సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులని శ్రద్ధాంజలి సభ స్మరించుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జ్యేష్ట ప్రచారక్ అయిన భీష్మా జీ దేశవిదేశాలలో వివిధ బాధ్యతలను త్రికరణశుద్ధితో నిర్వహించి నిర్మించిన విలువల బాట తామందరికీ మార్గదర్శకమైందని శ్రీ భీష్మాచారి సంస్మరణ సభలో పాల్గొన్నవారంతా ఆర్ద్రతతో స్మరించుకున్నారు.
హైదరాబాదు నారాయణగూడలోని కేఎంఐటీలో సెప్టెంబర్ 22వ తేదీ, ఆదివారం నాడు జరిగిన భీష్మా జీ శ్రద్ధాంజలి సభలో వారి కుటుంబ సభ్యులు, స్వయం సేవకులు, ఆత్మీయులు, మిత్రులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో విచ్చేసి భీష్మాజీతో ముడిపడిన తమ మనోభావాలను వెల్లడిస్తూ భావోద్వేగాలకు లోనయ్యారు. విశ్వవిభాగ్‌లో బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ వివిధ దేశాలు పర్యటించి విశ్వమానవుడై వ్యవహరించిన ఈ భరతమాత సేవకుడితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని పరమ పూజ్యనీయ సర్ సంఘ్‌చాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు వి.భాగయ్య, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్లు శ్రీ బండారు దత్తాత్రేయ, ఇల గణేశన్ తదితరుల సందేశాలను సభలో చదివి వినిపించారు.
ప్రమిదలోని కలికలా జాతి కొరకు జ్వలిస్తా... నా జాతి కొరకు జీవిస్తా... అంటూ భీష్మా జీ జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ శ్రద్ధాంజలి సభలో ఆలపించిన గీత్ ప్రతి ఒక్కరి హృదయాన్నీ కదిలించింది.
ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ సభ్యులు శ్రీ మనోహర్ షిండే తమ నివాళులు అర్పిస్తూ... 60వ దశకం మధ్యలో భాగ్యనగర్‌లోని శివాజీ శాఖతో భీష్మాజీ అనుబంధం మొదలైందని, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ద్వారా ఎందరికో ప్రేరణగా నిలిచారని... ప్రత్యేకించి యోగ్యులైనవారికి పలు విధాలుగా తోడై నిలిచి ఆత్మీయతకు ప్రతిబింబమయ్యారని వారి సుగుణాలను సభకు తెలిపారు. తమిళనాడులో భీష్మాజీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజులలో ఒక కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం చొరవ తీసుకుని బిల్డర్ల సమావేశం ఏర్పాటు చేసి కార్యసాధకులై నిలిచారని భీష్మా జీ పట్టుదలను మనోహర్ షిండే వెల్లడించారు.
సంఘ ఉత్తర క్షేత్ర కార్యకారిణి సదస్యులు రామేశ్వర్ జీ మాట్లాడుతూ భీష్మా జీ అనుసరించిన ఉన్నత విలువలను సభకు తెలిపారు. ఖలిస్థాన్ ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో పంజాబులో అడుగుపెట్టిన భీష్మా జీ ప్రదర్శించిన మనో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వివరించారు. ఆ సమయంలో పంజాబ్‌ను వదలి వలసపోతున్న వారిని ఆపి వారిలో మనోబలాన్ని పెంచారని, అలాగే రామజన్మభూమి ఉద్యమ కాలంలోనూ కరసేవకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని తెలియజేశారు.
దక్షిణ మధ్యక్షేత్ర సహ క్షేత్ర ప్రచారక్ భరత్ జీ మాట్లాడుతూ... ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒక వ్యక్తి తనను తాను మలచుకునే తీరుకు భీష్మా జీ జీవితం అద్దం పడుతుందన్నారు. శ్రీరామునిలా స్మిత పూర్వ భాషణం (ముందుగా తామే చిరుమందహాసంతో పలుకరించడం)తో ఎందరి హృదయాలనో గెల్చుకున్న భీష్మాజీ.. డాక్టర్ జీ ఆశయాలను అనుసరించి జీవించారని, ఆ విధంగా డాక్టర్ జీ తత్వరూపమై నిలిచారని, సంఘ కార్యాన్ని తుది శ్వాస వరకూ మోశారంటూ భీష్మాచారి సద్గుణాలను తెలియజేశారు.
