అయోధ్య మందిరాన్ని పేల్చేస్తామని బెదిరించిన మక్సూద్ అన్సారీ అరెస్ట్

VSK Telangana    17-Sep-2024
Total Views |
 
ram
 
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని పేల్చేస్తానంటూ బెదిరించిన మక్సూద్ అన్సారీ అనే వ్యక్తి బిహార్‌లో దొరికిపోయాడు. భాగల్పూర్‌లోని బడీ ఖంజార్‌పూర్ ప్రాంతంలోని తన నివాసం వద్ద అతన్ని సెప్టెంబర్ 13న అరెస్ట్ చేసారు. ఆ అరెస్టులో యూపీ పోలీసులకు బిహార్ పోలీసులు సహకరించారు.
మక్సూద్ అన్సారీ తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని, రామ మందిరాన్ని పేల్చేస్తాననీ బెదిరించాడు. జూన్ 14న అతను ఫేస్‌బుక్‌లో అలాంటి బెదిరింపులను పోస్ట్ చేసాడు. దాంతో అప్రమత్తమైన నిఘా సంస్థలు మక్సూద్ అన్సారీ గురించి అన్వేషించడం మొదలుపెట్టాయి. చివరికి అతను బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా బిరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు.
శుక్రవారం నాడు పోలీసులు మక్సూద్‌ను బడీ ఖంజార్‌పూర్ వద్ద పట్టుకున్నారు. అతన్నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య మందిరాన్ని పేల్చేస్తానని బెదిరింపును పోస్ట్ చేసిన ఫోన్ కూడా వాటిలో ఉంది.
మక్సూద్ అన్సారీకి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. మక్సూద్‌కు అమీర్ అనే ఒక వ్యక్తితో సంబంధాలున్నాయి. ఆ అమీర్ జైషే మొహమ్మద్ సంస్థలో పనిచేస్తున్నాడన్న అనుమానాలున్నాయి. అందువల్ల మక్సూద్‌కు కూడా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండి ఉండవచ్చని సందేహాలు తలెత్తాయి. ఇంకా, నిందితుడు సైబర్ నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.మక్సూద్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టి, తర్వాత ఉత్తరప్రదేశ్ తీసుకువెళ్ళారు.