బ్రిటిష్ పాలకులకు భారతీయుల సత్తా చూపిన గాజుల లక్ష్మీ నరసు చెట్టి
VSK Telangana 03-Sep-2024
Total Views |
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, వ్యాపారవేత్త గాజుల లక్ష్మీ నరసు చెట్టి జీవిత విశేషాలపై కూర్చిన తెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 01, 2024, ఆదివారం ఉదయం సమాచార భారతి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల (ఖైరతాబాద్)లో ఘనంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ సంగనబట్ల భరత్ కుమార్, గౌరవ అతిథిగా మద్రాస్ హైకోర్టు లాయర్ – పుస్తక ఆంగ్ల మూల రచయిత బి జగన్నాథ్, సీనియర్ జర్నలిస్ట్ – పుస్తక అనువాదకులు శ్రీ వేదుల నరసింహం పాల్గొన్నారు.
సంవిత్ ప్రకాశన్ ప్రచురణ సంస్థ వెలువరించిన గాజుల లక్ష్మీ నరసు చెట్టి తెలుగు పుస్తకానికి ఆంగ్ల మూలమైన “The First Native Voice of Madras: Gazulu Lakshminarasu Chetty" రచయిత జగన్నాథ్ మాట్లాడుతూ నరసు చెట్టి జీవితాన్ని అధ్యయనం చేసేందుకు మద్రాస్ రికార్డ్స్ ఆఫీసు, చెన్నైలోని కన్నెమరా లైబ్రరీలలో తాను జరిపిన పరిశోధన గురించి తెలిపారు. చీకటిలో మగ్గిపోయిన చరిత్ర పుటలను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రయత్నాల ఫలమే ఈ పుస్తకమని తెలిపారు. నరసు చెట్టి కృషి, విలువల మధ్య ఆయన స్థాపించిన సిద్లూ చెట్టి అండ్ సన్స్, మద్రాస్ కాటన్ క్లీనింగ్ కంపెనీ, వ్యాపార సంస్థలు, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం నెలకొల్పిన ఉపయుక్త గ్రంథ కారణ సభ, మద్రాస్ సమాజంపై వీటి ప్రభావం గురించి జగన్నాథ్ వివరించారు. అత్యంత కీలక సమయంలో దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన నరసు చెట్టి వంటి పెద్దల జీవితాలను తప్పక చదువుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ కాలంలో కరడుగట్టిన బ్రిటిష్ పాలన రోజుల్లోనే నరసు చెట్టి అవలంబించిన పరిశోధనాత్మక పాత్రికేయ విధానాలను ఈ సందర్భంగా రచయిత జగన్నాథ్ ప్రస్తావించారు. చెట్టి నడిపిన మద్రాస్ క్రెసెంట్ పత్రిక ద్వారా పరిశోధనాత్మక కథనాలను ప్రచురించి బ్రిటిష్ పత్రికలను గడగడలాడించడమే గాక ఒక వివాదాస్పద బిల్లు ఉపసంహరించుకునేలా చేసిన తీరును వివరించారు. బ్రిటిష్ పాలకుల క్రూరమైన పన్ను విధానాలు, వేధింపులకు స్వస్తి పలికేలా 12 వేల సంతకాలు సేకరించిన ఘటన గురించి జగన్నాథ్ తెలిపారు. ఇంకా, మద్రాస్ ప్రెసిడెన్సీలో బిషప్‌లకు లభించే రాయల్ గన్ సెల్యూట్‌ని నరసు చెట్టి నిలిపివేయించారు. అంతటితో ఆగక బ్రిటిష్ వారి క్రూరాతి క్రూరమైన శిక్షలు, వేధింపుల గురించి బ్రిటిష్ పార్లమెంటులో చర్చ జరిగేందుకు ఈ మహనీయుడు సాధనంగా నిలిచిన తీరును తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ సంగనబట్ల భరత్ కుమార్ మాట్లాడుతూ రచయిత జగన్నాథ్, అనువాదకులైన సీనియర్ జర్నలిస్ట్ వేదుల నరసింహం కృషిని అభినందించారు. కేవలం 8వ తరగతి వరకూ మాత్రమే చదివి, మద్రాసులో నగరంలో తెలుగు మాతృభాషగా ఉన్న గాజుల లక్ష్మీ నరసు చెట్టి... అప్పట్లో