భోజ్‌శాలను 1909లో రక్షిత కట్టడంగా, 1951లో జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు అవశేషమని ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఏఎస్‌ఐ సంరక్షణలో ఉంది. అంటే 1958లో తీసుకువచ్చిన చట్టం మేరకు ఏఎస్‌ఐ రక్షణ కిందకు వచ్చింది. కాబట్టి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి భోజ్‌శాల రాదు. భోజ్‌శాల కట్టడంలో నమాజ్‌ను వ్యతిరేకిస్తూ మే, 2022లో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే హిందూ హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. అందుకు కారణం 2003లో ఇక్కడ హిందువులు నిత్య పూజలు జరపకుండా ఏఎస్‌ఐ నిషేధించింది. హిందూ సంఘం వ్యాజ్యం మేరకు ఇందోర్ హైకోర్టు ధర్మాసనం శాస్త్రీయ సర్వే జరపాలని ఆదేశించింది. మొదట సర్వే నివేదిక సమర్పణకు ఆరు వారాలే ఇచ్చినా, తరువాత పద్నాలుగు వారాలకు పెంచింది. ముస్లింల వైఖరిని అనూహ్యం కాదు. ఎన్ని ఆధారాలు చూపించినా అవి హిందూ కట్టడాలుగా అంగీకరించడానికి వారు సిద్ధంగా లేరు. ఇక హిందువులకు అప్పగించడం అన్న ప్రక్రియ కోర్టుల ద్వారా మాత్రమే జరుగుతుంది.
ఏమిటీ భోజ్‌శాల?
భోజ్‌శాల మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ కట్టడం పేరులోనే అందుకు సంబంధించిన ఆధారం ఉంది. అది భోజుడి (క్రీస్తుశకం 1000`1055) జీవితంతో ముడిపడి ఉన్న కట్టడం. పార్మార్ వంశానికి చెందిన పాలకునిగా చరిత్రలో ఆయనకు సుస్థిర స్థానం ఉంది. సరస్వతి అమ్మవారి ఆలయం క్రీస్తుశకం 1034 సంవత్సరంలో నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు. రాజస్తాన్ నుంచి ఒడిశా వరకు, ఇటు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు సామ్రాజ్యాన్ని విస్తరించిన భోజుడే దీని నిర్మాత. ధార్‌లోనే ఆ ఆలయం ఉంది. అదే భోజుడి రాజధాని. భోజ్‌శాల అంటే భోజున మందిరం లేదా సభ అని అర్థం. కాళిదాసు, వరాహ మిహిరుడు వంటి వారు ఆయన ఆస్థానంలోని వారేనని చరిత్ర. ఆయనే భోజ్‌శాల పేరుతో విద్యాలయం ఆరంభిం చారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు విద్యార్థులు వచ్చేవారు. హిందువులు సరస్వతీ అమ్మవారి ఆలయంగా, అంటే వాగ్దేవి ఆలయంగా భావిస్తారు. తరువాత ఈ విద్యాకేంద్రాన్ని భోజుని వారసులు పోషించారు. చాలా ఆలయాల మాదిరి గానే భోజ్‌శాల వెనుక గాథ కూడా ఇటీవలి వరకు మరుగున ఉండిపోయింది. అక్కడ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఏఎస్‌ఐని ఆదేశించడంతో ఒక్కసారిగా దేశం దృష్టిలో పడిరది. ఆ సర్వే సరికాదంటూ ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా సర్వేను నిరోధించ లేమంటూ సమాధానం రావడం కట్టడం గురించి ఇంకాస్త ఆసక్తి రేపింది.
మౌలానా మసీదుగా ఎలా మారింది?
భోజ్‌శాలను ముస్లింలు కమాల్ మౌలానా మసీదుగా చెబుతారు. భోజుడు పాలించిన ఉజ్జయినీ తదితర ప్రదేశాలు ఉన్న మాల్వా ప్రాంతానికి ముస్లిం ఫకీర్‌గా చెప్పుకునే కమాల్ మౌలానా క్రీస్తుశకం 1269లో మొదట వచ్చాడు. ఆనాడే అతడు హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి కిరాతకంగా వ్యవహరించాడు. ఇతడే మాల్వా గురించి పూర్తి వివరాలు సేకరించి అల్లావుద్దీన్ ఖిల్జీకి అందచేశాడు. అల్లావుద్దీన్ బానిస వంశీకులలో అత్యంత క్రూరుడిగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వాడు. ఇతడే 1305 ఆ ఆలయం మీద దాడి చేశాడు. ఇదే ఆ ఆలయం మీద జరిగిన తొలి ముస్లిం దాడి. రాజా మహాకాల్ దేవ్‌ను యుద్ధంలో ఓడిరచి ఇతడు ఆలయం మీదకు వెళ్లాడు. అక్కడ ఉన్న 1200 మంది విద్యార్థులు మతం మారడానికి నిరాకరించారు.
