దేశం కోసం మట్టితో పండ్లు తోముకున్న ఆంధ్రా తిలక్

VSK Telangana    14-Sep-2024
Total Views |
gaadi
 
1908లో తిరునల్వేలి జిల్లాలో ‘ఆప్’ అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో ఆంగ్లేయ పోలీసుల దమన నీతిని ఎండగడుతూ ‘విపరీత బుద్ధి’ అనే శీర్షిక క్రింద సంపాదకీయం ప్రచురించారు. ఈ సంపాదకీయాన్ని పురస్కరించుకొని, 1908 జులై 18వ తేదీన ఆ పత్రిక సంపాదకునిపైన, ప్రచురణకర్తపైన రాజద్రోహ నేరం మోపారు.
 
వారిలో సంపాదకునికి 3 సంవత్సరాలు జైలుశిక్ష పడింది. ఆయన రాజకీయ ఖైదీ అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే ఆ సంపాదకుని బట్టలుతీసేసి రెండు గోచీలు ఇచ్చారు. మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు ఇచ్చారు. పడుకునేందుకు చిన్న ఈత చాప ఇచ్చారు. అన్నం తినడానికి మట్టిచట్టి, నీళ్లు త్రాగటానికి ఓ మట్టిముంత, మలమూత్ర విసర్జనకు మరొక చట్టి మాత్రమే ఇచ్చారు. కాలికి లావుపాటి కడియం, మెడకు మరొక ఇనుపకడియం వేసి ఒక కొయ్యముక్కను దూర్చారు. మట్టితో పండ్లు తోముకోవాలి. అధికార్లు నిర్ణయించిన టైముకే మలవిసర్జన చేయాలి. స్నానానికి మూడునాలుగు ముంతల నీరు మాత్రమే ఇస్తారు. తినటానికి ఓ రాగిసంకటిముద్ద ఇచ్చేవారు. ఆ ముద్దలో పుల్లలు, రాళ్లు, మట్టి వుండేవి. ఆకులలములతో ఉడకబెట్టిన పులుసునీరు ఇచ్చేవారు. వాటిలోని పురుగులనైనా కడిగేవాళ్ళు కాదు. అలా తయారయిన ఆ పులుసునీళ్లలో ఉడికి చచ్చిన పురుగులు తేలుతుండేవి.
 
మొలత్రాడు, జంధ్యము తీసేశారు. తల బోడిచేశారు. ఎన్ని విధాలుగా మనుషులను అగౌరవ పరచగలమో, అన్నివిధాల అగౌరవపరుస్తూ దేహబలాన్ని, మనోబలాన్ని అణగద్రొక్కి, సదరు ఖైదీలు దేశసేవకు, మానవసేవకు ప్రయత్నించకుండా వుండేలాగుండే జైలు పద్ధతిని ఆరోజుల్లో ఆంగ్లేయ సామ్రాజ్య వాదులు తయారు చేశారు. సుమారు 1200 రోజులు అహెరాత్రాలూ అలాంటి కఠిన శిక్షను అనుభవించిన ఆ ఆంధ్రవీరుడు మరెవరో కాదు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు.
 
తర్వాతి కాలంలో జతీన్ దాసుగుప్తా బోటి విప్లవకారుల ఆత్మార్పణల కారణంగా రాజకీయ ఖైదీలకు సౌకర్యాలు కావాలని బయట ఆందోళన జరిగింది. ఫలితంగా ఎ, బి, సి తరగతులేర్పడ్డాయి. తదనంతరం జరిగిన సత్యాగ్రహోద్యమాల్లో వందలు వేల కొలది వాలంటీర్లు జట్లు జట్లుగా జైళ్లకు వెళ్ళేవారు. జైల్లో కూడా అందరూ కలిసే వుండేవారు. జైల్లో వేదాలు, వేదాంతాలు అధ్యయనం చేసినవారున్నారు. ‘స్వీయ చరిత్రలు’ వ్రాసుకున్నవారున్నారు. జైలు జీవితం మనస్సుకు, శరీరానికి మంచి విశ్రాంతి నిచ్చిందనేవారు, ప్రశాంత ఆలోచనలకు తావిచ్చిందన్నవారు చాలామంది ఉన్నారు. ఇవి తర్వాత తర్వాత జైలు పరిస్థితులలో వచ్చినమార్పులు. రాజకీయ ఖైదీలకు ఏమాత్రం అసౌకర్యాలున్నా, వారి పట్ల అగౌరవం చూపినా, దేశంలో బ్రహ్మాండమైన ఆందోళన చెలరేగుతుందనే భయం వుండేది జైలు అధికార్లకు.
 