శుద్ధ సాత్విక ప్రేమకు ప్రతిరూపం.. అంటూ భీష్మా జీకి తమ అంజలి ఘటించారు సేవా ఇంటర్నేషనల్ గ్లోబల్ కోఆర్డినేటర్ శ్యాం పరండే. భీష్మాజీ ఫిజీ దేశంలో సంఘ బాధ్యతను నిర్వర్తిస్తున్న రోజుల్లో పలువురు వారిస్తున్నప్పటికీ వినకుండా అక్కడి మురికివాడలను సందర్శించి వారికి ప్రేమను పంచారని, ఫిజీ ప్రజలు భీష్మాజీని చూడటానికి పరుగు పరుగున వచ్చారని చెప్పారు. మాతృభాషకు దూరమైన ఫిజీలోని తమిళులకు ఆ భాషను నేర్పించడానికి కృషి చేశారని తెలియజేస్తూ అనంతమైన ఓర్పు భీష్మా జీకి స్వంతమన్నారు.
భీష్మా జీ అన్నయ్య కృపాచారి తమ ఆత్మీయ సోదరునికి నివాళులు అర్పిస్తూ జీవితపు అనుభవంలో తన కంటే తన తమ్ముడే (భీష్మా జీ) పెద్ద అన్నారు. ఆశయాలతో జీవిస్తునే కుటుంబ సంపర్కం విలువను గుర్తెరిగి ఎందరికో ఆత్మీయుడయ్యారని, భీష్మాచారి అన్నగానే తనకు గౌరవమంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
భీష్మా జీతో గల అనుబంధాన్ని డాక్టర్ వేద్ ప్రకాశ్ తెలియజేస్తూ... భారతీయ సంప్రదాయ విలువలు, పద్ధతులపై వారికి ఎనలేని విశ్వాసం ఉందన్నారు. ఒక సందర్భంలో 150 మందితో గృహ సంపర్కం చేసి, వారితో ఫొటోలు దిగి ప్రతి ఒక్కరి ఇంటికీ స్వయంగా వెళ్లి అందించారని, నేటి కాలపు వాట్సాప్, సోషల్ మీడియాలను వినియోగించుకుంటూనే ప్రత్యక్ష సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవారని చెప్పారు.
అగ్గిలా జ్వలిస్తూనే మంచు నిండిన హృదయంతో భీష్మా జీ ఉండేవారని ఉత్తరాఖండ్ నుంచి విచ్చేసిన రాజేష్ తన మనోభావాలను వెల్లడించగా... 365 రోజులూ భీష్మా జీ పంపించే చైతన్యపూరిత వాట్సాప్ సుప్రభాత సందేశాలు తనలో స్ఫూర్తిని నింపాయని మెల్‌బోర్న్ నుంచి విచ్చేసిన జైపాల్ రెడ్డి తెలిపారు. పాండిచ్చేరి నుంచి విచ్చేసిన అరవింద స్పందిస్తూ భీష్మాజీ నుంచి దండ యుద్ధ, నియుద్ధ, ఘోష్ శిక్షణ పొందానని, శిక్షణ ఇవ్వడంలో వారికి వారే సాటి అని కొనియాడారు. చెన్నైలో దండ, నిక్కర్‌తో కనిపించేందుకు భయపడే రోజులలో... ఖలిస్థాన్ ఉగ్రవాదంతో పంజాబ్ గడగడలాడుతున్న రోజుల్లో చిరుమందహాసంతో అక్కడివారిని జయించిన ఘనత భీష్మా జీదేనని స్వయంసేవక్ సుధాకర్ ప్రస్తుతించారు.