సరస్వతి అమ్మవారి ఆలయంలోనే విజయ్ మందిర్ లేదా సూర్య మందిర్‌ను ధ్వంసం చేసినవాడు దిలావర్ ఖాన్. 1401 ఇతడే ఆలయంలో కొంత భాగం దర్గాగా మార్చాడు. సరిగ్గా ఇప్పుడు ముస్లింలు నమాజ్ చేసే ప్రదేశం ఒకప్పుడు సూర్య మంటపం ఉన్నదే. దిలావర్ నిర్మించిన దర్గాయే తరువాత లాత్ మసీదు అయింది. 1514లో దాడి చేసిన మహమ్మద్ షా ఆలయం మొత్తాన్ని దర్గాగా మార్చాలని అనుకున్నాడు. కానీ ఆలయానికి బయట ఉన్న భూమిని ఆక్రమించి అక్కడ కమాల్ మౌలానా మక్బారా నిర్మించాడు. అప్పటికి కమాల్ మౌలానా మరణించి 204 ఏళ్లు గడిచాయి. ఈ పరిణామాల ఆధారంగానే భోజ్‌శాల ఒక దర్గా మాత్రమేనని నిరూపించడానికి కుట్రలు సాగాయి. 1552లో మేదీనీరాయ్ అనే హిందూవీరుడు సైన్యాన్ని సమీకరించుకుని మహ్మద్ ఖిల్జీని ఓడిరచాడు. మేదినీరాయ్ ధార్ కోటలో వేలాదిమంది ముస్లిం సైనికులను చంపాడు. 900 మందిని నిర్బంధిం చాడు. ఆ సమయంలోనే మార్చి 25, 1552లో ధార్ కోటలో పనిచేసే ఒక ముస్లిం సైనికుడు సయద్ మసూద్ అబ్దుల్ సామర్ఖండ్ వెన్నుపోటు పొడిచి ముస్లిం సైనికులను విడిపించాడు. తరువాత ఇతడిని మేదినీరాయ్ చంపాడు. చిత్రంగా ఇప్పటికీ ధార్ కోటలో సయద్ మసూద్‌ను బందీ ఛోద్ దాతా పేరుతో పూజిస్తారు.
ఇంగ్లండ్‌కు తరలిన వాగ్దేవి ప్రతిమ
1703లో మాల్వా మరాఠాల పరమైంది. దీనితో ముస్లింల పాలన అంతమైంది. 1826లో మాల్వాను ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. కంపెనీ కూడా భోజ్‌శాల మీద దాడి చేసింది. ఆలయంలో కొంత భాగం ధ్వంసం చేసింది. 1902లో కర్జన్ ఇక్కడి అమ్మవారి విగ్రహం (వాగ్దేవి)ని ఇంగ్లండ్ తరలిం చాడు (కొందరి వాదన ప్రకారం 1857 నాటికే ఆ ప్రతిమ ఇంగ్లండ్ చేరింది). 1930లో ముస్లింలు భోజ్‌శాలలో నమాజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ముస్లిం పాలన అంతమైన తరువాత జరిగిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆర్యసమాజ్, హిందూ మహాసభ కార్యకర్తలు ముస్లింలను దిగ్విజయంగా నిరోధించారు. 1952లో భోజ్‌శాలను భారత పురావస్తు శాఖకు అప్పగించారు. ఆ సంవత్సరమే ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ హిందువులను చైతన్యవంతం చేసే పని ఆరంభించాయి. శ్రీమహా రాజా భోజ్‌స్మృతి వసంతోత్సవ్ సమితి ఏర్పడింది.
ఈ పరిణామాల తరువాత హఠాత్తుగా భోజ్‌శాలకు చెందిన నిజమైన అమ్మవారి ప్రతిమ గురించిన సమాచారం వెల్లడైంది. 1961లో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ అనే పురావస్తు శాస్త్రవేత్త, రచయిత లండన్ మ్యూజియంకు వెళ్లారు. అక్కడ ఆయన చూసిన అమ్మవారి ప్రతిమ భోజ్‌శాల లోనిదేనని గుర్తించారు. అప్పుడే ఆయన ఆ మ్యూజియం అధికారులతో చర్చించారు. స్వదేశానికి వచ్చి 1961లో ప్రథమ ప్రధాని నెహ్రూను, 1977లో ఇందిరాగాంధీని కలుసుకుని వాగ్దేవి ప్రతిమ వివరాలు అందించారు. కానీ ఆ ఇద్దరూ కూడా ఆ ప్రతిమను వెనక్కి తెచ్చే ప్రయత్నమేదీ చేయలేదు. సరిగ్గా రెండు దశాబ్దాలకు మళ్లీ ముస్లిం పాలన ప్రవేశించినంత పనైంది. మార్చి 12, 1997లో నాటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చిరకాలంగా హిందు వులు చేసుకుంటున్న పూజలను నిషేధించాడు. అయితే ముస్లింలు నమాజ్ చేయడానికి అనుమతి యథాతథంగా కొనసాగించాడు. ముస్లింలు యథాప్రకారం శుక్రవారం నమాజ్ చేయవచ్చు. హిందువులు లోపలికి వెళ్లవచ్చు. పూజలు చేయరాదు.