ఆంధ్రా తిలక్ :
 
హరిసర్వోత్తమరావుగారిని అరెస్టు చేసిన రోజే, పూనాలో లోకమాన్య బాల గంగాధర తిలక్ గారిని కూడా అరెస్టు చేశారు. ఆరేండ్లు కఠినశిక్ష విధించి బర్మాలోని మాండలే జైలులో నిర్బంధించారు. ఆ విధంగా ఆంధ్రదేశంలో ప్రప్రథమ రాజకీయఖైదీ హరిసర్వోత్తమరావుగారు. ఆంధ్రుల త్యాగమార్గానికే మార్గదర్శకులైనారు. వీరిని ‘ఆంధ్రతిలక్’ అని ఆరోజుల్లో వ్యవహరించే వారు.
 
 
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor)కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి సర్వోత్తమ రావు గారే.
1883 సెప్టెంబర్ 14 న కర్నూలులో భాగీరథీ బాయి,వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించారు.వారి పూర్వీకులు కడప జిల్లా,సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు.వారిది పేద కుటుంబం.కర్నూలు, గుత్తి,నంద్యాలలలో ప్రాథమిక,ఉన్నత విద్యనభ్యసించారు.ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ,ప్రతిభా పారితోషికాల (స్కాలర్ షిప్స్) సహాయంతో 1906లో మద్రాసులో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేశారు.తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా,1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారు.రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు.వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక,ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వకూడదని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. ’స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవారు. ఆ సమయంలోనే ఆయన వ్రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది.
 
నిస్వార్థ ప్రజాసేవకుడు
 
1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 1924లో కాకినాడలో కాంగ్రెసు సభలు జరిగిన సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించారు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు. మద్రాసు కౌన్సిలు మెంబరుగా, హరిసర్వోత్తమరావుగారు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. స్థానిక ప్రజల కష్ట నిష్ఠూరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేవారు. ఒకసారి కౌన్సిల్‌లో ‘జేమ్స్’ అనే యూరోపియన్ సభ్యుడొకడు పొగరుబోతుతనంగా భారతీయులను పరిహసిస్తూ ప్రసంగించాడట. దానితో హరిసర్వోత్తమరావుగారు ఉగ్రుడై లేచి, ఆ ఆంగ్ల సభ్యుని జాత్యహంకారాన్ని గట్టిగా ఖండించారు. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న మునుస్వామి నాయుడుగారితో సహా, సోదర సభ్యులందరూ రావుగారి మాటలకు హర్షించి అభినందించారు.
 
నంద్యాలలోనూ, కర్నూలులోనూ హిందూ ముస్లిముల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు హరిసర్వోత్తమ రావు గారు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య వివాదం పెద్దది కాకుండా సఖ్యత కుదిర్చారు. ఆ విధంగా హిందూ-ముస్లింల సఖ్యతకు, ఖద్దరు వ్యాప్తికి, త్రాగుడు నిషేధానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఆంధ్రదేశంలో చైతన్యం కలిగించడానికి తోడ్పడిన సంస్థలలో వేసవి పాఠశాలలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటి స్థాపనకోసం హరిసర్వోత్తమరావుగారి కృషి గణనీయమైనది. అనంతర కాలంలో వయోజన విద్యా కేంద్రాల స్థాపనకు ఇది ఆధారమైంది. దానివల్ల రైతు కూలీలు, కార్మికులు, వ్యవసాయదారులు విద్యావంతులైనారు.
 
నిర్భయుడు
 
అది 1922వ సంవత్సరం. దేశవ్యాప్తంగా కోర్టుల బహిష్కారం ఉధృతంగా సాగుతోంది. పెద్ద పెద్ద ఆదాయాలను మానుకొని ఎందరో మహనీయులు వకీలువృత్తిని త్యాగం చేస్తూ ఉండిన సమయమది. ఆ సంవత్సరం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గాంధీజీ ఒక విచిత్రమైన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ‘కోర్టుల బహిష్కారం నుంచి వాదులను మినహాయించాలి’ అన్నారు. దీనికి కారణం ఆశ్రితవాత్సల్యం. దేశపాండే, రాజేంద్రప్రసాద్ వంటి వారి కోసం కామోసు. వాదిగా కోర్టుకెక్కకపోతే లక్షలు నష్టపొయ్యే సందర్భమది. వారు అలా ఆర్థికంగా నష్టపోకూడదు, అలాగని స్వలాభం కోసం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారనే అపవాదు వారికి రాకూడదు, గౌరవానికి భంగం కలుగకూడదు. అందుకన్నమాట ఇప్పుడీ తీర్మానం. సభలో 250 మంది ఉన్నారు. ఆక్షేపించే ధైర్యం ఎవ్వరికీ లేదు.
 
ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు మన గాడిచెర్లవారు ధైర్యం చేసి నిలుచున్నారు. “గాంధీజీ! మీరు ఆలోచించే ఈ తీర్మానమును పెడుతున్నారా?” అని ప్రశ్నించారు. “వాది అనే ఆసామే లేకపోతే కోర్టే వుండదే? వకీళ్ళు వాదులవల్లనే గదా బ్రతికేది? వాది లేకుంటే సాక్షులెక్కడ వస్తారు? తొలగిస్తే బహిష్కారం పూర్తిగా తొలగించండి. లేకుంటే వున్నదున్నట్లే వుంచండి, సర్వకష్టాలు పడుతుండే యీ వకీళ్ళకు మాత్రం అన్యాయం చేయకండి’ అన్నారు.గాంధీజీ చప్పున గ్రహించారు. ‘నేను పెద్ద పొరపాటుపడ్డాను. బేషరత్తుగా నా ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకొంటున్నాను’ అని ఉపసంహరించుకొంటూ, తాను అప్పుడు నడుపుతూ ఉండిన ‘యంగ్ ఇండియా’ పత్రికలో జరిగినదంతా ప్రకటిస్తూ “ధైర్యశాలి హరిసర్వోత్తమరావు (The brave Hari Sarvottama Rao). గబుక్కునలేచి ఆక్షేపించినాడు.” అని పేర్కొన్నారు.
 
ఈ విషయాలన్నీ ‘నా జీవితంలో విస్మరించరాని ఘట్టములు’ పుస్తకంలో హరిసర్వోత్తమ రావుగారే స్వయంగా వివరించారు. అలాగే గాంధీగారి సహాయ నిరాకరణోద్యమ నిర్ణయం కూడా హరిసర్వోత్తమ రావుగారికి పెద్దగా నచ్చలేదు.
 
అలాగే ఒకసారి నెహ్రూ గారి నిర్ణయాన్ని కూడా రావు గారు వ్యతిరేకించడం, అందుకు ప్రతిగా తన కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాల్సిందిగా నెహ్రూ రావుగారిని ఆదేశించడం, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా రావు గారు ఆ ఆదేశాన్ని అనుసరించడం మనకు వారి జీవితంలో కనిపిస్తుంది. పార్టీ, ప్రభుత్వ పదవులనైనా వదులుకోవడానికి సిద్ధపడ్డారే కానీ…. తాను నమ్మిన సిద్ధాంతానికి, విలువలకు జీవితాంతం కట్టుబడి జీవించిన నిస్వార్థ దేశాభక్తుడాయన.
 
అలసిన దేహం ఒరిగిపోయింది
 
అనంతరం 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే అనేక పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మరణించారు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.
 
విజయవాడలోని సర్వోత్తమ భవనం, గ్రంథాలయం, సర్వోత్తముని స్మృతివనం

gadicherla 
 
బాల్యంలో గడచిన ఏ కొద్ది సంవత్సరాలలో మినహాయిస్తే ఆయనది 77 సంవత్సరాల త్యాగమయ జీవితం. ఎట్టి కష్ట పరిస్థితులలోనూ దైన్యమెరుగని, ధైర్యముడుగని ధీరోదాత్త జీవితం. పేరుకు తగినట్టు ఆయన సర్వోత్తముడే.
 
ఆర్ధిక ఇబ్బందులు
 
ఆయన ఎన్ని ఉద్యమాలకు పితృపాదుడో, ఎన్ని సంస్థలను ఆయన నిర్వహించారో ఊహించలేము. ఇన్ని సంస్థలను నిర్వహించి, ఇన్ని ఉద్యమాలు నిర్మించి, ఇన్ని పదవులనలంకరించి కూడా ఆయన మరణించేనాటికి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నారంటే ఆయన ఎంత నిస్వార్థ ప్రజాసేవకుడో మనం అర్థం చేసుకోవచ్చు.
 
1959 డిసెంబరు 14వ తేదీ రాత్రి ఇంట్లో పడిపోయినారు. మరురోజు రాయపేట ఆస్పత్రిలో చేర్పించేసరికే, మాటపడిపోయింది. అనంతరం ఆయన కుమార్తె మద్రాసులోని తమ ఇంటికి తీసుకెళ్ళారు. కుమార్తె అయినప్పటికీ ఒకరిదగ్గరవుండి వారిఖర్చులతో జరుపుకోవటం బహుశా రావుగారికి కష్టంగా తోచేదేమో. అవసాన కాలంలో తనకు ఆర్ధిక వనరులు కొరవడ్డాయని, తన జరుగుబాటుకు తనకు కనీసం ఏడాదికో వెయ్యి రూపాయలు అవసరమవుతాయని, ఆ మేరకు సంపాదించుకోవలసిన అవసరమున్నదని పేర్కొంటూ 1959 డిసెంబర్ 21న నాగభూషణం గారికి ఒక ఉత్తరం వ్రాశారు.
 
