- రాంపల్లి మల్లికార్జున్
2024 ఆగస్టు 15 కి భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తిఅయ్యి 78వ సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. ఈ 77సంవత్సరాల భారత్ ఎట్లా ఉన్నది? దానికి తాజా ఉదాహరణ మొన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు. ఆ సమయంలో ఎన్నికల పోరాటం INDIA వర్సెస్ BHARATల మధ్య జరిగిందని పత్రికలలో వ్యాసాల పరంపర వచ్చింది, ఇది ఏమి తెలియ చేస్తున్నది, INDIA అంటే ఈ దేశం జాతుల సమూహారం, భారత్ అంటే ఒకే జాతి. ఈ రెండిటి మధ్య యుద్ధం అంటే మనలను మనం వంచించుకోవటం మన చరిత్రను మనం విస్మరించటం స్వాతంత్ర పోరాట యోధులను అవమానించటం. ఇటువంటి దుస్థితి ఈ దేశానికీ ఎందుకు వచ్చింది, అసలు స్వాతంత్రం అంటే ఈ రోజు అందరికి గుర్తొచ్చేది గాంధీ, నెహ్రూలే కానీ. స్వాతంత్ర పోరాటాన్ని మలుపులు తిప్పినవాళ్లు, ఉవెత్తున లేపినవాళ్లు ఈ దేశ ప్రజలకు జ్ఞాపకం రావడం లేదు. ఈ దేశ ప్రజలకు స్వాతంత్య్ర పోరాట చరిత్ర ఎంత గుర్తుకు ఉన్నది? స్వాతంత్ర పోరాటాన్ని 1857-1920 మధ్యన, 1920-47 మధ్యన సాగినది అని రెండు భాగాలుగా చూస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
1857-1920 మధ్యకాలంలో దేశ స్వాతంత్ర పోరాటం
ఈస్టిండియా కంపెనీ పాలన పై పోరాటానికి ఊతమిచ్చిన రంగా బావూ జీ పేరు ఎందురు విని ఉంటారు? రంగా బావూ జీ 1857 స్వతంత్ర పోరాట వ్యూహకర్తల్లో ఒకరు. 1840 నుండి 1853 వరకు లండన్ పట్టణంలో నివసించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంపై చేస్తున్న అత్యాచారాలను బ్రిటిష్ పార్లమెంట్ సాక్షిగా అందరికీ వినిపించేవాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఆ రోజులలో 60,000 మందితో సంతకాలు సేకరణ చేసి బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించాడు. రంగా బావూ జీ నిర్విరామ కృషి ఫలితంగా 1843 ఫిబ్రవరిలో ఈస్టిండియా కంపెనీ రంగా బావూ జీని మాట్లాడేందుకు ఆహ్వానించింది. ఈస్టిండియా కంపెనీ భారత్‌లో చేస్తున్న అత్యాచారాలను కంపెనీ వాళ్ళకే రంగాబావూజీ వివరించాడు. అవేవీ వాళ్ళ చెవికి ఎక్కవని అప్పుడే ఆయనకు అర్థమైంది. తదుపరి ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకున్నాడు. నానాసాహెబ్ పీష్యా, తాంతియాతోపే, అజీముల్లా ఖాన్, రంగా బావూ జీ రహస్యంగా కలిసి చర్చించారు. దాని సారాంశమే 1857 స్వాతంత్య్ర పోరాటం. అంటే 1857 స్వాతంత్ర పోరాటానికి కీలక నిర్ణయం చేసిన వాళ్లలో రంగా బావూజీ ఒకరు. ఆ పేరు మనకి గుర్తుకు ఉండదు. గదర్ పార్టీ పేరు ఎందరికి గుర్తుంది? భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, బ్రిటిషు నియంతృత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు పనిచేసినవాళ్ల ఊసు ఎక్కడైనా వినపడుతున్నదా? వాసుదేవ బల్వంత ఫడ్కే నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు సాగిన సాయుధ పోరాటం ఈ దేశ ప్రజల పౌరుషపరాక్రమము ప్రపంచంఅంతా చూసింది ఆ పోరాట చరిత్రను కథలు కథలుగా అందరూ చెప్పుకొన్నారు. స్వామి వివేకానంద నుండి అరవింద ఘోష్ వరకు సాగిన సాంస్కృతిక జాతీయతా వికాసప్రయత్నం, ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఈ దేశం ధర్మం, సంస్కృతి అందరికీ తెలియజేసేందుకు సాగిన ప్రయత్నాలు, అనేకమంది సాధు సంతుల చరిత్రలు మనకు జ్ఞాపకం వస్తున్నాదా?