తలొగ్గిన దిగ్విజయ్‌సింగ్
హిందువులలో అప్పటికే పెరిగిన చైతన్యం కారణంగా భక్తుల రాక పెరిగింది. 2002లో వసంత పంచమికి జనం పోటెత్తారు. ఇది చూసి సెక్యులరిస్టులు కమాల్ మౌలానా జయంతి కార్యక్రమం ఆరంభించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట వరకే హిందువులను అనుమతించారు. తరువాత ముస్లింల కార్యక్రమాలు మొదలు పెట్టాలి. రద్దీ బాగా ఎక్కువైంది. అదుపు చేసే సాకుతో పోలీసులు హిందువులను దారుణంగా కొట్టారు. కానీ మరుసటి సంవత్సరం హిందువులు మరింత పట్టుదలతో కార్యక్రమం నిర్వహించారు. మొదట రథయాత్రలు నిర్వహించారు. ఆ రథాలకు 9 లక్షల మంది పూజలు నిర్వహించారు. సాహసించి దాదాపు లక్ష మంది భోజ్‌శాలలో ప్రవేశించారు. వసంత పంచమి రోజున (ఫిబ్రవరి 6, 2003) విశ్వహిందూ పరిషత్ నాయకుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా ప్రసంగించారు. ఫిబ్రవరి 18లోగా భోజ్‌శాలను అప్పగించాలని హిందువులు ఆదేశించారు. ఆ రోజు పోలీసులు కాల్పులు జరిపారు. 23 మంది భక్తులు గాయపడ్డారు. దిగ్విజయ్‌సింగ్ కర్ఫ్యూ విధించాడు. ఆఖరికి అతడే దిగివచ్చాడు. ఏప్రిల్ 8,2003న నిత్య దర్శనానికి హిందువులను లోపలికి అనుమతిం చాడు. తరువాత బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటంతో విజయం సాధించే ప్రయత్నం జరుగుతున్నది.
హిందూ ఆలయాలను కూల్చి మసీదులు కట్టారని గట్టి ఆరోపణలు, ఆధారాలు ఉన్న ప్రతి మసీదు మీద హిందూ సంఘాలు గురిపెట్టాయి. డజన్ల కొద్దీ వ్యాజ్యాలు వేశాయి. కోర్టులు ఈ ఫిర్యాదులను విచారణకు ఆమోదిస్తున్నాయి కూడా. ఢల్లీిలోని కుతుబ్ మీనార్, ఆగ్రాలోని తాజ్‌మహల్ మీద కూడా ఇదే విధమైన వ్యాజ్యాలు నడుస్తున్నాయి.
అయోధ్య తరువాత ప్రస్తుతం కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదు పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నది. దీని మీద కూడా న్యాయపోరాటమే జరుగుతున్నది. భోజ్‌శాల కంటే ముందే ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే కూడా జరిగింది. భోజ్‌శాలలో ఇప్పుడు రుజువైన అంశమే ఆనాడు అక్కడ నిరూపణ అయింది. దొరికినవన్నీ హిందూ ఆనవాళ్లే. ఇలాంటి పోరాటం చేస్తున్నవాళ్ల మీద కొందరు చరిత్రకారులు సహా, సెక్యులరిస్టు పార్టీలు, కమ్యూనిస్టులు చరిత్రను మార్చాలని చూస్తున్నా రంటూ విమర్శలకు దిగుతున్నారు. లేదా చరిత్ర కాషాయీకరణ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
అయోధ్య ఉద్యమం నుంచి ఇదే వరస. హిందూ సంఘాలు న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందుతున్నాయి. మెజారిటీలే అయినప్పటికీ, ఉన్నది ‘హిందూ ప్రభుత్వమే’ అయినప్పటికీ మధ్య యుగాల ముస్లిం మతోన్మాదుల పంథాను ప్రదర్శించడం లేదు. అయినా ఈ హిందూ వ్యతిరేక శక్తులు హద్దు మీరి మాట్టాడుతూనే ఉన్నాయి. అయోధ్య విషయంలో చరిత్రకారులు చేసిన మోసం గురించి సాక్షాత్తు సుప్రీంకోర్టు అభిశంసించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయోధ్య పోరాటంలోని తాత్త్వికత ఆధారంగానే హిందూ సంఘాలు కొత్త పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మధుర (ఉత్తరప్రదేశ్) మొగల్ నిరంకుశుడు ఔరంగజేబ్ నిర్మించిన మసీదు పైన కూడా హిందూ సంఘాలు పోరాడుతున్నాయి. కాశీలో విశ్వేశ్వరుని ఆలయాన్ని తాకుతున్నట్టు ఉండే మసీదు గుమ్మటాల మాదిరిగానే మధురలో కృష్ణభగవానుడి ఆలయం మీద కనిపిస్తాయి. మధుర కృష్ణుడి జన్మస్థలమని, ఇది హిందువులదేనని 12 వ్యాజ్యాలు నడుస్తున్నాయి.