అరుణాచల్‌ సరిహద్దుల్లో ఓ శిఖరానికి పేరు పెట్టిన భారత్

VSK Telangana    29-Sep-2024
Total Views |
 
arunachal
 
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారని మండిపడింది.
రక్షణ శాఖకు చెందిన దిరంగ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వంచర్ స్పోర్స్ (నిమాస్)కు చెందిన 15 మంది సభ్యుల బృందం గత శనివారం తవాంగ్ ప్రాంతంలోని పర్వత శిఖరానికి చేరుకుంది. ఆ శిఖరానికి బౌద్దుల గురువు ఆరో దలైలామా, తవాంగ్‌లో జన్మించిన సంగ్‌యాంగ్ గ్యాస్టొ (క్రీ.శ 17-18 శతాబ్దం) గౌరవార్దం ఆయన పేరును పెట్టింది. సంగ్‌యాంగ్ గ్యాస్టో శిఖరం అనే పేరును ఖరారు చేసింది.
భారత సైన్యం అనేక సాహస యాత్రలు చేపట్టినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదనలను తిప్పికొట్టే లక్ష్యంతో చాలా మంది వీటిని ద్వంద్వ-ప్రయోజన ప్రయత్నాలుగా చూస్తారు.
 
 
అరుణాచల్‌ను ‘జాంగ్నాన్’ అనే పేరుతో చైనా పిలుస్తోన్న విషయం తెలిసిందే. శిఖరానికి ఆరో దలైలామా పేరు పెట్టడం అనేది టిబెట్ స్వతంత్ర ఉనికిని గుర్తుచేస్తుంది. టిబెట్‌‌పై పట్టుకోసం చైనా చేస్తోన్న ప్రయత్నాలకు ఇది ఓ రకంగా ఎదురుదెబ్బే. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. ఆరో దలైలామ పేరును ఎన్నుకోవడం అనేది ఆయన కాలానుగుణ జ్ఞానానికి నివాళి, అంతకు మించిన మోన్పా కమ్యూనిటీకి ఆయన చేసిన కృషికి నివాళి అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘మీరు ఏమి ప్రస్తావించారో నాకు తెలియదు.’ అని పేర్కొన్నారు. ‘జాంగ్నాన్ ప్రాంతం చైనా భూభాగం.. మన భూభాగంలోకి రావడం చట్టవిరుద్ధం.. చైనా భూభాగాన్ని ‘అరుణాచల్ ప్రదేశ్’‌గా భారత్ వ్యవహరించడం చట్టవిరుద్ధమని నేను మరింత విస్తృతంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో చైనా వైఖరి స్థిరంగా ఉంది’ అని స్పష్టం చేశారు. నిమాస్ డైరెక్టర్ కల్నల్ రణ్‌వీర్ సింగ్ జైస్వాల్ నేతృత్వంలోని పర్వతారోహకుల బృందం 6,383 మీటర్ల ఎత్తులో ఉండే ఈ శిఖరానికి 15 రోజుల్లో చేరుకుంది. తవాంగ్ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పర్వత శిఖరాల్లో ఇది కూడా ఒకటి.