స్వాతంత్య్ర సమరంలో ఆర్ఎస్ఎస్ త్యాగాలకు ఇంకేం సాక్ష్యం కావాలి?

VSK Telangana    14-Aug-2024
Total Views |

Rss in Independence 
స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రపై చాలా రకాలైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సంఘ్ పోషించిన పాత్ర అపూర్వమైనది.
 
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) స్థాపన 1885లో జరుగగా... దానికంటే చాలా ఆలస్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925లో స్థాపించబడింది. ఆనాడు బ్రిటిష్‌కు వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ నాయకత్వం వహించింది. ఆనాడున్న జస్టిస్ పార్టీ (EV రామస్వామి), అంబేద్కర్ స్థాపించిన ILP, ముస్లిం లీగ్ ఇంకా కమ్యూనిస్ట్ వంటి మిగిలిన రాజకీయ సమూహాలకు కాంగ్రెస్‌తో సిద్ధాంతాలు, వ్యూహాల విషయలో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారిపై పోరాటానికి కాంగ్రెస్సే నాయకత్వం వహించేలా చేశాయి. ఆ సమయంలో వేర్వేరు భావజాలాలు, సిద్ధాంతాలతో అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి, వాటి వ్యవస్థాపకులు బ్రిటీష్‌తో నేరుగా తలపడినట్లయితే వారు దాన్ని అణిచివేసేవారు. అందుకే అందరూ కలసి కాంగ్రెస్‌కి మద్దతుగా నిలిచారు. దేశంలోని రాజకీయ పార్టీల మధ్య విభిన్న సైద్ధాంతిక వ్యూహాలు, ఇతర విభేదాలు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ హెడ్గేవార్ దేశ ప్రజలందరినీ ఏకం చేసేందుకు... హిందూ సంఘటనం నిర్మించడం కోసం రాజకీయాలకు అతీతంగా, భారత దేశ సాంస్కృతిక / భౌగోళిక ఐక్యత, స్వేచ్ఛ మొదలైన మిగిలిన ఫలితాలను పొందడానికి సంఘ్ (ఆర్ఎస్ఎస్)ని స్థాపించారు.
 
హిందూ సమాజ ప్రయోజనాల కోసం పోరాడుతూ పనిచేసే ఒక సమూహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ హెడ్గేవార్ భావించారు (1921 నాటి మోప్లా తిరుగుబాటు భారీ సంఖ్యలో హిందువులను ఊచకోత కోసింది). హిందూ పరిరక్షణ అత్యవసరమని హెడ్గేవార్ భావించారు. "విభజించి పాలించు" అనే బ్రిటీష్ ఉచ్చులో కాంగ్రెస్ పడిపోతోందని ఆయన నమ్మారు. అందుకే కాంగ్రెస్ సిద్ధాంతం పట్ల వ్యతిరేకత చూపించారు. మైనారిటీలను బుజ్జగించే కాంగ్రెస్ విధానం వల్ల వేర్పాటువాదానికి బీజం పడుతుందని కూడా హెచ్చరించారు. నేటి భారతదేశంలో డాక్టర్జీ అంచనా నిజమయ్యిందని అనడానికి మనందరం సాక్షులమే. హెడ్గేవార్ ముస్లిం వ్యతిరేకి కాదు. బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి కలిసి పోరాడేందుకు జాతీయ స్రవంతిలో చేరాలని ఆయన కోరుకున్నారు.
 
డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా కాంగ్రెస్ వాది. అయన లోకమాన్య తిలక్ వంటి దిగ్గజాలతో పాటు అనేక సంవత్సరాలు స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. హెడ్గేవార్ దేశభక్తుడు, విప్లవకారుడిగా జన్మించారు. 1921లో దేశద్రోహ ఆరోపణలపై ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించారు. దేశద్రోహ ఆరోపణలపై కోర్టులో ఆయన స్వయంగా వాదించుకోవడమేగాక, భారత స్వాతంత్ర్యం, భారత ప్రజల కోసం తన దృష్టి కోణాన్ని బలంగా వ్యక్తీకరించారని మనం తెలుసుకోవాలి. డాక్టర్ హెడ్గేవార్‌తో పాటు సంఘ్ కార్యకర్తలు కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అలాంటి వాటిలో ఒకటి 1931లో జరిగిన అటవీ సత్యాగ్రహం. ఆ సమయంలోనే హెడ్గేవార్ రెండవసారి జైలుకు వెళ్లారు. ఆయనతో పాటు ఇతర స్వయంసేవకులు ఉప్పు సత్యాగ్రహంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. కాబట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ భాగస్వామ్యాన్ని ప్రశ్నించే ఏ వాదన అయినా సందేహాస్పదమే.

Doctor Hedgewar 
 
నిజానికి, డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్ర్య పోరాటాన్ని వ్యక్తిగత ప్రమేయంతో ముందుండి నడిపించారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనాలని సంఘ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. నిజానికి స్వాతంత్ర్య పోరాటంలో సగానికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారని చెబుతారు. అయితే ఏ సందర్భంలోనైనా సహజంగానే సంఘ్‌కు ప్రచారం ఉండేది కాదు. అందువల్లనే ఎవరికీ ఈ విషయాలు తెలియలేదు.
 