క్రైస్తవం తీసుకుంటేనే ఇంగ్లీష్ చదువు చెప్పేలా మిషనరీలను ప్రోత్సహించిన బ్రిటిష్ పాలకులను ఎదిరించడం చాలా గొప్ప విషయమని భరత్ కుమార్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో 10 వేల సర్క్యులేషన్‌తో మద్రాస్ క్రెసెంట్ పత్రికను నరసు చెట్టి నడిపారని, మద్రాసు ప్రజలేగాక లండన్ వాసులు కూడా ఈ పత్రికను చదివారని తెలిపారు. భారత ప్రజలను బ్రిటిష్ వారు ఎలా వేధిస్తున్నారనేది కమ్యూనికేషన్ పెద్దగా లేని రోజుల్లో బ్రిటిష్ పార్లమెంట్ నుంచి అక్కడి ఎంపీని రప్పించి మరీ చూపిన ఘనత ఈయనదేనని ప్రశంసించారు. ఆ ఎంపీ ఈ వేధింపులపై బ్రిటన్ పార్లమెంటులో మాట్లాడి ఇక్కడి బ్రిటిష్ పాలకులకు చీవాట్లు పడేలా చేశారని భరత్ వివరించారు. బలవంతంగా క్రైస్తవాన్ని రుద్దడం, నిర్బంధ బైబిల్ తరగతుల వంటి చర్యలను ఆయన ప్రతిఘటించారని నరసు చెట్టి పోరాట స్ఫూర్తిని సభకు తెలిపారు. ఇలా ఇంకెందరో మహనీయుల త్యాగాలు చరిత్ర పుటల్లో ఉండిపోయి వెలుగు చూడని పరిస్థితులున్న నేపథ్యంలో ఇలాంటివారి చరిత్ర లోకానికి తెలిసేలా ఆయా ప్రాంతాల ప్రజలు ముందుకు రావాలని భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మపురి ప్రాంతంలో ధర్మ రక్షణ కోసం పాటుపడి రాజర్షిగా ప్రశంసలందుకున్న గుండు రాజన్న శాస్త్రికి ఆలయం కట్టిన సంగతిని తెలిపారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎందరో మహనీయుల కృషిని లోకానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
గాజుల లక్ష్మీనరసు చెట్టి తెలుగు పుస్తకం అనువాదకులైన సీనియర్ జర్నలిస్ట్ వేదుల నరసింహం మాట్లాడుతూ తన అనుభూతులను పంచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తీరుకు వ్యతిరేకంగా గాజుల లక్ష్మీ నరసు చెట్టి స్థానిక హిందువులకు ఒక బలమైన గళంగా నిలబడి తన పత్రిక ద్వారా ప్రజలను చైతన్య పరిచారని, ఆయన గురించి నేటి తరాలకు తెలియడానికే ఈ పుస్తకాన్ని అనువదించామని చెప్పారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కౌన్సిల్ మెంబర్ కూడా అయిన నరసు చెట్టి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నిర్బంధ బైబిల్ తరగతులను వ్యతిరేకించిన వ్యక్తి అని కొనియాడారు. నరసు చెట్టి విలువలు నేటికీ అనుసరణీయమంటూ సరళమైన భాషలో ఈ పుస్తకాన్ని తెలుగువారికి అందించే ప్రయత్నం చేశామన్నారు.
సమాచార భారతి అధ్యక్షులు జి.గోపాలరెడ్డి మాట్లాడుతూ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. గాజుల లక్ష్మీ నరసు చెట్టి ఆంగ్ల పుస్తకాన్ని కూడా సంవిత్ ప్రకాశన్ ప్రచురణలో వెలువడి ఒక రోజు ముందు సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ (CSIS) ద్వారా ఆవిష్కరణ జరిగింది.
Lakshminarasu Chetty wielded the power of the press as a tool for liberation. His fearless journalism via Madras Crescent challenged the hegemony of the British Empire, exposing the injustices inflicted upon the native populace. Read more in this book. https://t.co/naBij9EOiy