ఎడతెరిపి లేని వానలతో కనీవినీ ఎరుగని వరద బీభత్సం చోటు చేసుకుని అల్లకల్లోలమైన విజయవాడ వాసులకు నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం బాసటగా నిలిచింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద నీట మునిగి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న బాధితుల ఆకలి తీర్చాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాలతో ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయం తగిన ఏర్పాట్లు చేసింది.
దుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రామారావు సుమారు 50 వేల మందికి సరిపడా పులిహార సిద్ధం చేయించారు. ఒక్కొక్క ప్యాకెట్లో 300 గ్రాములు పులిహోర ఉండేలా పొట్లాలు చేసి బాధితులకు పంపిణీ చేశారు. మొత్తం 15 వేల కేజీల పులిహోరను రెవిన్యూ విభాగానికి అందించారు. ఈ వరద త్వరగా తగ్గుముఖం పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ప్రార్థించామని కార్యనిర్వహణాధికారి రామారావు తెలియజేశారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతాలు వరద ప్రమాదానికి గురై నీట మునిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి పడవలు తదితర సామగ్రితో బాధితులకు చేయూతను అందిస్తున్నాయి. వరద బాధితులకు పునరావాసంతో పాటుగా వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు సహా కావలసినవి సమకూర్చుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సంఘ్ కార్యకర్తలు, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలోకి దిగి తమ వంతు చేయూతను అందిస్తున్నారు.