రావు గారు స్వర్గస్తులవటానికి ముందు, కేంద్ర ప్రభుత్వ హెూంశాఖామంత్రి శ్రీ గోవిందవల్లభ పంత్, హరిసర్వోత్తమరావుగారి దేశసేవలను శ్లాఘిస్తూ 2 వేల రూపాయల చెక్కును పంపించారు. ‘గాంధీ స్మారకనిధి’ సంస్థ వారు నెలకొక వందరూపాయలవంతున పంపేవారు.
 
వారి మరణ వార్తరాగానే ‘తెలుగుభాషాసమితి’ వారు రు 116/-లు కుటుంబానికి పంపి తమ కృతజ్ఞత చూపారు. ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు, రు 200, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘము రు 100, కుటుంబానికి అందజేశారు. వారి పుస్తకాల ద్వారా వచ్చిన కొంత పైకాన్ని నాగభూషణం గారందించారు. ఈ విధంగా ప్రభుత్వ ప్రజాసంస్థల ఆదరాభిమానాలతోనైతేనేమి రావుగారు స్వయంకృషితో తన ఖర్చులను తాను వెళ్ళబుచ్చుకొన్న ధన్యజీవి. చరితార్థుడైన ఆయన జీవితం చిరస్మరణీయం. ఒక నిస్స్వార్థ, నిరాడంబర దేశసేవకుడు. ఒక మహావ్యక్తి ఆయన. ఆ ఆదర్శమూర్తి త్యాగం మనకాదర్శం. నిస్స్వార్థం మనబాట. ఆయన అడుగు జాడల్లో పయనించడమే మనకర్తవ్యం.
 
రచనా వ్యాసంగం
 
గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదాన్ని మొదట్లో వ్యతిరేకించినా రామ్మూర్తి గారితో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం సర్వోత్తమ రావు గారు తన అభిప్రాయాన్ని మార్చుకుని తన రచనలను కూడా గ్రాంథికంలో కాకుండా వ్యావహారికంలో వ్రాయడం మొదలు పెట్టారు. పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించారు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు...
 
* ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు ఆయన తొలి సంపాదకులు. 1916 నుండి 1918 వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నారు.
 
* ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు.
 
* మహిళల సమస్యల పరిష్కరం కోసం ” సౌందర్యవల్లి ” అనే పత్రిక నడిపారు.
 
* మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లీషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు.
 
* జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు వ్రాశారు.
 
* రావుగారు అప్పట్లో కౌమోదకి, ఇంద్రావతి పత్రికలలో తీవ్రమైన వ్యాఖ్యలు – విమర్శలు వ్రాసేవారు.
 
* “స్పిరిట్యువల్ స్వదేశీ (or) హ్యుమానిటేరియన్ నేషనలిజం” పేరుతో గాంధీజీ ప్రవచించిన జాతీయత, స్వదేశీ ఉద్యమాలను గూర్చి ప్రబోధించే గ్రంథాన్ని వ్రాశారు. అలాగే గాంధీజీ వ్రాసిన “హైందవ స్వరాజ్యము” అనే గ్రంథాన్ని కూడా రావు గారు తెలుగులోకి అనువదించారు. మహాత్మాగాంధీ రచించిన ‘నీతి ధర్మము’, ‘మూర్ఖరాజు’ (కథ) అనే రెండు పుస్తకాలను కూడా రావుగారు తెలుగులోకి అనువదించారు.
 
*ఆయన వ్రాసిన ’శ్రీరామ చరిత్ర’ అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.
 
*ఆయన రచించిన ’పౌరవిద్య’ అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.
 
*ఆయన వ్రాసిన అబ్రహాము లింకను చరిత్ర (1907) అనే పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.
 
*‘వయోజన విద్య’ అనే తెలుగు పుస్తకాన్ని రచించారు. దీని మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953 లలో ముద్రించారు.
 
విశిష్టతలు
 
తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించారు. మచ్చుకు కొన్ని:
 
*రాయలసీమకు ఆ పేరు పెట్టింది ఆయనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టారు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.
 
* సంపాదకుడు, భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే... ఎంఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవాడు.
 
పెద్దల పలుకులు
 
* గాడిచర్ల గురించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చెప్పిన చిరు కవిత:
 
వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
 
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
 
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?
 
అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
 
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?
 
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
 
తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?
 
అందరికెవనితొ పొత్తు – అఖిలాంధ్రంబెవని సొత్తు?
 
ఏస్థాన కవిని నేనో, ఆ స్థానాధీశుడెవడు?
 
వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది
 
హరిసర్వోత్తముడాతడు, ఆంధ్రులపాలిటి దేవుడు
 
* గాడిచెర్ల వారి జయంతి నేడు
 
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.