నాయకులను అందించే మ్యేన్ మేకింగ్ ఫ్యాక్టరీ ఎబివిపి...

VSK Telangana    09-Jul-2024
Total Views |


Abvp Balakrishna
 
జూలై 9 ఎబివిపి ఆవిర్భావ దినోత్సవం (జాతీయ విద్యార్థి దినోత్సవం) సందర్భంగా ఎబివిపి జాతీయ సహ సంఘటన కార్యదర్శి శ్రీ బాలకృష్ణతో సాందీపని సహ సంపాదకులు దేవేందర్ ఎబివిపి స్థాపన, ప్రస్థానం, ఉద్యమాలు వంటి అనేక అంశాలపై ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖి 2 భాగాలుగా వీఎస్‌కే తెలంగాణ వీక్షకుల కోసం అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.
 
ప్రశ్న: ప్రస్తుత విద్యార్థులకు ఎబివిపి లక్ష్యం గురించి వివరించండి?
 
ఎబివిపి 75 వసంతాల ఉత్సవాలు పూర్తిచేసుకుని విశ్వంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది. ఎబివిపి సభ్యత్వం ఇప్పటికి 54,85,514, విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా దాదాపు 50 వేల కళాశాలల్లో ప్రవేశించింది. పదివేల శాఖలు కలిగి ఉంది. ఆజాద్ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా 'ఏక్ గాన్ 'ఏక్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిస్తే 1,10,450 స్థలాలలో ఒకేసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ఘనత ఎబివిపికి దక్కుతుంది. భౌగోళికంగా చూస్తే కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు ఇలా దేశంలోని దాదాపు అన్ని జిల్లాలలో విద్యార్థి పరిషత్ విస్తరించింది. అన్ని విశ్వవిద్యాలయాలలో ఎబివిపి పని నడుస్తోంది. అలాగే విద్యార్థులకు ఆయామాలు, గతివిధులు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఆయుర్వేదికి, ఫార్మసీ ఇలా అన్ని రంగాల విద్యార్థుల కోసం, ఆయా విద్యార్థుల చదువులకు అనుగుణంగా వారిలో జాతీయ భావాలు నింపే ప్రయత్నం చేస్తున్నాము.
 
గత 75 సంవత్సరాలుగా 'నేషన్ ఫస్ట్' ఆలోచనతో విద్యార్థి పరిషత్ దేశం కోసం, దేశ సంస్కృతి పరిరక్షణ కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో రాజీలేని ఉద్యమాలు నిర్వహించింది. ఈ ఉద్యమాల నిర్వహణలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. ఎన్నో అనుభవాలను పొందింది. వామపక్ష భావజాలం, విభజించే సిద్ధాంతంలా కాకుండా భారతీయ తత్వంతో కూడిన కలిసి ఉండడం, కలిసి ఆలోచించడం, కలిసి పనిచేయడం వంటి మంచి గుణాలు యువతకు నేర్పింది. కాబట్టి విద్యార్థి పరిషత్ ఆలోచనలకు ఆదరణ లభించింది. కులం, ప్రాంతం, పార్టీ వంటి సంకుచిత అంశాల కోసం పనిచేసిన విద్యార్థి సంఘాలు, అలాగే దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూసిన సంఘాలు నేడు గతి లేకుండా పోయాయి. అయితే విద్యార్థి లోకానికి విద్యార్థి పరిషత్ పిలుపునిస్తోంది రండి, మీ ఆలోచన ఆధారంగా మంచి వ్యక్తులతో కలిసి, సమాజంలో మార్పు తీసుకొస్తూ కలిసి పనిచేద్దాం. భారత్‌ను విశ్వగురువుగా నిలుపుదాం. ఇటువంటి మంచి ఆలోచనలకు ఎబివిపి ఎప్పుడూ వేదికగా నిలుస్తుంది.
 
అయితే విద్యార్థి పరిషత్ విద్యార్థి లోకానికి పిలుపునిస్తోంది. దేశానికి స్వాతంత్య్ర్యం వచ్చిన నాటి నుండి ఎలివిపి పనిచేస్తోంది. వ్యక్తి నిర్మాణ కార్యంలో అన్ని రకాల విద్యార్థులను కలుపుకొని వెళ్తూ "సబ్ చెలేంగే... సాత్ చెలేంగే" (అందరం కలిసి, అందరితో కలిసి) అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళుతోంది. 'వ్యక్తి నిర్మాణం' అంటే వ్యక్తిలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి.
 
ప్ర : 75 సంవత్సరాల విద్యార్థి పరిషత్ ప్రయాణం గురించి మీరేం చెప్తారు?
 
ఎబివిపి 1948లో ప్రారంభమైంది. 1975 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. విద్యా రంగానికి బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని, దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, జాతీయ గీతంగా వందేమాతరం ఉండాలని, దేశం పేరు భారత్‌గా ఉండాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి పరిషత్ అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించింది. 1975లో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో విద్యార్థి పరిషత్ జరిపిన ఉద్యమం అద్వితీయమైనది. గుజరాత్, బీహార్లలో ఆవినీతికి వ్యతిరేకంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్న ఉద్యమాలు చెప్పుకోదగ్గవి.
 