1857 స్వతంత్ర పోరాటం తర్వాత భారతదేశం ఒక రకంగా అంతర్ముఖం అయింది. ఈ జాతి పునర్ జాగరణకు జాతీయ జీవనంలోని అన్ని రంగాల్లో ఎట్లా పనిచేసిందో ఎట్లా చైతన్యం నింపిందో మనం అర్థం చేసుకోవాలి. బిర్సా ముండా నుండి రాంజీ గోండు వరకు గిరిజనులలో స్వాభిమానం, స్వాతంత్ర పోరాటం రగుల్కొల్పిన గిరిజన యోధుల పోరాట స్ఫూర్తి ఈ దేశం గుర్తు చేసుకొంటున్నదా? సీవీ రామన్ నుండి జగదీష్ చంద్ర బోస్, రామానుజ నుండి అనేక మంది శాస్త్రవేత్తలు ఈ జాతి మేధోశక్తి. వారిని ఎందరు గుర్తుకు తెచ్చుకొంటున్నారు? ఈ విషయాలన్నీ 1920 తరువాత దేశంలో ప్రారంభమైన రాజకీయ ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకు పోయినాయి.
1920-47 మధ్య సాగిన ఉద్యమాలు
స్వాతంత్య్ర పోరాటం అంటే గుర్తుకొచ్చేది కాంగ్రెస్ మాత్రమే. అసలు కాంగ్రెస్ ఆ రోజుల్లో ఎట్లా ఉండేది? అది స్వాతంత్ర పోరాట ఉద్యమాలకు వేదిక. ఇది ఎంతమందికి తెలుసు? 1920-47 మద్య బ్రిటిష్ ప్రభుత్వం గాని కాంగ్రెస్, ముస్లిం లీగ్ వ్యవహరించిన తీరుతో చేసిన నిర్ణయాలు దేశాన్ని గందగోళంలో పడేయటమే కాదు భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేసింది. ఆ వివరాలు చూద్దాము.
దేశంలో అనేకమంది వ్యక్తులు, అనేక సంస్థలు (1885 నుండి 1920 వరకు) దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ వేదికగా పనిచేశారు. 1919-20 మధ్యకాలంలో స్వాతంత్ర పోరాటాన్నిరాజకీయ పోరాటంగా మలుపు త్రిప్పిన రెండు ఉద్యమాలు జరిగాయి. ఆ రెండు ఉద్యమాలు స్వతంత్ర పోరాటం నుండి 'స్వా'ను లుప్తం చేసి స్వతంత్రపోరాటాన్ని రాజకీయపోరాటంగా రూపాంతరం చెందటానికి శ్రీకారం చుట్టాయి. అవి 1) ఖిలాఫత్ ఉద్యమం. ఇది మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేనిది. కానీ దానిని కాంగ్రెస్ తలకు ఎత్తుకుని ముస్లింలు వారి లక్ష్యాలను సాధించుకోవడానికి సాగిస్తున్న పోరాటాలకు గుర్తింపు, బలం చేకూర్చింది. 2) సహాయ నిరాకరణ ఉద్యమం. 1920వ సంవత్సరం తర్వాత కాంగ్రెస్ చేసిన ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలుగా మారిపోయాయి. బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ఎన్నికల రాజకీయాలు కూడా ప్రారంభించింది. అందులో భాగంగా బ్రిటిష్ ఇండియాలో 1926లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ చివరి రోజుల మధ్య రాజ్య శాసనమండలి (Imperial Legislative Council), ప్రాంతీయ శాసనమండలి సభ్యులను ఎన్నుకునేందుకు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలలో పోటీ చేసింది. 1934 నుండి భారత్‌లో ఎన్నికల నిర్వహణ జరుగుతూ వచ్చింది. అప్పటి నుండే క్రమంగా కాంగ్రెస్ మార్క్ రాజకీయం దేశంలో వేళ్లూనుకొని రాజకీయమంటే అదేనని అందరి నరనరాలలో జీర్ణించుకుపోయింది. దేశంలో స్వతంత్రం కోసం కాంగ్రెస్ మార్క్ రాజకీయ ఉద్యమానికి స్వతంత్రపోరాటం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయాలు వంట పట్టించుకుని రాజకీయాల కోసం దేశం, ధర్మం, సంస్కృతులను తాకట్టు పెట్టే నేతలను సృష్టిస్తున్న కాంగ్రెస్ మార్కు రాజకీయం నుండి దేశానికి విముక్తి ఎప్పుడు లభిస్తుందో?
