నిజాం నిరంకుశ పాలనకు ‘‘ఆపరేషన్ పోలో’’

VSK Telangana    13-Sep-2024
Total Views |

po 
హైదరాబాద్ ప్రజానీకానికి నిరంకుశ నిజాం పాలన నుంచి ఆపరేషన్ పోలో విముక్తినిచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని స్వంత జాగీరుగా భావించి... ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలపడమో లేదా స్వతంత్ర దేశంగానో ఉంచుకోవాలనుకున్న నిజాం కలల్ని నాటి ఉపప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వ్యూహాత్మక ఆపరేషన్ పోలో కల్లలు చేసింది. తన కలలను నెరవేర్చుకునేందుకు ఆధారంగా భావించిన పాక్ సృష్టికర్త మహమ్మద్ అలీ జిన్నా మరణంతో నిజాం రాజు కుదేలైపోయాడు. జిన్నా మరణానికి హైదరాబాదులో సంతాపదినాలు సైతం ప్రకటించాడు. మక్కా మసీదులో నమాజ-ఎ- జనాజా పేరిట సంతాప ప్రార్థనలు కూడా నిర్వహించాడు. ఆ తర్వాత తన ప్రయివేటు సైన్యమైన రజాకార్య ద్వారా హిందువులను అణచివేసి హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా మార్చుకోవాలని నిజాం విశ్వప్రయత్నమే చేశాడు. పాకిస్థాన్‌కు ఏకంగా 20 కోట్ల రుణం కూడా ఇచ్చాడు.
 
కానీ, ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవతో నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దుశ్చర్యలను అరికట్టడానికి భారత సైన్యం సెప్టెంబర్ 13న నిజాం రాజ్యంలో ప్రవేశించింది. ఈ సైనిక చర్యకు "ఆపరేషన్ పోలో" అని పేరు పెట్టారు. పూనా సైనికాధికారి మహారాజా రాజేంద్ర సింగ్ ఆపరేషన్ పోలో బాధ్యతలు చేపట్టారు. ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వైపు భారత సైనిక దళాలు కదిలాయి. అలాగే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై గూర్ఖా రెజిమెంట్ హైదరాబాద్ వైపు కదిలింది. ఈ రెజిమెంటును కోదాడ వద్ద ఎదుర్కుందామని రజాకార్లు ప్రయత్నించినా గూర్ఖాల ముందు నిలబడలేక అరగంటలోనే తోకముడిచారు. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు కూడా కదిలాయి. బీదర్ విమానాశ్రయంపై బాంబుల వర్షం కురిపించాయి. హైదరాబాద్, వరంగల్ మధ్య విమానాలు దిగాయి.
 
ఇక మరోవైపు జయంత్ నాథ్ చౌధురి నేతృత్వంలో సైనిక బలగాలు నల దుర్గం, తుల్జాపూర్, ఉమర్ గావ్, ఉమల్ వాడీ, అల్టాపూర్‌ల మీదుగా నిజాం రాజ్యంలో అడుగుపెట్టాయి. హైదరాబాద్‌ను నిజాం ఉక్కు పిడికిలి నుంచి విముక్తం చేసేందుకు జనరల్ చౌధురి సేనలు ముందుకు కదిలాయి. సెప్టెంబర్ 14, 1948 నాటికి భారత సేనలు దౌలతాబాద్, జల్నా, పర్బనీ, మాణిక్ ఖేడ్, కన్నెగావ్‌లను విముక్తం చేశాయి. రజాకార్ రక్కసి మూకల నాయకుడు కాశిం రజ్వీ స్వస్థలమైన లాతూర్, ఔరంగాబాద్, షోలాపూర్‌లలో కూడా నిజాం సేనలు తోక ముడిచాయి. సూర్యాపేటలో కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ భారత సేనలు అక్కడ కూడా నిజాం సేనల్ని పూర్తిగా మట్టి కరిపించాయి.


polo
 
భారత సైన్యానికి ఎక్కడ చూసినా ప్రజలు స్వాగతం పలుకుతూ జేజే కారాలు పలికారు. సెప్టెంబర్ 17, 1948 నాటికి భారత సైన్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. అదే రోజు సాయంత్రం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యుద్ధ విరమణ చేస్తున్నట్లు ప్రకటన చేశాడు. సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రానికి నిజాం సైన్యాధిపతి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఇమ్రాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. బొల్లారంలో భారత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిజాం ఫర్మానా ఇచ్చాడు. స్వామి రామానంద తీర్థను విడుదల చేశాడు.
 
రజాకార్ రాక్షసి మూకల ద్వారా అరాచకాలు చేయించిన కాశిం రజ్వీ చివరి వరకూ హిందువులపై దాడులకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నాడు. చివరికి కథ ముగిసిందని తెలుసుకుని జనం తనని కొట్టి చంపకుండా తెలివిగా లొంగిపోయాడు. అతడు చేసిన హత్యలు, దోపిడీలు, అత్యాచారాలకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. ఆ శిక్ష అనుభవించిన తర్వాత తనకు ఇష్టమైన పాకిస్థాన్‌కి వెళ్లిపోయాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్‌కు స్వాగతం చెప్పడానికి స్వయంగా నిజాం వెళ్లాడు. వంగి సలాములు చేస్తూ తన విధేయతను తెలుపుకున్నాడు. ఆ విధంగా ఆపరేషన్ పోలో విజయవంతమై భారతమాత కంఠంలో భాగ్యనగర ముత్యాల దండను వేసింది.
 
 
(ఆపరేషన్ పోలో... సెప్టెంబర్ 13, 1948న ప్రారంభమైంది)