1983లో 'సేవ్ అస్సాం ఉద్యమంలో 'చలో గౌహతి' కార్యక్రమం, 1990లో 'సేవ్ కాశ్మీర్' ఉద్యమంలో 'చలో కాశ్మీర్' కార్యక్రమం, 90 దశకంలోనే అయోధ్య శ్రీరామజన్మభూమిలో రామమందిర నిర్మాణం ఉద్యమంలో వేలమంది విద్యార్థులు పాల్గొనేలా ప్రేరణనిచ్చింది. 1980 నుండి 1997 వరకు తెలంగాణ ప్రాంతంలో రాడికల్ విద్యార్థి సంఘాలకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. సరస్వతీ నిలయాలలో పెన్నులకు అవకాశం ఉండాలి తప్ప గన్నులకు కాదు అని ఎబివిపి స్పష్టంగా చెప్పింది. ఈ పోరాటంలో ఏచూరి శీనన్న నుండి మేరెడ్డి చంద్రారెడ్డి వరకు 30 మందికి పైగా కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఇలా అనేకమంది ఎబివిపి కార్యకర్తలు సమాజ కార్యంలో పనిచేస్తూ బలిదానమయ్యారు. ఇలా అనేక పోరాటాలు, ఉద్యమాలతో విద్యార్థి పరిషత్ నిరంతరం పెరుగుతూనే ఉంది.
 
2000 సంవత్సరం తరువాత విద్యార్థి పరిషత్ ఎంతలా ఎదిగిందంటే ఒక విరాట్ స్వరూప దర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రారంభ కాలం నుండి గల్లీల్లో ఇచ్చిన నినాదాలు, అన్ని ప్రాంతాల్లో చేసిన పోరాటాలు నేడు దేశ చట్టసభల్లో చట్టాలై బయటికి వస్తున్నాయి. వాటి ఫలితమే 370 ఆర్టికల్ రద్దు, సిఎఎ-ఎన్ఆర్సి దేశంలో అమలు కావడం, అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం, విద్య భారతీయత ఆధారంగా రూపొందించిన ఎన్ఐపి 2020 వంటివి కొన్ని ఉదాహరణలు.
 
ప్ర : ఎబివిపి రాజకీయ పార్టీలకు నాయకుల్ని తయారు చేస్తున్న ఫ్యాక్టరీ అని ఈమధ్య జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
 
కళాశాలలో చదువుకున్న వ్యక్తి కళాశాల జీవితం నుండి సమాజంలో అడుగుపెట్టిన తరువాత వివిధ రంగాలలోకి ప్రవేశించి, నాయకత్వం వహిస్తూ ఆ రంగాల్లో మార్పు తీసుకురావడం ఎబివిపి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవిధంగా చెప్పాలంటే ఆ ఆలోచన సఫలీకృతం అయిందని చెప్పవచ్చు. ఎబివిపి కార్యకర్తలు అన్ని రంగాలలోనూ ఉన్నారు. కాకపోతే రాజకీయరంగం ప్రభావవంతంగా కనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన వారినే సమాజం గమనిస్తుంది. అంతే తేడా! కానీ "రాజ్ సహి సమాజ్ బదల్నా" (పాలించే వ్యక్తులు మారినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు, సమాజంలో మార్పు రావాలి) అనే విషయాన్ని ఎబివిపి ఎప్పుడూ సమ్ముతుంది.
 
ఆర్థికంగా స్థిరపడి స్వాభిమానంతో జీవించాలనే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) ని ప్రారంభించిన మిలింద్ కాంబ్లే, ఝార్ఖండ్‌లో జనజాతి సమాజ ఉద్ధరణ కోసం తన జీవితాన్ని అర్పించి పనిచేస్తున్న అశోక్ భగత్, సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ తమిళనాడులో వేలాదిమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న నీలకంఠ ప్రియాంబ మాత, స్వదేశీ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ ముందుండటంలో కృషిచేసిన డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఈ దేశంలోని విద్య భారతీయకరణ కోసం రూపొందించిన 'జాతీయ విద్యావిధానం 2020' రూపకర్తలలో ఒకరైన కర్నాటకకు చెందిన ఎమ్.కె శ్రీధర్, విద్యారంగం కోసం ఎంతో కృషి చేసిన మహారాష్ట్రకు చెందిన బాలా ఆప్టే.. ఇలా ఎందరో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గత 75 సంవత్సరాల నుండి దేశం కోసం మరణించడమే కాదు, దేశం కోసం జీవించడం అనే దృక్పథంతో కృషి చేస్తున్నారు. వేలమంది. ఎబివిపి కార్యకర్తలు అన్ని రంగాలలో నాయకత్వం వహిస్తున్నారు.
 
ఇలా ప్రతి రంగంలోనూ విద్యార్థి పరిషత్ ప్రభావం కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలో మార్పు రావడంలో ఎబివిపి చేసిన కృషి ఎనలేనిది. ఒక విధంగా చెప్పాలంటే ఎబివిపి నిశ్శబ్ద విప్లవం కారణంగా అన్ని వ్యవస్థల్లో పారదర్శకత పెరగడం, తద్వారా భారత్లో మంచి మార్పు జరగడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక్క రాజకీయ రంగానికే కాదు, అన్ని రంగాలకు నాయకులను అందించే మ్యేన్ మేకింగ్ ఫ్యాక్టరీ ఎబివిపి అని గర్వంగా చెప్పుకోవచ్చు.
 
కింది లింక్ పై క్లిక్ చేసి ఇంటర్వ్యూ 2వ భాగం చూడండి