కమ్యూనల్ అవార్డు 1932
హిందూత్వం భారత జాతీయత అనే విషయాన్ని విస్మరణకు చేసిన ప్రయత్నాలలో కమ్యూనల్ అవార్డు ఒకటి. అది 1932 ఏప్రిల్ 16న బ్రిటిష్ ప్రధాని రాంసే మెక్ డొనాల్డ్ దేశంలోని వివిధ వర్గాలకు ప్రత్యేక ప్రాతినిధ్య హక్కులు కల్పిస్తూ కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రకటించారు. ఈ అవార్డు ఆఘాఖాన్ ప్రతిపాదించిన మైనారిటీ డిమాండ్ల కొనసాగింపు మాత్రమే. దాని ప్రకారం కేవలం ముస్లింలకే కాక యూరోపియన్లకు, సిక్కులకు, భారతీయ క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు ప్రకటించారు. హిందూ సమాజంలో అవిభాజ్యంగామైన హరిజనాది వర్గాలను వేరుచేసేలా బ్రిటిష్‌వారు కుట్రపన్నారు. కమ్యూనల్ అవార్డుతో అణగారిన వర్గాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనను కాంగ్రెస్ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు లక్ష్యాలు సాధించదలచుకున్నట్లు అర్ధమవుతుంది. ఇస్లాం, క్రైస్తవం లాగా హిందూ అనేది కూడా మతం అని స్థిరపరచటం. అట్లాగే హిందూ సమాజంలో చీలికలు తేవటం. ప్రత్యేక అధికారాల కోసం, ప్రత్యేక ప్రాతిపదిక కోసం మేము ప్రత్యేకం అని భావించసాగారు. ఆది ఈ రోజుకూ కొనసాగటమే కాదు, మరికొందరు ఈ ప్రత్యేకతల కోసం ఉద్యమాలు చేస్తున్నారు.
స్వాతంత్రం ఎలా ఇవ్వబడింది?
1920, 1926, 1934 సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1945లో రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. 1946లో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ కాబినెట్ మిషన్ ప్రణాళికను ప్రకటించారు. 1946 సెప్టెంబర్ 2న జవహర్‌లాల్ నెహ్రు ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించబడింది. 1947 జూన్ 3న ఇండిపెండెన్స్ అఫ్ ఇండియా చట్టం ఆమోదించబడింది. దానిప్రకారం ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలు ఏర్పడతాయి. 1947 ఆగస్టు 15న అధికార మార్పిడి పూర్తయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. దాంతో మనదైన పాలనావ్యవస్థ, మనవైన అన్నీ చరిత్ర పుటలలోకి వెళ్లిపోయాయి. దేశవిభజనతో దేశానికీ క్రొత్త ఆధ్యాయం ప్రారంభమైంది. కొత్త కొత్త సమస్యలు తయారయినాయి. వాటన్నిటి మధ్య ఈ దేశం ముందుకు వెళుతున్నది.
రాజకీయాలను ఎట్లా నడిపించాలో ప్రజలు నేర్చుకోవాలి...
ఈనాడు భారతీయ సమగ్రత ఇరకాటంలో పడినట్టు కనిపిస్తున్నది. ఇది ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదు. రాబోయే రోజుల్లో భారతీయ సమాజం పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను సరిగ్గా అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే రాజకీయ సంస్కృతిని ఈ సమాజం అలవాటు చేసుకోవాలి. నాగరికత పరంగా ఇది ఒకే దేశం, ఒకే జాతి అని, ఈ దేశ చరిత్రతో ఉన్న చారిత్రక సంబంధాలన్నీ మన అందరికీ సంబంధించినవని, ఈ సత్యాన్ని ఈ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేడు మనదేశం ముందు ముఖ్యంగా ఈ దేశంతో మనం అందరం గాఢంగా తాదాత్మ్యత చెందాలనే భావనను పెంపొందించుకోవాలి. ఈ దేశ అమూల్యమైన సంస్కృతి వారసత్వాలు మనందరికీ గర్వకారణం కావాలి. ప్రపంచ కల్యాణానికి కారకమైన మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మన పద్దతుల పట్ల భారత్ ఈ రోజు గర్వించాలి. స్వాభిమానంతో జీవించాలి. భారతీయ నాగరికత, సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రపంచ కల్యాణానికి దారులు ఏర్పాటు చేయాలి. రాజకీయాలు రాజకీయాల కోసం కాదు. దేశ సమగ్రత సార్వభౌమత్వం దేశ అభివృద్ధికోసం అనే విషయాన్ని ప్రజలు గుర్తించి రాజకీయాలను సరైన మార్గంలో నడిపించడం అనేది ఇప్పుడు మన అందరి ముందు ఉన్న ఒక కర్తవ్యం.