అఖిల భారతీయ ధర్మ జాగరణ సహా ప్రముఖ్ శ్యామ్ కుమార్... స్వర్గీయ భీష్మాజీతో తనకు గల 40 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని, మనోభావాలను రాతపూర్వకంగా తెలియజేస్తూ పంపిన సందేశాన్ని సభలో చదివి వినిపించారు. శ్యామ్ కుమార్ తమ సందేశంలో ఇలా తెలిపారు... "శ్రీ భీష్మాచారి గారి ఆకస్మిక మరణం నన్ను చాలా దిగ్బ్రాంతికి గురి చేసింది. చాలా బాధ కల్గింది. 40 ఏళ్ల అనుబంధం మా ఇద్దరిది. ఎప్పుడు నవ్వుతూ పలకరించే వారు. శాంత స్వభావులు.వారిలో కోపము ఎప్పుడు చూడలేదు. మృదు భాషి, మిత భాషి , పూర్వ భాషి. వారు చెన్నైలో కొంతకాలం, పంజాబ్‌లో కొంతకాలం విభాగ్ ప్రచారక్‌గా పని చేస్తున్నపుడు అపుడపుడు భాగ్య నగర్‌లో కలిసే అదృష్టం కలిగేది. వారు వచ్చినపుడు అనేక విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. అలాగే ఫిజీలో, శ్రీలంకలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకునే వారము. చాలా విషయాలు చెప్పి స్ఫూర్తినిచ్చేవారు. అలా అనేకమంది కార్యకర్తలకు పని చేయడానికి ప్రేరణ ఇచ్చేవారు. వారి జీవితమే అందరికి ఒక స్ఫూర్తి. గత కొద్ది కాలం నుండి భాగ్యనగర్‌లో ఉంటూ అనేక మంది పాత కార్యకర్తలను క్రియాశీలం చేశారు. ఆఖరి క్షణం వరకు కూడా అదే నిష్ఠతో పని చేశారు. వారిమాటల్లో, చేతల్లో సంఘమే ప్రతిబింబించేది. అలాంటి ఆదర్శ వ్యక్తిని కోల్పోవటం సంఘానికి పెద్ద లోటు. వారి కుటుంబానికి కూడా తీరని లోటు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సంఘ పనిలో జీవితము గడపడమే నిజమైన శ్రద్ధాంజలి. బాధాతప్తమైన హృదయంతో నా ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను."
రామజన్మభూమి ఉద్యమ సమయంలో రామమందిర నిర్మాణానికి మద్దతుగా ఫిజీ దేశంలో 15 వేలమందితో భీష్మాజీ నిర్వహించిన భారీ ర్యాలీని వక్తలు స్మరించుకున్నారు. కరోనా సమయంలో 40 రోజుల పాటు ఆవు పాలను మాత్రమే స్వీకరించి దేహాన్ని దేవాలయంగా మలచుకున్న తీరును ప్రశంసించారు.
సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నారాయణమూర్తి తమ వ్యాఖ్యానంలో భీష్మాజీ దైర్యసాహసాలను వివరిస్తూ వారికి గుండె సమస్యలున్నప్పటికీ ఆత్మబలం, ఆత్మస్థైర్యంతో నిబ్బరంగా ఉంటూనే పలు అంతస్తుల భవనాలు ఎక్కి దిగుతూ... వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అందరిలోనూ ఆ స్ఫూర్తిని రగిలించేవారని... ఉన్నత విలువలను నిలబెట్టారని భీష్మాచారి ఉన్నత వ్యక్తిత్వాన్ని సభలో ఆవిష్కరించారు.
సుప్రభాత్ పేరిట భీష్మా జీ పలు సందర్భాల్లో వ్యక్తీకరించిన స్ఫూర్తిదాయక సూక్తుల పుస్తకంతో పాటుగా భీష్మాజీ చిత్రంతో కూడిన జ్ఞాపికను శ్రద్దాంజలి సభకు హాజరైనవారికి అందజేశారు.