోజశాల వద్ద తవ్వకాల 97వ రోజు పురావస్తు సర్వేక్షణ సంస్థ మరిన్ని విశేషాలను కనుగొంది. భోజశాల ఈశాన్య ప్రాంతంలో జాగ్రత్తగా భద్రపరిచిన, నిర్దిష్ట ఆకృతిలో చెక్కిన మూడు రాళ్ళు లభించాయి. నరసింహ అవతారాన్ని పోలిన విగ్రహం, దేవతలను పోలిన చెక్కడాలూ కూడా లభించాయి. వాటి చారిత్రక, సాంస్కృతిక విశిష్ఠతను నిశితంగా పరీక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పురావస్తు తవ్వకాల విశ్లేషణ ద్వారా వెల్లడి కాబోయే విశేషాల గురించి అన్ని పక్షాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.