భార్య ముస్లిం అని... పెళ్ళి కూడా అయ్యిందని... 14 ఏళ్ళకు తెలిసింది

VSK Telangana    08-Jul-2024
Total Views |

 
couple

 
అమరేంద్ర త్రిపాఠీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అసోంలోని గువాహటికి చెందిన ప్రతిభా తివారీతో 2011లో పెళ్ళయింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు తన జీవితాన్ని అతలాకుతలం చేసే వాస్తవాలు తెలిసాయి. అవేంటంటే… తన భార్య తనకు భార్య అవడానికి ముందే మరో వ్యక్తికి భార్య. అప్పట్లో ఆమె ముస్లింగా ఉండేది. అలా 4ఏళ్ళు గడిపాక మళ్ళీ హిందువునని చెప్పుకుని అమరేంద్రను పెళ్ళి చేసుకుంది.

ప్రతిభా తివారీ మొదట మహరూఫ్ హసన్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ముస్లింగా మారి మెహనాజ్ హసన్ అని పేరు మార్చుకుంది. అలా నాలుగేళ్ళు మహరూఫ్‌తో సంసారం చేసాక పుట్టింటికి వచ్చేసింది. తర్వాత ఆమె తల్లిదండ్రులు, సోదరి ఆమె గతాన్ని దాచిపెట్టారు. వెనక్కి వచ్చిన రెండే రెండు వారాల్లో ఆమెకు అలహాబాద్ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమరేంద్ర త్రిపాఠీతో పెళ్ళి కుదిర్చారు. అలా 2011లో ప్రతిభ, అమరేంద్రలకు పెళ్ళయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

14ఏళ్ళు గడిచాక అమరేంద్రకు అసలు విషయం తెలియడంతో ఇప్పుడతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తనను మోసగించి పెళ్ళి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేసాడు. అతని ఫిర్యాదు ప్రకారం… ప్రతిభ తన అత్తవారింట్లో ఎప్పుడూ సవ్యంగా ఉండలేదు. ప్రతీ చిన్నవిషయానికీ గొడవలు పెట్టుకునేది. చీటికీమాటికీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. అమరేంద్ర తల్లిదండ్రుల గురించి చెడుగా ప్రచారం చేసింది. వారి వీడియోలు తీసి వాటిని మార్ఫింగ్ చేయించి సామాజిక మాధ్యమాల్లో వారిపై దుష్ప్రచారం చేసింది. మొత్తంమీద అత్తమామలను ఇంట్లోనుంచి వెళ్ళగొట్టింది. చివరికి అమరేంద్ర ఫొటోను కూడా అతని మహిళాసహోద్యోగులతో కలిపి అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేసింది.

ఈ యేడాది మే 13న అమరేంద్రకు ఇంట్లో కొన్ని పత్రాలు దొరికాయి. వాటిని పరిశీలించినప్పుడు ఆమెకు 2007లో ఢిల్లీకి చెందిన యువకుడితో పెళ్ళయిందనీ, నాలుగేళ్ళు ఆ బంధంలో ఉందనీ తెలిసింది. గతంలో ఆమె ముస్లిం అనీ, ఆమె పేరు మెహనాజ్ అనీ వెల్లడైంది. ఆమె మొదటి పెళ్ళి, మతమార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్లు అమరేంద్రకు దొరికాయి.

విషయం బైటపడిన తర్వాత ప్రతిభ, అమరేంద్రను వేధించసాగింది. అతన్ని, అతని తల్లినీ భౌతికంగా హింసించింది. ఒకదశలో అమరేంద్ర ముక్కు విరగ్గొట్టింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది. సుమారు నెలరోజులు ప్రతిభ వేధింపులు భరించిన అమరేంద్ర, ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రతిభ, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు.

ప్రతిభకు గుట్కా తినే అలవాటు పెళ్ళికి ముందునుంచే ఉందనీ, ఆ విషయం తనకు పెళ్ళయిన ఏడాదికి తెలిసిందనీ అమరేంద్ర తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. ఆమె చెడు అలవాట్ల గురించి ఎప్పుడు ప్రస్తావించినా గొడవ చేసేదనీ, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేదనీ చెప్పాడు. తన శీలం గురించి పుకార్లు పుట్టించి తప్పుడు ప్రచారాలు చేసిందని ఆవేదన చెందాడు. నిజానికి ఆమె తరచుగా ఇంటినుంచి వెళ్ళిపోతుండేదనీ, చాలాకాలం ఎక్కడెక్కడో ఉండి బుధ్ధి పుట్టినప్పుడు వెనక్కి వచ్చేదనీ చెప్పాడు. వారణాసిలో ఒక యువకుడితో ఎన్నోయేళ్ళ నుంచి సంబంధముందనీ వివరించాడు.

మే 23న ప్రతిభ అమరేంద్రను తమ ఇంటినుంచి గెంటేసింది. అప్పటినుంచి అమరేంద్ర విడిగా నివసిస్తున్నాడు. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు.

సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామాశ్రయ్ యాదవ్, తమ వద్దకు ఈ ఫిర్యాదు వచ్చినట్టు నిర్ధారించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.