ఆర్ఎస్ఎస్ స్థాపించబడిన తొలి రోజు నుంచే బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ కోసం పిలుపునిచ్చింది, అయితే కాంగ్రెస్ మాత్రం ఈ పార్టీ ఏర్పడిన 44 సంవత్సరాల తర్వాత 1944లో మాత్రమే పూర్తి బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్వేచ్ఛ కోసం పిలుపునిచ్చింది. (1920లో జరిగిన నాగపూర్ అఖిల భారత కాంగ్రెస్ సభలలో డాక్టర్ హెడ్గేవార్ బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్వేచ్ఛ కోసం పిలుపునిచ్చారు. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1929లో కాంగ్రెస్ ఈ పిలుపును ఇచ్చింది ). కాంగ్రెస్ వారు 1929 నాటు లాహోర్ సభలో పూర్ణ స్వరాజ్ కోసం పిలుపునిచ్చిన తర్వాత, అందుకు ఉత్సాహంగా మద్దతు ఇవ్వాలని డాక్టర్ హెడ్గేవార్ స్వయంసేవకులందరినీ ఆదేశించారు. ప్రతి శాఖలో జనవరి 26, 1930న ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ విషయం రికార్డులో ఉంది.
 
ఆర్‌ఎస్‌ఎస్ అనుసరిస్తున్న బ్రిటీష్ వ్యతిరేక వైఖరి గురించి బ్రిటిష్ వారికి తెలుసు. ఆర్‌ఎస్‌ఎస్ తమ వ్యక్తులను బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోకి (సైన్యం, పోస్టల్, రైల్వే మొదలైనవి) పంపించిందని, వీరంతా తగిన సమయంలో వాటన్నంటినీ బ్రిటిష్ వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు బ్రిటిష్ వారు 1940లో ఒక నోట్‌ను పంపిణీ చేశారు.
 
దేశ విభజన సమయంలోను, ఆ తరువాతి అత్యంత క్లిష్టమైన రోజుల్లోను సంఘ్ ఎంతో కీలక పాత్ర పోషించింది. విభజన సమయంలో పశ్చిమ పంజాబ్ నుండి వచ్చిన హిందూ శరణార్థులకు ఆర్ఎస్ఎస్ గొప్ప సహాయం చేసింది. స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ఎందరో ప్రజలను రక్షించారు. చివరి వ్యక్తిని సైతం సురక్షితంగా భారతదేశానికి తరలించే వరకు అంకితభావంతో సేవలందించారు.
 

Partition of India 
 
స్వాతంత్య్రానంతరం దాద్రా, నగర్ హవేలీ, గోవాలను భారతదేశంలో విలీనం చేయడంలో స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ విముక్తిలో వారి పాత్ర ఎంతో ప్రశంసించబడింది. మొత్తంగా చూసినప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో సంఘ స్వయంసేవకులు బహుముఖీయంగా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందరో తమ ప్రాణాలను అర్పించారు, జైలుకు వెళ్లారు.
 
ఇంతటి బలమైన నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన సహకారాన్ని వామపక్షాలు, ఇతరులు ప్రశ్నించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆర్ఎస్ఎస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు ఒకే సమయంలో (1925లో) స్థాపించబడ్డాయి. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి హిందూ సమాజాన్ని సంఘటితపరచి, సన్నద్ధం చేయడంలో సంఘ్ నిమగ్నమై ఉండగా, కమ్యూనిస్టులు బ్రిటీష్ వారికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులను కించపరిచారు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో రష్యన్లు మిత్రరాజ్యాల (బ్రిటిష్, అమెరికా) పక్షాన నిలబడనంత కాలం, భారతదేశంలోని కమ్యూనిస్టులు మిత్రరాజ్యాల దళాలకు వ్యతిరేకంగా ఉన్నారు. వారి దృష్టిలో బ్రిటిష్ వారు, అమెరికన్లు 'సామ్రాజ్యవాద శక్తులు'. కానీ స్టాలిన్ మిత్రపక్షాలతో చేతులు కలిపిన మరుక్షణం; అదే కమ్యూనిస్టులు సిగ్గులేకుండా బ్రిటిష్ వారిని కీర్తించడం ప్రారంభించారు. పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ డిమాండ్‌కు కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు.
 
ఫుట్ నోట్స్ -
 
1. స్వతంత్ర వీర్ సావర్కర్ స్వాతంత్య్రం గురించి తన అభిప్రాయాలను కలిగి ఉన్నందుకు బ్రిటిష్ వారి క్రింద జైలులో నరకం అనుభవించారు. ఆయన తన 17 సంవత్సరాల వయస్సులో అంటే 1900 సంవత్సరంలో భారతదేశానికి పూర్తి రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాట్లాడారు. ఆయన హిందూ భావజాలం కారణంగా కాంగ్రెస్, వామపక్షాలు సిగ్గులేకుండా ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
 
2. భారతదేశానికి బ్రిటీష్ పాలన ప్రయోజనకరంగా ఉందని, 1929 వరకు డొమినియన్ హోదాకు అంగీకరించినందుకు కాంగ్రెస్ సంతోషంగా ఉందని తమ నాయకులు (1880లు మరియు 90లలో) పేర్కొన్న విషయాన్ని కాంగ్రెస్ మరచిపోకూడదు.
 
- రామమూర్తి ప్రభల