దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు శనివారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను సీపీ తన బృందంతో పరిశీలించారు. ఘాట్‌రోడ్డు, ఓం టర్నింగ్, క్యూలైన్లు, అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే మార్గంతో పాటు భక్తులకు బయటకు వచ్చే మార్గాలను తనిఖీ చేశారు.
ఆర్జిత సేవలు, ఉభయదాతల కోసం ఏర్పాటు చేసే క్యూలైన్లను పరిశీలించారు. గతంలో ఉభయదాతలకు కలిగిన అసౌకర్యం గురించి పోలీసు అధికారులు సీపీ దృష్టికి తీసుకువెళ్లగా, ఈ దఫా అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సీపీ రాజశేఖర్‌బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. సీపీ వెంట డీసీపీ గౌతమిశాలి, దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.